అదృష్టంగా భావిస్తున్నా

ABN , First Publish Date - 2021-07-31T05:55:09+05:30 IST

జిల్లా 54వ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నానని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు.

అదృష్టంగా భావిస్తున్నా

  1. జిల్లాను అభివృద్ధి చేస్తా 
  2. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తా
  3. నూతన కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు


కర్నూలు(కలెక్టరేట్‌), జూలై 30: జిల్లా 54వ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నానని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం 10:08 గంటలకు ఆయన సర్వమత ప్రార్థనల మధ్య పురోహితులు, పాస్టర్‌లు, ముస్లిం మత గురువుల ఆశీస్సులు తీసుకుని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనపై ఉంచిన గురుతర  బాధ్యతను నిర్వర్తించేందుకు నిరంతరం శ్రమిస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకు వెళ్లేందుకు చర్యలు చేపడతానన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, ప్రజల సహకారంతో జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. కర్నూలు జిల్లాలో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని అన్నారు. 


కలెక్టర్‌కు శుభాకాంక్షల వెల్లువ


కలెక్టర్‌ కోటేశ్వరరావును అధికారులు అభినందనలతో ముంచెత్తారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు వరుసగా వెళ్లి తమ పేరు, శాఖ, హోదాలతో పరిచయం చేసుకుని పూలమాలలు, పుష్పగుచ్ఛాలు,  మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) డా.మనజిర్‌ జిలానీ సామూన్‌, జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ, రైతు భరోసా) రాంసుందర్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ (హౌసింగ్‌) నారపురెడ్డి మౌర్య, జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు, నగర పాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, డీఆర్వో పుల్లయ్య, ఆర్‌డీవో హరిప్రసాద్‌ పాల్గొన్నారు. 


‘జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదాం’


కర్నూలు(కలెక్టరేట్‌), జూలై 30: కలిసికట్టుగా పనిచేసి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ   ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సమగ్ర  వివరాలను అందజేయాలని ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తిని ఆదేశించారు. జిల్లాలో చివరి ఆయకట్టు వరకు నీరందించి సాగును పెంచాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు, మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో కొత్త రోడ్లు మంజూరు అయ్యాయా? భూసేకరణ, బిల్డింగుల టార్గెట్‌,  భవనాలకు ప్రభుత్వ స్థలం కేటాయింపు తదితర వివరాలను ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇక నుంచి ఒక్క డయేరియా మరణం  కూడా జరగకూడదని, తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు చేట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సీహెచ్‌ విద్యాసాగర్‌ను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని డీఐవో డా. విశ్వేశ్వరరెడ్డిని ఆదేశించారు. రైతుభరోసా కేంద్రం పరిధిలో మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాలు కచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ జేడీని ఆదేశించారు. మొక్కలు నాటే టార్గెట్‌ ఎంతవరకు వచ్చిందని సోషల్‌ ఫారెస్టు డీఎఫ్‌వో ప్రసన్నను ఆరా తీశారు. స్పందన కార్యక్రమంలో 30 శాతం సమస్యలు సర్వేకు సంబంధించి ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని ల్యాండ్‌ అండ్‌ సర్వే శాఖ ఏడీ హరిక్రిష్ణను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌పై గర్భిణుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని ఐసీడీఎస్‌ పీడీని ఆదేశించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్లు రాంసుందర్‌రెడ్డి, డా.మనజీర్‌ జిలానీ సామూన్‌, ఎన్‌.మౌర్య, శ్రీనివాసులు, నగర పాలక సంస్థ కమిషనర్‌ డీకే బాలాజీ, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, డీఆర్వో పుల్లయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-31T05:55:09+05:30 IST