షీరోయిజమ్!

ABN , First Publish Date - 2020-09-06T16:48:12+05:30 IST

సీన్‌ మారుతోంది... కథానాయకులే కాదు, ‘కథా’నాయికలు కూడా స్టార్‌డమ్‌ను ఏలుతున్నారు. ఒకప్పుడు కేవలం ప్రేమపాఠాలు వల్లిస్తూ గ్లామర్‌డాల్స్‌ ముద్రతో, హీరోల వెంటపడిన హిందీ హీరోయిన్లు ఇప్పుడు కథలను తమ చుట్టూ తిప్పుకుంటూ కోట్లు కొల్లగొడుతున్నారు. నవతరం సినిమా క్రమంగా ‘జెండర్‌’ అడ్డుగోడలను కూల్చేస్తూ ఎన్నో వండర్‌లు సృష్టిస్తోంది. బిగ్‌స్ర్కీన్‌, ఓటీటీ... వేదిక ఏదైనా ‘విమెన్‌ ఆన్‌ టాప్‌’. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడామె హీరోయిన్‌ కాదు... హీరో.. షీరో..!

షీరోయిజమ్!

సీన్‌ మారుతోంది... కథానాయకులే కాదు, ‘కథా’నాయికలు కూడా స్టార్‌డమ్‌ను ఏలుతున్నారు. ఒకప్పుడు కేవలం ప్రేమపాఠాలు వల్లిస్తూ గ్లామర్‌డాల్స్‌ ముద్రతో, హీరోల వెంటపడిన హిందీ హీరోయిన్లు ఇప్పుడు కథలను తమ చుట్టూ తిప్పుకుంటూ కోట్లు కొల్లగొడుతున్నారు. నవతరం సినిమా క్రమంగా ‘జెండర్‌’ అడ్డుగోడలను కూల్చేస్తూ ఎన్నో వండర్‌లు సృష్టిస్తోంది. బిగ్‌స్ర్కీన్‌, ఓటీటీ... వేదిక ఏదైనా ‘విమెన్‌ ఆన్‌ టాప్‌’. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడామె హీరోయిన్‌ కాదు... హీరో.. షీరో..! 


మన సినిమాలకు ఒక ‘లెక్క’ ఉంటుంది. సినీ వినీలాకాశంలో మహిళా పాత్రలు ఎప్పుడూ స్వయం ప్రకాశితాలు కావు. ‘హీరో’ చుట్టూ తిరగాల్సిందే. తల్లిగానీ, చెల్లిగానీ... ఆలిగానీ, చెలిగానీ... పాత్ర ఏదైనా హీరోను ఎలివేట్‌ చేసేందుకు పరిమిత ఫ్రేముల్లో మౌనంగా ఎన్ని త్యాగాలకైనా సిద్ధం కావాల్సిందే. ఒకవేళ ‘ఆమె’ అస్తిత్వ కోణంలో నుంచి కథను చూపడమంటే బాక్సాఫీసు ‘లెక్క’ తప్పుతుందనే భయం. అయితే ఇటీవల ఈ భ్రమల తెరలు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతున్నాయి. నవతరం హీరోయిన్లు ధైర్యంగా వసూళ్ల లెక్కలను సరిచేస్తున్నారు. అస్తిత్వాన్నీ నిలుపుకుంటున్నారు. విద్యాబాలన్‌, కంగనా రనౌత్‌లు తొమ్మిదేళ్ల క్రితం వేసిన అడుగుల్లో అడుగు వేసుకుంటూ చాలామంది హీరోయిన్లు మహిళాశక్తిని చాటుతూ, తమదైన ముద్ర వేసుకుంటూ ఇప్పటికే చాలాదూరం ప్రయాణించారు. భావితరం సినిమాపై ‘బిలియన్‌’ ఆశలు కల్పిస్తున్నారు. దీపికా పదుకొణే ‘పీకూ’ నుంచి ‘ఛపాక్‌’ దాకా... తాప్సీ ‘పింక్‌’ నుంచి ‘రష్మీ రాకెట్‌’ దాకా... అలియాభట్‌ ‘రాజీ’ నుంచి ‘గంగూభాయి కతియావాడీ’ దాకా... ప్రియాంకా చోప్రా ‘మేరీకోమ్‌’ నుంచి ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ దాకా... ఇలా ఏ కథ అయినా తీసుకోండి... అవన్నీ మహిళాశక్తికి ప్రతిరూపాలే. ఇటీవల ఓటీటీలో సందడి చేసిన ‘శకుంతలాదేవి’, ‘గుంజన్‌ సక్సేనా’తో పాటు రాబోయే ‘తేజాస్‌’, ‘దుర్గావతి’, ‘తలైవి’... ఇలాంటి హిందీ సినిమాల లెక్క పెద్దదే. ఈ మార్పు మరిన్ని అద్భుతాలు చేయనుంది.



