వ్యాక్సిన్‌ తీసుకోవడానికి సంకోచించొద్దు

ABN , First Publish Date - 2021-01-25T08:53:11+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ సంకోచించాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్‌ పేర్కొన్నారు.

వ్యాక్సిన్‌ తీసుకోవడానికి సంకోచించొద్దు

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు తెలంగాణ గవర్నర్‌ సూచన 


తిరుమల/శ్రీకాళహస్తి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ సంకోచించాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్‌ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆమె కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం చేయగా, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం, డైరీ, క్యాలెండర్‌ను అందించారు. అనంతరం గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అందరూ కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనం గురించి తనకంటే వారికే బాగా తెలుసన్నారు.


ప్రభుత్వం ఇస్తున్నది టెస్టింగ్‌ వ్యాక్సిన్‌ కాదని, కృతజ్ఞతతో ఇస్తున్న వ్యాక్సిన్‌ అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా మన దేశ శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్‌ తయారు చేసేలా దీవించిన దేవునికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆమె శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడిని దర్శించుకున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ నివారణకు శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేసిన అనంతరం వ్యాక్సిన్‌ తయారు చేశారని, వారి కృషి మరువలేనిదన్నారు. మన శాస్త్రవేత్తలు అనతికాలంలోనే కొవిడ్‌కు వ్యాక్సిన్‌ తయారు చేసి దేశ ఖ్యాతిని చాటి చెప్పారన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందకుండా వ్యాక్సిన్‌ వేసుకోవాలని... తద్వారా కొవిడ్‌ను ఎదుర్కోవచ్చని తమిళసై అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-01-25T08:53:11+05:30 IST