అమెరికా అధ్యక్షుడి విమానమా.. మజాకా..!

ABN , First Publish Date - 2020-02-20T03:12:12+05:30 IST

రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ఈ నెల 24న భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. బోయింగ్ 7

అమెరికా అధ్యక్షుడి విమానమా.. మజాకా..!

న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ఈ నెల 24న భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. బోయింగ్ 747-200బీ సీరీస్ విమానంలో భారత్‌కు చేరుకోనున్న ట్రంప్ దంపతులు.. పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమం, తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. అమెరికా అధ్యక్షుడు భారత పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణించే విమానం విశిష్టతలు మీకోసం. 


ఎయిర్ ఫోర్స్ వన్

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానాన్ని ‘ఎయిర్ ఫోర్స్ వన్’ అని పిలుస్తారు. ఈ విమానంపై అమెరికా జాతీయ జెండా, అమెరికా అధ్యక్షుడి ముద్రతోపాటు ‘UNITED STATES OF AMERICA’ అని రాసి ఉంటుంది. విమానం లోపల 4000 చదరపు అడుగుల ఫ్లోర్‌స్పేస్ ఉంటుంది. దీన్ని ప్రధానంగా మూడు భాగాలుగా విభజించారు. అవి ఎక్స్‌టెన్సివ్ సూట్, మెడికల్ సూట్, కిచెన్. ఎక్స్‌టెన్సివ్ సూట్‌లో అధ్యక్షుడి ఆఫీస్, కాన్ఫరెన్స్ రూమ్, టాయిలెట్ ఉంటాయి. ఇక మెడికల్‌ సూట్‌లో అత్యాధునికైన వైద్య పరికరాలతో పాటు, ఆపరేషన్ థియేటర్, ఓ డాక్టర్ ఉంటారు. ఈ విమానంలో ఉండే కిచెన్‌ ప్రత్యేకతే వేరు. ఎందుకంటే.. ఒకే దాదాపు 100 మందికి సరిపోయే వంటను ఇందులో చేయోచ్చు. అంతేకాకుండా.. అధ్యక్షుడి సతీమణి, సీనియర్ అధికారులు, మీడియా ప్రతినిధులు, ఇతర అతిథుల విశ్రాంతికి ప్రత్యేకంగా గదులు ఉంటాయి. 


గాల్లోనే ఇంధనం నింపుకోవడం దీని మరో ప్రత్యేకత

సాధారణంగా విమానాలు సుదూర ప్రాంతాలు వెళ్లాల్సి వస్తే.. దూరాన్ని బట్టి ఇంధనం కోసం విమానాశ్రయాల్లో దిగుతాయి. కానీ ‘ఎయిర్ ఫోర్స్ వన్’ మాత్రం ఇంధనం కోసం ఎక్కడా ఆగకుండా గమ్యాన్ని చేరుకుంటుంది. ఎందుకంటే ఈ విమానానికి గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం ఉంది. అడ్వాన్స్‌డ్ సెక్యూర్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ ఉండటం వల్ల అమెరికాపై దాడులు జరిగిన సమయంలో ఈ విమానం మొబైల్ కమాండ్ సెంటర్‌గా పని చేస్తుంది. వైట్ హౌస్ మిలిటరీ ఆఫీస్‌ పర్యవేక్షనలో పని చేసే ప్రెసిడెన్షియల్ ఎయిర్‌లిఫ్ట్ గ్రూప్ ఈ విమానం మెయింటెనెన్స్ బాధ్యతలు చూసుకుంటుంది. కాగా.. దీని విలువ దాదాపు 3.9 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.


Updated Date - 2020-02-20T03:12:12+05:30 IST