 కంగనా... మజాకా!

బాలీవుడ్‌లో హీరోలకు పోటీగా హీరోయిన్లకు స్టార్‌ స్టేటస్‌ రావడానికి ఈతరంలో ఒకరకంగా కంగనా రనౌత్‌ కారణం అని చెప్పొచ్చు. షారుక్‌, ఆమిర్‌, సల్మాన్‌ ‘ఖాన్‌’త్రయంతో పాటు... పెద్ద హీరోలు తమ సరసన ఆమెకు అవకాశాలు ఇవ్వకపోయినా, ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ఒంటరిపోరు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగింది కంగనా. ఆమె ఎంచుకున్న ఇతివృత్తాలన్నీ మహిళా ప్రాధాన్యతను చాటినవే కావడం విశేషం. 2011లో వచ్చిన ‘తను వెడ్స్‌ మను’ కథ బోల్డ్‌గా ఉండే ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. టైటిల్‌లోని మను పాత్రలో మాధవన్‌ కనిపించినప్పటికీ తనూజ త్రివేదీగా కంగనా చేసిన అల్లరికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ రోజుల్లోనే ఈ సినిమా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సుమారు 90 కోట్ల రూపాయలు వసూలు చేయడంతో హీరోయిన్ల పట్ల రచయితలు, దర్శకుల దృష్టికోణం మారింది. పైగా ఇదే ఏడాది చివర్లో విడుదలైన విద్యాబాలన్‌ ‘డర్టీ పిక్చర్‌’ వంద కోట్ల క్లబ్‌లో చేరిన తొలి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాగా రికార్డులు సృష్టించడంతో... మహిళా కోణంలో సినిమాలు తీసినా కాసుల పంట పండుతుందనే నమ్మకం బాలీవుడ్‌లో ఏర్పడింది. ఈ పరంపరలో కంగనా మరింత దూకుడును ప్రదర్శించి అనేక విజయాలను నమోదు చేస్తూ ‘క్వీన్‌’ నుంచి కింగ్‌గా ఎదిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె కేవలం తన చుట్టూ అల్లుకునే కథలనే ఎంచుకుంటూ, బాలీవుడ్‌ హీరోలను ఎదిరించి నిలబడిన ధీరవనితగా పేరు తెచ్చుకుంది. ‘క్వీన్‌’, ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’ చిత్రాలు అతి సులువుగా ‘రెండు వందల కోట్ల క్లబ్‌’లో చేరి కంగనా రేంజ్‌ను అమాంతంగా ఆకాశానికెత్తాయి. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని సినిమా నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టి ‘మణికర్ణిక’ (సుమారు రూ.150 కోట్ల వసూళ్లు)తో డేరింగ్‌ హీరోయిన్‌గా ముద్ర వేసుకుందామె. జయాపజయాలతో సంబంధం లేకుండా బాలీవుడ్‌ను ఏలుతోంది. రాబోయే ‘ధాకడ్‌’, ‘తేజాస్‌’, ‘తలైవి’ (జయలలిత బయోపిక్‌) కూడా కంగనా సత్తా చాటే చిత్రాలుగా కనిపిస్తున్నాయి. ఆమె అస్తిత్వం కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా సామాజిక, సినీ రంగంలోని చీకటికోణాలను బట్టబయలు చేస్తుంటుంది కంగనా. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ ఆత్మహత్య సంఘటనలో కూడా.. ఆ రంగంలో వేళ్లూనుకున్న బంధుప్రీతిపై విరుచుకుపడిందామె. సినిమాల్లోనే కాదు, నిజజీవితంలో కూడా వీరవనిత అని నిరూపించుకుంది.




సైలెంట్‌ కిల్లర్‌!

