భావుకుడు!

ABN , First Publish Date - 2020-11-01T06:28:02+05:30 IST

నిండు చంద్రుణ్ణి చుక్కల్నీ చల్లగాలినీ కాసింత ఆకాశం ముక్కని మల్లెపూలనీ పండువెన్నెల్నీకొమ్మల్నీ పూవుల్నీ..

భావుకుడు!

నిండు చంద్రుణ్ణి

చుక్కల్నీ చల్లగాలినీ

కాసింత ఆకాశం ముక్కని

మల్లెపూలనీ పండువెన్నెల్నీ

కొమ్మల్నీ పూవుల్నీ..

అక్షరాతో కట్టిపడేసి

కోయిలకూతలు వింటూ

ఓ ప్రమిదలో నూనెపోసి

కార్తీకదీపాన్ని వెలిగించి

రసానంద హృదయాల్ని

అనుభూతి కవనంలో

ముంచి మంచిగంథాలద్ది

చలనచిత్ర గీతమాలికలు

కట్టిపంచిన ముగ్ధమనోహర

కవి శ్రేష్ఠుడు!

కృష్ణపక్షం వహించి

ఊర్వశిని పెళ్ళాడి

ప్రతి రాత్రి వసంతరాత్రి

చేసికొని ఆకాశపందిరిలో

ఇది మల్లెల వేళయని

మావిచిగురు తిని

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు

అని విస్తుపోయి ఆకులో

ఆకుయై కొమ్మలో కొమ్మయై

దూరాన తారాదీపం వైపు

ఆర్తిగా అడుగులేస్తూపోయిన

భావుకబ్రహ్మ!!

భీమవరపు పురుషోత్తం

(నేడు దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి)

Updated Date - 2020-11-01T06:28:02+05:30 IST