అధిక ఫీజుల రోగం కుదిర్చాడు!

ABN , First Publish Date - 2020-09-09T05:30:00+05:30 IST

‘ఈ ఆస్పత్రులను ఎవరూ నియంత్రించలేరా? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇన్‌కంట్యాక్స్‌ అధికారులు ఏం చేస్తున్నారు?’

అధిక ఫీజుల రోగం కుదిర్చాడు!

 ‘ఈ ఆస్పత్రులను ఎవరూ నియంత్రించలేరా? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇన్‌కంట్యాక్స్‌ అధికారులు ఏం చేస్తున్నారు?’ అని ఆస్పత్రులు వేసే అదనపు బిల్లుల గురించి అనుకోని వారుండరు. ఆస్పత్రులు వేసే అదనపు బిల్లులను అడ్డుకొనే అధికారం ప్రభుత్వానికి ఉందని నిరూపిస్తున్నారు పుణేలో ఇన్‌కంట్యాక్స్‌ అధికారిగా పనిచేస్తున్న మన తెలుగు వాడు నేలపట్ల అశోక్‌బాబు. కొవిడ్‌ సమయంలో మధ్యతరగతి ప్రజల ఇబ్బందులను తొలగించడానికి అనుసరిస్తున్న పద్ధతులను ఆయన ‘నవ్య’కు వివరించారు. 


‘‘లాక్‌డౌన్‌ తర్వాత కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వ ఆస్పత్రులు సరిపోని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అనేక మంది ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవటం మొదలుపెట్టారు. కానీ వారు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులు ఎవరి దగ్గర నుంచి ఎంత ఫీజు వసూలు చేయాలనే విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వం మూడు జీవోలు జారీ చేసింది. రోగి ఆరోగ్య పరిస్థితి బట్టి 4 వేల నుంచి 9వేల రూపాయల వరకూ ఈ ఫీజులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫీజులో ఏయే సేవలు కలిపి ఉంటాయి? వేటికి అదనంగా చెల్లించాలి? అనేది కూడా ఈ జీవోల్లో స్పష్టంగా ఉంది. ప్రభుత్వ ఉద్దేశం బానే ఉంది కానీ, అమలు విషయానికి వచ్చేసరికే అనేక ఇబ్బందులు మొదలుపెట్టాయి. జూన్‌ నెలలో ప్రైవేట్‌ ఆస్పత్రుల తీరుపై   తీవ్రమైన విమర్శలు వచ్చాయి. దీనితో ప్రభుత్వం ప్రైవేట్‌ ఆస్పత్రులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి.. చర్యలు తీసుకోవటానికి ఒక్కో ప్రాంతానికి ఒక్కో  స్పెషల్‌ అధికారిని నియమించింది. 


ఎన్నో సమస్యలు..