ఒకరకంగా బాలీవుడ్‌ను బయోపిక్‌ల బాట పట్టించిన హీరోయిన్‌గా విద్యాబాలన్‌కు ఆ క్రెడిట్‌ దక్కుతుంది. అప్పటిదాకా హీరోలే బయోపిక్‌లకు అర్హులు అనే భ్రమలను ఆమె తొలగించింది. సిల్క్‌స్మిత జీవిత కథ ఆధారంగా 2011లో రూపొందిన ‘డర్టీపిక్చర్‌’లో విద్యాబాలన్‌ నటన ఆమెకు జాతీయ అవార్డుతోపాటు సరికొత్త ఇమేజ్‌ను తీసుకొచ్చింది. ఈ సినిమా అనూహ్యంగా వందకోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడంతో, అంతకుముందు కేవలం హీరోయిన్‌గా ఉన్న ఆమె ఈ సినిమాతో ‘కథా’నాయికగా మారింది. ‘కహానీ’ (2012)లో తన భర్త జాడ వెదుక్కుంటూ కోల్‌కతాకు వెళ్లిన గర్భిణి విద్యా బాగ్చీగా వ్యవస్థపై పోరాటం చేసి, ‘తుమ్హారీ సులూ’ (2017)లో ఓ సాధారణ గృహిణి కలల జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది విద్యాబాలన్‌.


2019లో వచ్చిన ‘మిషన్‌ మంగళ్‌’లో సైంటిస్ట్‌ తారాషిండేగా ప్రధాన భూమికను పోషించడంతో పాటు ఇటీవలి ఓటీటీలో విడుదలైన ‘శకుంతలాదేవి’ (2020) బయోపిక్‌లో హ్యూమన్‌ కంప్యూటర్‌గా ఆకట్టుకుంది. బయటి ప్రపంచానికి ఓ గణిత మేధావిగా మాత్రమే తెలిసిన శకుంతలా దేవి... ఒక కూతురుగా, మహిళగా, తల్లిగా ఎదుర్కొన్న కష్టాలను, భావోద్వేగాలను విద్యాబాలన్‌ ఈ సినిమాలో బాగా పలికించి, మహిళలకు తమ జీవితం పట్ల స్పష్టత ఉండాలనే సందేశాన్ని అందించింది. ఈ విధంగా ఆమె ఎంచుకుంటున్న కథాంశాలన్నీ వివిధ కోణాల్లో మహిళాశక్తిని చాటడమేగాక, బాక్సాఫీసు దగ్గర వందలకోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. 41 ఏళ్ల నడివయసులో కూడా విద్య కోసం దర్శకులు కొత్త కొత్త కథలను సృష్టిస్తున్నారంటే ఆమె సత్తా ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. 




తిరుగులేని తాప్సీ! 

ఒకానొక సందర్భంలో తాప్సీని కంగనా ‘సెకండ్‌ గ్రేడ్‌ హీరోయిన్‌’ అని కామెంట్‌ చేసినప్పటికీ బాలీవుడ్‌లో ఆమె విజయాలు తక్కువేం కాదు. నిజం చెప్పాలంటే నటిగా తాప్సీకి వస్తున్న అవకాశాలు మరెవరికీ రావట్లేదనేది నిజం. కెరీర్‌ మొదట్లో గ్లామర్‌డాల్‌గా కనిపించిన తాప్సీ పొన్ను ఎప్పుడైతే దక్షిణాది చిత్రాలను వదిలి బాలీవుడ్‌కు వెళ్లిందో... అప్పటి నుంచే ఆమె ఆలోచన విధానంలో కూడా స్పష్టమైన మార్పు వచ్చింది. నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘పింక్‌’ విజయం ఆమెలో అమితమైన ఆత్మవిశ్వాసాన్ని నింపింది. దాంతో పాత్రల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉండటం మొదలెట్టింది. ‘నామ్‌ షబానా’, ‘సూర్మా’, ‘ముల్క్‌’, ‘మన్‌మర్జియా’ల్లో విభిన్న పాత్రలతో అందరి దృష్టినీ ఆకర్షించి ‘బద్లా’ (2019)తో భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 10 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా 138 కోట్లు వసూలు చేసి ట్రేడ్‌ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.


