మీరే హీరోలు!

ABN , First Publish Date - 2021-06-18T05:04:33+05:30 IST

కొవిడ్‌తో మరణించిన వారి మృతదేహాలను పట్టుకునేందుకు కుటుంబ సభ్యులు సైతం వెనకడుగు వేయగా మున్సిపాలిటీ సిబ్బంది వారికి దహన, ఖనన సంస్కారాలు చేసి హీరోలుగా నిలచారని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ప్రశంసించారు.

మీరే హీరోలు!
శ్మశానాల్లో దహన సంస్కారాలు నిర్వహించే కార్మికుడికి ప్రశంసాపత్రం అందజేస్తున్న కలెక్టర్‌

కొవిడ్‌ సేవకులకు కలెక్టర్‌ సత్కారం


నెల్లూరు (సిటీ), జూన్‌ 17 :  కొవిడ్‌తో మరణించిన వారి మృతదేహాలను పట్టుకునేందుకు కుటుంబ సభ్యులు సైతం వెనకడుగు వేయగా మున్సిపాలిటీ సిబ్బంది వారికి దహన, ఖనన సంస్కారాలు చేసి హీరోలుగా నిలచారని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ప్రశంసించారు. కరోనా విపత్తులో సమాజానికి సేవలందించిన వారు చిరస్మరణీయులన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ పారిశుధ్య విభాగం సిబ్బందిని గురువారం కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆయన సత్కరించారు. శ్మశాన వాటికల్లో మృతదేహాలను దహనం, ఖననం చేసిన వారితోపాటు కొందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌  మాట్లాడుతూ కరోనా ప్రబలుతున్న సమయంలో పారిశుధ్య విభాగం మెరుగ్గా పని చేసిందని, బయటకు రావడానికే భయపడిన సమయంలో ప్రాణాలకు తెగించి నగరాన్ని శుభ్రం చేసిన ఖ్యాతి వారికే దగ్గుతుందని కితాబిచ్చారు. వారి సహకారంతోనే కొంతైన ఫలితాలు సాధించగలిగామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌, ఎంహెచ్‌వో వెంకటరమణయ్య పాల్గొన్నారు. అయితే కార్యాలయంలో పని చేసే వారిని కూడా సన్మాన గ్రహీతల జాబితాలో చేర్చడంపై కార్పొరేషన్‌ కార్యాలయంలో విమర్శలు రేగాయి. కాగా, నగర పాలక సంస్థకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. దీనిని త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, పౌర సేవల కోసం ఆ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-06-18T05:04:33+05:30 IST