మహిళా యోధులకు పట్టం

ABN , First Publish Date - 2020-02-18T06:19:02+05:30 IST

‘ఆర్మీ కమాండర్లుగా మహిళలకూ అవకాశం కల్పించాల్సిందే...’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సైన్యంలో కొనసాగుతోన్న లింగ వివక్షకు, పురుషాధిపత్యానికి తెరదించుతూ సరికొత్త చరిత్రకు నాంది పలికింది. భారత ఆర్మీలో మహిళలకు...

మహిళా యోధులకు పట్టం

‘ఆర్మీ కమాండర్లుగా మహిళలకూ అవకాశం కల్పించాల్సిందే...’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సైన్యంలో కొనసాగుతోన్న లింగ వివక్షకు, పురుషాధిపత్యానికి తెరదించుతూ సరికొత్త చరిత్రకు నాంది పలికింది. భారత ఆర్మీలో మహిళలకు పురుషులతో సమానంగా శాశ్వత కమిషన్‌లో అవకాశమివ్వాలంటూ 2010లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ద్విసభ్య ధర్మాసనం కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌తో పాటు, కమాండ్‌ పోస్టులను కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


ఈ సందర్భంగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు సైన్యంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను తీవ్రంగా గర్హించాయి. ఏ కారణం చేతనైనా మహిళా ఆఫీసర్లకు ఆర్మీలో అవకాశాలను పరిమితం చేయడం ద్వారా వారి హక్కులకు భంగం కలిగించవద్దని హితవు చెప్పింది. మహిళలను యుద్ధ రంగంలోకీ అనుమతించాలని చెప్పింది.


భారత ఆర్మీలో మహిళా అధికారులను స్వల్పకాలిక (షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌) అవకాశాలకే పరిమితం చేయడం సరికాదంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేసిన కేంద్రం.. ఆర్మీ జవాన్లలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారని, కమాండ్‌ హోదాలో మహిళలను అధికారులుగా అంగీకరించేందుకు వారు మానసికంగా సిద్ధం లేరని, మహిళల శారీరక లక్షణాలకు పరిమితులున్నాయని, గర్భధారణ, పిల్లల సంరక్షణ కారణంగా మహిళలు చాలా కాలం సెలవులో ఉండాల్సి వస్తుందని, వారు అధికారులుగా సైనికులను ముందుకు నడిపించలేరని, శత్రువులు వారిని యుద్ధ ఖైదీలుగా బందీలు చేసుకునే ప్రమాదముందనీ పలు కారణాలు చూపుతూ స్ర్తీలకు కమాండ్‌ పోస్టులు, పర్మనెంటు కమిషన్‌ హోదా ఇవ్వలేమంటూ కేంద్రం కొన్ని వాదనలు ముందుకు తెచ్చింది. వీటిలో హేతుబద్ధత ఎంతున్నా కూడా మహిళలు ఇతర రంగాల్లోనూ రాణిస్తున్నారు కాబట్టి అవి వారికి ప్రతిబంధకాలు కాబోవు అన్న ఉద్దేశంతో ఈ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం మహిళాశక్తికి పట్టం కట్టింది. సుప్రీం తీర్పును ‘ప్రగతిశీల, చారిత్రక తీర్పు’ అంటూ మహిళాలోకం హర్షం వ్యక్తం చేసింది.


జవాన్లు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి వారు మహిళలను తమ అధికారులుగా స్వీకరించరు అని చెప్పడం ఏ విధంగా చూసినా సరయినది కాదు. ఈ పురుష దురహంకారపూరిత ‘మైండ్‌సెట్‌’ను మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. టెక్నాలజీ విస్తృతంగా అమలులోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో రణక్షేత్రంలోకి ప్రత్యక్షంగా దిగే అవసరమే లేకుండా సాంకేతికత సాధనాలు, ఆయుధాలతోనే యుద్ధాలు జరిగే పరిస్థితుల్లో శారీరక శక్తి కన్నా మేధోపరమైన యుక్తులు, వ్యూహ చతురత, కార్యశీలతకే ప్రాధాన్యత పెరిగింది. అయినా కొన్ని సాకులతో శక్తిస్వరూపిణులైన మహిళలకు పరిమితులు విధించడం ప్రభుత్వ పితృస్వామిక, ఫ్యూడల్‌ భావాలకు నిదర్శనం. 


ఝాన్సీలక్ష్మీబాయి, రాణి రుద్రమ, రజియా సుల్తానా వంటి వీరాంగనల వీరోచిత పోరాటాలతో కీర్తిపొందిన మన దేశంలో వలసపాలకుల కాలంలో మహిళలను రణక్షేత్రంలోకి నిషేధించారు. కానీ, సైనికులకు వైద్య సేవలందించేటందుకు డాక్టర్లు, నర్సులుగా మాత్రం అనుమతించారు. 1992 నుంచే సైన్యంలోని స్వల్పకాలిక సర్వీసులోకి, అదీ ఇంజనీరింగ్‌, రవాణా, న్యాయ, శిక్షణ వంటి యుద్ధేతర కార్యకలాపాలు నిర్వహించే విభాగాల్లోకి మహిళలను అనుమతించడం మొదలైంది. సోల్జర్‌ వంటి కింది స్థాయి పోస్టుల్లోకి అనుమతించనేలేదు. కానీ, మహిళా అధికారులు కోరుకుంటున్నట్లు కమాండ్‌ పోస్టుల్లోకీ, కంబాట్‌ పోస్టుల్లోకీ అనుమతించలేదు. దానితో వారు న్యాయ పోరాటం చేస్తూ కొన్ని పోస్టులను దక్కించుకుంటూ వస్తున్నారు. ఇలా కొట్లాడి దక్కించుకున్న పోస్టుల్లో వారు అసాధారణ శక్తియుక్తులు, నైపుణ్యాలు ప్రదర్శిస్తూ మెడల్స్‌, అవార్డులు కూడా అందుకుంటున్నారు. ఇలా బాహ్య శత్రువుతో మాత్రమే కాదు, ‘ఆధిక్య భావ’న గల అంతర్గత శత్రువుతోనూ పోరాటాలు చేస్తూ, ప్రతి చోటా శౌర్యస్థైర్యాలు చూపుతూ ‘శెభాష్‌...’ అనిపించుకున్న మన మహిళా యోధులను కించపరిచేలా వ్యవహరించడం విచారకరమే. 2019లో ఆర్మీలోని పది యుద్ధేతర విభాగాల్లో మహిళా అధికారులకు పర్మనెంటు కమిషన్‌ అవకాశం కల్పించారు. అయితే, 2014 తరువాత చేరిన వారికి మాత్రమే అంటూ మెలిక పెట్టారు. ఇలాంటి షరతులేవీ పెట్టకుండా పురుషులతో సమానంగా మహిళలను కూడా అన్ని పోస్టుల్లోకి, అన్ని విభాగాల్లోకి అనుమతించి ఏ రోజు చేరిన వారికైనా శాశ్వత కమిషన్‌ కట్టబెట్టాల్సిందేనని సుప్రీం ఆదేశించింది. దీనితో త్రివిధ రక్షణ దళాల్లో శక్తిస్వరూపిణుల ప్రాతినిధ్యం పెరుగుతుందని ఆశిద్దాం.

Updated Date - 2020-02-18T06:19:02+05:30 IST