‘పింక్‌’లాగే ఇందులో కూడా అమితాబ్‌ బచ్చన్‌ ఉన్నప్పటికీ కథ మొత్తం నైనా సేథీ (తాప్సీ) అనే విజయవంతమైన వ్యాపారవేత్త పాత్ర చుట్టే తిరుగుతుంది. గత ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) రోజున విడుదలైన ఈ సినిమాలో మరోసారి అమితాబ్‌తో పోటీపడి నటించింది తాప్సీ. దాంతో విభిన్న, విలక్షణమైన ప్రధాన పాత్రల కోసం దర్శకులు ఆమె వైపు కూడా చూడటం మొదలెట్టారు. ‘రివాల్వర్‌ దాదీలు’గా పేరొందిన చంద్రో తోమర్‌, ప్రకాశీ తోమర్‌ జీవితాల ఆధారంగా బయోపిక్‌ డ్రామాగా రూపొందిన ‘సాండ్‌ కీ ఆంఖ్‌’లో వయసు మీద పడిన పాత్రలో కూడా నటించిందంటే తాప్సీ ఆలోచనా సరళిని, ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘థప్పడ్‌’ గృహహింసను చూపుతూ మహిళా ఆత్మగౌరవంపై సరికొత్త చర్చను లేవనెత్తింది. భర్త కొట్టిన ఒక చెంపదెబ్బను భార్య కేవలం చెంపదెబ్బలా కాకుండా తన ఆత్మగౌరవానికి తగిలిన దెబ్బగా భావించి చేసే పోరాటం ఆలోచింపజేస్తుంది. తాప్సీ రాబోయే సినిమాలు కూడా మహిళాశక్తిని చాటేవే. ‘రష్మీ రాకెట్‌’ ఒక పల్లెటూరి అమ్మాయి పరుగుల రాణిగా మారిన వైనాన్ని చూపితే... ‘శభాష్‌ మిథూ’ మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ జీవితకథ ఆధారంగా రూపొందుతోంది.





నవ యువ దీపిక..

ఆధునిక యువతికి కేరాఫ్‌ అడ్రస్‌గా కనిపించే దీపికా పదుకొణే స్టార్‌ హీరో షారుక్‌ సరసన ‘ఓం శాంతి ఓం’తో గ్రాండ్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్‌ ప్రారంభంలో స్టార్‌ హీరోల సరసన రొటీన్‌ పాత్రలకు కూడా తనదైన మార్క్‌ను జోడిస్తూ మార్కులు కొట్టేసింది. అయితే ఆమె స్టార్‌డమ్‌ను మలుపు తిప్పిన చిత్రం మాత్రం ‘పీకూ’ అనే చెప్పాలి. 2015లో విడుదలైన ఈ సినిమాలో చాదస్తపు బెంగాళీ తండ్రికి కూతురుగా, ఆధునిక భావజాలం నిండిన యువతిగా ఆమె సహజ నటన అందర్నీ కట్టిపడేసింది. ఒకవైపు అమితాబ్‌, మరోవైపు ఇర్ఫాన్‌ఖాన్‌ వంటి దిగ్గజాలతో సెమీ ఆర్ట్‌ సినిమాగా రూపొందిన ‘పీకూ’ అప్పట్లోనే 140 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి బాలీవుడ్‌ సినిమాకు కొత్త దారులు వేసింది. దీపిక మరిన్ని మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేసేందుకు ధైర్యాన్ని ఇచ్చింది. ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’ కమర్షియల్‌ సినిమాలు అయినప్పటికీ మహిళా పాత్రలే వాటికి ప్రధానం... ఆధారం. టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతూనే దీపిక ‘ఛపాక్‌’ (2019) వంటి సినిమాలో నటించడం ఒకవిధంగా సాహసమే. కథ కొత్తగా, బలంగా ఉంటే ముఖాన్ని మార్చుకోవడానికి కూడా ఆమె వెనుకాడలేదు. యాసిడ్‌ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్‌ అనే యువతి జీవితకథ ఆధారంగా రూపొందిన ‘ఛపాక్‌’లో దీపిక నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. కేవలం విన్నర్స్‌ జీవితాలేగాక... సమాజంలో ఎన్నో రకాలుగా దెబ్బతిని, పోరాటం సాగించిన ఎంతోమంది యువతులు, మహిళల వెతలను కూడా సినిమాలుగా తీసే ధైర్యం ఈ సినిమా ద్వారా కలిగిందనే చెప్పాలి.




‘రాజీ’లేని పోరాటం..

