ప్రైవేట్‌ కాలేజీలో ‘ఫీజు’ మంట!

ABN , First Publish Date - 2022-08-20T08:55:25+05:30 IST

ప్రైవేట్‌ కాలేజీలో ఫీజు చెల్లించలేదని ఓ విద్యార్థికి టీసీ ఇవ్వకపోవడంతో చోటు చేసుకున్న వివాదం..

ప్రైవేట్‌  కాలేజీలో ‘ఫీజు’ మంట!

ఫీజు చెల్లించలేదని ఓ విద్యార్థికి టీసీ ఇవ్వని కాలేజీ యాజమాన్యం

విద్యార్థి సంఘం నేతల ఆందోళన

ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న ఓ నాయకుడు

ప్రమాదవశాత్తు మంటలంటుకున్న వైనం

విద్యార్థి సంఘం నేతలైన ఇద్దరితోపాటు కాలేజీ ప్రిన్సిపాల్‌, ఉద్యోగికి తీవ్ర గాయాలు

ఇద్దరికి 60 శాతం మేర కాలిన గాయాలు

విచారణకు ఆదేశించిన మంత్రి సబిత


రాంనగర్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ కాలేజీలో ఫీజు చెల్లించలేదని ఓ విద్యార్థికి టీసీ ఇవ్వకపోవడంతో చోటు చేసుకున్న వివాదం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ విద్యార్థి సంఘం నేత పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించే క్రమంలో ప్రమాదశాత్తు మంటలు అంటుకుని.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని బాగ్‌అంబర్‌పేట-రామంతాపూర్‌ మెయిన్‌రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్‌ కాలేజీలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక విచారణ తర్వాత అంబర్‌పేట పోలీసులు పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాజ్‌గిరిలోని వెంకటరెడ్డినగర్‌కు చెందిన ఓ విద్యార్థి బాగ్‌అంబర్‌పేట మెయిన్‌రోడ్డులోని ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశాడు. అకడమిక్‌ ఇయర్‌కు సంబంధించిన సర్టిఫికెట్లు, టీసీ ఇవ్వాలని కొన్ని రోజుల క్రితం కళాశాలలో దరఖాస్తు చేసుకోగా.. బకాయి ఉన్న రూ.16వేల ఫీజును చెల్లించాలని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇదే విషయమై వారం రోజులుగా ఆ విద్యార్థి కాలేజీ చుట్టూ తిరుగుతున్నా.. అక్కడి ఉద్యోగులు పట్టించుకోలేదు. దీంతో బాధిత విద్యార్థి.. స్థానిక విద్యార్థి సంఘం నాయకులను ఆశ్రయించాడు. సదరు విద్యార్థితో కలిసి కళాశాలకు విద్యార్థి సంఘం నాయకులు.. ఏవో, ప్రిన్సిపాల్‌ను కలిసి సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. బకాయి ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని వారు స్పష్టం చేయడం ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘం నాయకుల్లో ఒకరు.. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను తనపై చల్లుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలో తనతోపాటు వచ్చిన ఇతర నాయకులతోపాటు ఏవో, ప్రిన్సిపల్‌పైనా పెట్రోల్‌ పడింది. అప్పటికే పూజ కోసం వెలిగించి ఉన్న దీపంపైనా పెట్రోల్‌ పడడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.


ఈ ఘటనలో విద్యార్థి సంఘం నేతతోపాటు కాలేజీ ప్రిన్సిపాల్‌, ఏవో, మరో విద్యార్థి నేతకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితోపాటు ఓ విద్యార్థి, మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. కళాశాల సిబ్బంది... 108, స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతోపాటు అగ్నిమాపక వాహనాన్ని పిలిపించి మంటలను ఆర్పివేయించారు. గాయపడ్డ వారిని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాలేజీ ఏవో, విద్యార్థి నాయకుడికి 55-60 శాతంపైగా, ప్రిన్సిపాల్‌తోపాటు మరో నాయకుడికి 35 శాతంపైగా కాలిన గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివా్‌సరెడ్డి ఘటనా స్థలికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలేజీ సీసీ కెమెరా ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనలో కాలేజీ ఏవో, ప్రిన్సిపాల్‌, ఇద్దరు విద్యార్థి సంఘం నాయకులు గాయపడ్డారని, ప్రస్తుతం వారికి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. 


భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

ప్రైవేట్‌ కాలేజీలో చోటు చేసుకున్న సంఘటనపై  విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. సదరు కాలేజీ గుర్తింపును రద్దు చేయడంతో పాటు, యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశాయి.  విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేధిస్తూ ఫీజు దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్‌ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 


విచారణకు మంత్రి సబిత ఆదేశం

బాగ్‌అంబర్‌ పేటలోని ప్రైవేట్‌ కాలేజీలో జరిగిన సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్మిడియట్‌ బోర్డు కార్యదర్శిని ఆదేశించారు. విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కాగా, ఘటనపై సంజాయిసీ ఇవ్వాలని సదరు కాలేజీ నిర్వాహకులను ఆదేశిస్తూ హైదరాబాద్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి నోటీసులు ఇచ్చారు.


సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే: బోర్డు కార్యదర్శి

విద్యార్థుల సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఆపే అధికారం కాలేజీలకు లేదని, అడిగిన వెంటనే టీసీ, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ను జారీ చేయాల్సిందేనని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ జలీల్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ విషయంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలేజీల నిర్వాహకులు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే...జిల్లా ఇంటర్మీడియట్‌ లేదా ఇంటర్‌ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులను కోరారు. ప్రైవేట్‌ కాలేజీల్లో తనిఖీలు చేయాలని జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు.  

Updated Date - 2022-08-20T08:55:25+05:30 IST