పుణేలో ఆదిత్య బిర్లా ఆస్పత్రి, డీవై పాటిల్‌ కాలేజీ ఆస్పత్రి, గ్లోబల్‌ హాస్పిటల్‌, స్టార్‌ హాస్పిటల్‌ వంటి పెద్ద ఆస్పత్రులే కాకుండా చిన్నవి కూడా అనేకం ఉన్నాయి. వీటిలో కొన్ని వేలమంది చికిత్స పొందుతున్నారు. ఏ ఒక్క ఆస్పత్రి మూసేసినా ప్రజలు వైద్యం అందక ఇబ్బంది పడతారు. ఇటు ప్రజలకు ఇబ్బంది లేకుండా, అటు ఎక్కువ ఫీజులు వసూలు చేయకుండా చూడటానికి రెండంచెల వ్యూహాన్ని అనుసరించాం. దీనిలో మొదటిది ప్రైవేట్‌ ఆస్పత్రులలో తనిఖీలు చేయటం. మా టీమ్‌ అధికారులు పూణేలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు మొదలుపెట్టారు. కొన్ని వేల మంది రోగుల బిల్లులను తనిఖీ చేయలేం కాబట్టి ర్యాండమ్‌గా కొన్ని బిల్లులను తీసాం. ప్రభుత్వ జీవో ప్రకారం కాకుండా అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని రోగులకు తిరిగి ఇవ్వాలని ఆయా ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశాం. అయితే దీని వల్ల ప్రజలకు  ప్రయోజనం కొంతే. అందరికీ ప్రయోజనం కలగాలంటే వారిలో కూడా అవగాహన పెరగాలి. అందుకోసం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించటం మొదలుపెట్టాం. కొంత మంది ఆడిటర్స్‌ను బృందాలుగా నియమించాం. వీరు ఆస్పత్రులకు వెళ్లి- అక్కడ బిల్లులను పరిశీలిస్తారు. దీన్పి ‘ప్రీ ఆడిట్‌’ అంటారు.  ఇలా మేం తీసుకున్న చర్యల ద్వారా ప్రైవేట్‌ ఆస్పత్రులు అదనంగా వసూలు చేసిన రూ. 63 లక్షలను ప్రజలకు తిరిగి ఇప్పించగలిగాం. మరో 36 లక్షల రూపాయల అదనపు బిల్లులను ముందే గుర్తించగలిగాం. ఇదంతా కేవలం పది రోజుల్లో చేశాం! దీనికి స్థానిక, జాతీయ మీడియా నుంచి మంచి స్పందన లభించింది. వందలమంది తమ అభ్యర్థనలు పంపడం మొదలుపెట్టారు.  ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఈ మొత్తం వ్యవహారం నాకు అనేక పాఠాలు నేర్పింది. ప్రభుత్వ వ్యవస్థను సక్రమంగా నడిపించటానికి ఆదేశాలు చాలవు. వాటిని అమలు చేయటానికి సమర్థులైన అధికారులు కూడా కావాలి. వారికి మద్దతునిచ్చే పై అధికారులూ కావాలి. నాకు ఇవన్నీ సమకూరాయి. ఈ ప్రయోగాన్ని మిగిలిన ప్రాంతాల్లో కూడా అమలు చేస్తే ప్రజలకు చాలా మేలు కలుగుతుంది. ప్రభుత్వాలు ఈ దిశగా దృష్టిపెడితే మంచిది.’’


బిల్లులు ఎలా పెరుగుతాయంటే...

‘‘ఆస్పత్రుల్లో బిల్లులు పెరగటానికి కొన్ని కారణాలుంటాయి. చాలా సందర్భాలలో వీటి గురించి రోగులకు కానీ వారి బంధువులకు కానీ తెలియదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం- ఒక సాధారణ రోగి నుంచి ఆస్పత్రి రూ.4వేలు వసూలు చేయాలనుకుందాం. ఈ నాలుగు వేల రూపాయల్లో - ఎక్స్‌రే, ఈసీజీ, 2డీ ఎకో వంటివి ఉంటాయి. అంటే వీటికి అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. వీటిని ‘ఇన్‌క్లూజివ్స్‌’అంటారు. రోగికి సేవలు అందించడానికి వాడే పీపీఈ కిట్‌లు, మాస్క్‌లు, మందులకు డబ్బు కట్టాల్సి ఉంటుంది. వీటిని ‘ఎక్స్‌క్లూజివ్స్‌’ అంటారు. చాలా సందర్భాలలో ఏవి ‘ఎక్స్‌క్లూజివ్స్‌’, ఏవి ‘ఇంక్లూజివ్స్‌’ అనే దానిపై రోగులకు అవగాహన ఉండదు. అలాగే కొవిడ్‌తో పాటుగా ఇతర వ్యాధులు ఉన్నవారిని స్పెషలిస్టులు చూసినప్పుడు- వారు వేసే విజిటింగ్‌ చార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఒక హార్ట్‌ స్పెషలిస్ట్‌ వచ్చి చూస్తే- మామూలు సమయాల్లో వెయ్యి రూపాయలు ఫీజు వేస్తే- ప్రస్తుతం నాలుగు వేల రూపాయలు ఫీజుగా చూపిస్తున్నారు. మా  తనిఖీల్లో ఇలాంటివెన్నో బయటపడ్డాయి.’’

Updated Date - 2020-09-09T05:30:00+05:30 IST