అతి తక్కువ సమయంలో అమితమైన ఆదరణ పొందిన యువ హీరోయిన్‌గా అలియాభట్‌ పేరు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం ఆమె ఎంచుకుంటున్న పాత్రలే అనేది విశ్లేషకుల అభిప్రాయం. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ (2012)లో కాలేజీ స్టూడెంట్‌గా సందడి చేసిన ఆలియా తను అందరిలాంటి నటిని కాదని రుజువు చేసుకుంది. ‘హైవే’, ‘2 స్టేట్స్‌’, ‘ఉడ్తా పంజాబ్‌’, ‘డియర్‌ జిందగీ’ సినిమాలు చాలు... ఆలియా చిన్నపిల్ల కాదు, చిచ్చరపిడుగు అని తెలియడానికి. అయితే దర్శకురాలు మేఘనా గుల్జార్‌ తీసిన ‘రాజీ’ (2018) ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. హరిందర్‌ సిక్కా ‘కాలింగ్‌ సెహమత్‌’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆలియా భారతీయ గూఢచారిగా జీవించింది. దేశభక్తిని చాటడంలో మహిళా శక్తి గొప్పదనానికి సెల్యూట్‌ చేశారంతా. అందుకే ‘రాజీ’ 200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఒక యువనటి సినిమా... అది కూడా 35 కోట్లతో తెరకెక్కిన చిన్న సినిమా పెద్ద హీరోల స్థాయి కలెక్షన్లు అందుకోవడంతో ట్రేడ్‌వర్గాల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ఆ మరుసటి ఏడాది ఆలియా ‘గల్లీబాయ్‌’లో చేసిన సఫీనా ఫిర్దౌసి పాత్ర కూడా ఎంచదగినదే. ముంబయి గల్లీలోని యువతరం తీరుతెన్నులను ఈ సినిమా కళ్లకు కట్టి, మనదేశం తరఫున ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యింది. దీంతో అగ్ర దర్శకులు సైతం ఆమెతో సినిమాలు తీయాలనుకుంటున్నారు. సంజయ్‌ లీలా భన్సాలీ తన బయోగ్రఫికల్‌ సినిమా ‘గంగూభాయి కతియావాడి’ కోసం ఆలియానే ఎంచుకున్నారు. ఈ సినిమా ఆమెను మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.




ముఖ్య ‘భూమి’క

సాధారణ మహిళా జీవితాలను అంతే సాదాసీదాగా పోషిస్తూ భూమి పెడ్నేకర్‌ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అసిస్టెంట్‌ కాస్టింగ్‌ డైరెక్టర్‌ నుంచి 2015లో అనుకోకుండా ‘దమ్‌ లగా కే హైసా’లో లావుపాటి అమ్మాయిగా తెరమీద కనిపించి... అందరి సానుభూతిని, అభిమానాన్ని చూరగొన్న భూమి సగటు గృహిణి పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. తెరపై ఇంతకు ముందెన్నడూ చూపించని మహిళా సమస్యలకు ప్రతినిధిలా కనిపిస్తోంది. ‘టాయిలెట్‌ ఏక్‌ ప్రేమ్‌కథ’, ‘శుభ్‌ మంగళ్‌ సావధాన్‌’, ‘బాలా’లో చర్చించిన సమస్యలు సగటు భారతీయ మహిళలకు అనుభవమే. ‘సాండ్‌ కీ ఆంఖ్‌’లో భూమి 70 ఏళ్లకు పైబడిన రివాల్వర్‌ దాదీగా ముసలి పాత్రను ఎంచుకోవడం నవ్య సినిమా పట్ల ఆమెకున్న అంకితభావాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా ఇలాంటి పాత్రలను వేసేందుకు రెగ్యులర్‌ హీరోయిన్లు విముఖత చూపుతారు. కానీ పాత్రల పట్ల అవగాహన, మెచ్యూరిటీ ఉన్నవారు మాత్రమే వాటిల్లోని గాఢతను అర్థం చేసుకుని నటిస్తారు. అలాంటివారిలో భూమి పెడ్నేకర్‌ ముందువరుసలో ఉంటుంది. ఆమె రాబోయే సినిమా ‘దుర్గావతి’ కూడా ఈ కోవలోనే వస్తుంది. 


వీరేకాదు... ప్రియాంకచోప్రా, రాణీ ముఖర్జీ వంటి సీనియర్ల నుంచి, జాన్వీ కపూర్‌, శ్రద్ధాకపూర్‌ వంటి జూనియర్ల దాకా అవకాశం వచ్చినప్పుడు గాఢత, సాహసంతో కూడిన పాత్రలను ఎంచుకుంటూనే కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. ‘మర్దానీ’, ‘మేరీకోమ్‌’, ‘గుంజన్‌ సక్సేనా’, ‘హసీనా పార్కర్‌’లాంటి సినిమాలు గ్లామర్‌ను పక్కకు తోసి, హీరోయిన్లను ‘హీరో’లుగా చూపే ప్రయత్నం చేశాయి. వీటికి తోడు రాబోయే సినిమాల లిస్టు, హీరోయిన్లు ఎంచుకుంటున్న కథలను చూస్తుంటే ‘ఆమె’ మరింత ఆత్మవిశ్వాసంతో, తనకు ఎదురయ్యే సమస్యలపై ధైర్యంగా పోరాడుతుందని స్పష్టం అవుతోంది. ఆర్ట్‌, ఎకనామిక్స్‌ కలగలసిన చోట ‘బిలియన్‌’ డాలర్ల ‘లెక్క’లను నవతరం హీరోయిన్లు సరిచేస్తుంటే... ‘ఆమె’పై మరింత ఫోకస్‌ చేయక తప్పదు కదా! మొత్తానికి ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బాలీవుడ్‌లో హీరోలకు దీటుగా హీరోయిన్లు ఎదుగుతున్నారు. తమ సత్తా చాటుకుంటున్నారు. అవును... ఇప్పుడు బాలీవుడ్‌ ‘సీన్‌’ మారింది! 






మహిళా దర్శకులకు ఛాన్స్‌!

కమర్షియల్‌ సినిమాకు ఇప్పుడు అర్థం మారింది. హీరోల ఇమేజ్‌ చట్రాలకు బాలీవుడ్‌లో కాలం చెల్లిపోవడంతో కథ, పాత్ర తీరుతెన్నులు బలంగా ఉంటేనే సినిమాలు ఆడుతున్నాయి. దాంతో ఊహకందని, అత్యంత సున్నితమైన అంశాలు సైతం తెరమీదకొస్తున్నాయి. ‘మహిళా సమస్యలను చూపడంలో మేమేం తక్కువ కాదం’టున్నారు మహిళా దర్శకులు. దాంతో మహిళా దర్శకులతో పనిచేసేందుకు స్టార్‌ హీరోయిన్లు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే మేఘనా గుల్జార్‌ ‘తల్వార్‌’, ‘రాజీ’, ‘ఛపాక్‌’ వంటి విభిన్న సినిమాలతో దర్శకురాలిగా సత్తా చాటుకుంది. అనూ మీనన్‌ ‘శకుంతలాదేవి’ జీవితాన్ని ప్రతిభావంతంగా తెరకెక్కించింది. ప్రముఖ దర్శకుడు నితీశ్‌ తివారీ భార్య అశ్వినీ అయ్యర్‌ ఇటీవలే కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో ‘పంగా’ సినిమా తీసింది. గతంలో ‘మార్గరిటా విత్‌ ఏ స్ట్రా’ ను రూపొందించిన సొనాలీ బోస్‌ ఇటీవల ప్రియాంకచోప్రా హీరోయిన్‌గా వచ్చిన ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది. ‘జిందగీ నా మిలేగీ దొబారా’, ‘గల్లీబాయ్‌’వంటి సినిమాలతో ఇప్పటికే బాలీవుడ్‌ క్రేజీ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకుంది జోయా అక్తర్‌. వీరితో పాటు గౌరీషిండే (ఇంగ్లిష్‌ వింగ్లిష్‌, డియర్‌ జిందగీ), రీమా కగ్తీ (తలాష్‌, గోల్డ్‌)లాంటి మహిళా దర్శకులు తెరపై మహిళా సమస్యలను సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు.



టైటిల్స్‌ నుంచే... సినిమా అంతా ‘హీరో’యిజమే ఉన్నప్పుడు టైటిల్స్‌ మాత్రం అందుకు భిన్నంగా ఎందుకుంటాయి? కానీ గత కొన్నేళ్లుగా ఈ ట్రెండ్‌లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. హీరోయిన్ల సినిమాలు కూడా వందకోట్లను అలవోకగా రాబడుతుంటే టైటిల్స్‌ కూడా వారికి అనుగుణంగానే పెడుతున్నారు. అంటే మహిళా టైటిల్స్‌కు రానురాను గిరాకీ పెరుగుతోందన్నట్టే. ‘క్వీన్‌’, ‘పింక్‌’, ‘పీకూ’, ‘మణికర్ణిక’, ‘రాజీ’, ‘తుమ్హారీ సులూ’, ‘పద్మావత్‌’, ‘మేరీకోమ్‌’, ‘నీర్జా’, ‘శకుంతలాదేవి’, ‘గుంజన్‌ సక్సేనా’, ‘దుర్గావతి’, ‘శభాష్‌ మిథూ’... ఈ లిస్టు పెరుగుతోందంటే సినిమాల్లో ‘ఆమె’ బలపడుతోందన్నమాటే కదా!


మేమేం తక్కువ కాదు...

స్టార్‌ హీరోలు పారితోషికం మాట మరిచి చాలాకాలమే అయ్యింది. వసూళ్లు వందల కోట్లలో ఉంటుండటంతో మన హీరోలు లాభాల్లో వాటా అడుగుతున్నారు. అంటే సినిమా నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. ఇప్పుడు అలాంటి అవకాశాలను హీరోయిన్లు కూడా అందిపుచ్చుకుంటున్నారు. కంగనా రనౌత్‌ ఇటీవలే ‘మణికర్ణిక ఫిల్మ్స్‌’ పేరిట నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. తను నటించే సినిమాల్లో పార్ట్‌నర్‌షిప్‌ను కోరుకుంటోంది. ప్రియాంకచోప్రా ‘పర్పుల్‌ పెబ్బెల్‌ పిక్చర్స్‌’ పేరిట వివిధ భాషల్లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తోంది. విద్యాబాలన్‌ భర్తతో కలిసి ‘రాయ్‌ కపూర్‌ ఫిల్మ్స్‌’ను పర్యవేక్షిస్తుంది. ఈ నిర్మాణ సంస్థ ద్వారా ‘ఇందిరా గాంధీ’ బయోపిక్‌ను వెబ్‌ సిరీస్‌గా నిర్మిస్తూ, నటించేందుకు ఆమె సిద్ధం అవుతోంది. దీపికా పదుకొణే ‘ఛపాక్‌’ ద్వారా నిర్మాణరంగంలోకి అడుగుపెట్టింది. ‘కెఎ ఎంటర్‌టైన్‌మెంట్‌’ ద్వారా మరిన్ని సినిమాలు నిర్మిస్తానంటోంది. 


‘మహానటి’ మాత్రమే!  

బాలీవుడ్‌లో ‘షీ’రోయిజం పెరుగుతుంటే తెలుగు సినిమాల్లో మాత్రం హీరోయిన్లకు ఇంకా అలాంటి స్టేటస్‌ రాలేదనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం ఇక్కడ బాక్సాఫీస్‌ ‘లెక్క’లు ఇంకా మారలేదు. హీరో సెంట్రిక్‌గానే కథలను రూపొందిస్తున్నారు. అప్పుడెప్పుడో విజయశాంతి ‘ప్రతిఘటన’, ‘కర్తవ్యం’, ‘ఒసేయ్‌ రాములమ్మ’... వంటి సినిమాలతో హీరోలతో పోటీపడింది. ధైర్యంగా నిలిచి గెలిచింది. ఆ తర్వాత మళ్లీ అలాంటి ఇమేజ్‌ను ఎవరూ అందుకోలేదు. ఇటీవలి కాలంలో సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’ మాత్రమే కనిపిస్తుంది. తెలుగులో కూడా పరిశోధనలు చేస్తే ఇలాంటి మరిన్ని బయోపిక్‌లకు అవకాశాలున్నాయి. అదేవిధంగా ఆధునిక మహిళా కోణంలో కూడా సినిమాలు వస్తేనే హీరోయిన్లు ‘కథా’నాయికలుగా ఎదుగుతారు. అప్పుడే వారి కోసమే కథలు రాసే స్థాయి వస్తుంది. ఇప్పటికే మిగతా భాషల్లో జరుగుతున్న ఈ మార్పును మనవాళ్లు గుర్తించాలి.  

- చల్లా శ్రీనివాస్‌

Updated Date - 2020-09-06T16:48:12+05:30 IST