‘ఫ్యూచర్‌’కు రూ.7,000 కోట్లు

ABN , First Publish Date - 2022-01-24T06:57:03+05:30 IST

: దివాలా అంచుల్లో ఉన్న ఫ్యూచర్‌ రిటైల్‌ను (ఎఫ్‌ఆర్‌ఎల్‌) చేజిక్కించుకునేందుకు అమెరికా ఈ-కామర్స్‌ దిగ్గజం ‘అమెజాన్‌’ కొత్త ఎత్తుగడలకు దిగింది. పీఈ సంస్థ సమరా క్యాపిటల్‌ ద్వారా ఎఫ్‌ఆర్‌ఎల్‌కు రూ.7,000 కోట్లు సమకూర్చేందుకు సిద్ధమైంది...M

‘ఫ్యూచర్‌’కు రూ.7,000 కోట్లు

 సమరా ద్వారా కొనేందుకు అమెజాన్‌ ఆఫర్‌

న్యూఢిల్లీ: దివాలా అంచుల్లో ఉన్న ఫ్యూచర్‌ రిటైల్‌ను (ఎఫ్‌ఆర్‌ఎల్‌) చేజిక్కించుకునేందుకు అమెరికా ఈ-కామర్స్‌ దిగ్గజం ‘అమెజాన్‌’ కొత్త ఎత్తుగడలకు దిగింది. పీఈ సంస్థ సమరా క్యాపిటల్‌ ద్వారా ఎఫ్‌ఆర్‌ఎల్‌కు రూ.7,000 కోట్లు సమకూర్చేందుకు సిద్ధమైంది. ఏ నిర్ణయం వెంటనే తెలపాలని కంపెనీ ఇండిపెండెంట్‌ ప్రమోటర్లను కోరింది. ఈ నెల 29 లోగా  బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఎఫ్‌ఆర్‌ఎల్‌ రూ.3,494 కోట్లు చెల్లించాలి. నిజానికి కంపెనీ ఈ మొత్తాన్ని గత ఏడాది డిసెంబరు నెలాఖరుకే చెల్లించాలి. శనివారంలోగా ఈ మొత్తం చెల్లించకపోతే బ్యాంకు లు, ఆర్థిక సంస్థలు ఈ నెల 30న ఈ రుణఖాతాను మొండి బకాయి (ఎన్‌పీఏ) ఖాతాగా ప్రకటిస్తాయి. ఈ నేపథ్యంలో అమెజాన్‌ ఈ ఆఫర్‌ ప్రకటించడం విశేషం. 


సమరా’ ద్వారా ఎందుకంటే?: నిజానికి ఎఫ్‌ఆర్‌ఎల్‌ ప్రమోటర్‌ సంస్థ ‘ఫ్యూచర్‌ క్యూపన్స్‌’ ఈక్విటీలో అమెజాన్‌కు ఇప్పటికే 49 శాతం వాటా ఉంది. 2020 లోనే ఫ్యూచర్‌ గ్రూపు-అమెజాన్‌ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. రిటైల్‌ రంగంలో ప్రభుత్వం అనుమతించిన ఎఫ్‌డిఐ కంటే ఇది ఎక్కువ. వాస్తవాలను మరుగుపరిచి అమెజాన్‌ ఇందుకు ఆమోదం పొందినందున, అప్పట్లో ఇందుకు ఇచ్చిన ఆమోదాన్ని సీసీఐ ఇటీవల రద్దు చేసింది. రద్దు చేయడంతో పాటు రూ.200 కోట్ల జరిమానా విధించింది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే అమెజాన్‌ ఈ కొత్త ఎత్తుగడకు దిగిందని భావిస్తున్నారు. 


రిలయన్స్‌ను అడ్డుకోవడమే లక్ష్యం: భారత సంఘటిత రిటైల్‌ మార్కెట్‌లో రిలయన్స్‌ రిటైల్‌దే అగ్రస్థానం. బిగ్‌బజార్‌, హెరిటేజ్‌, ఈజీ డే, బ్రాండ్‌ ఫ్యాక్టరీ వంటి ఫ్యూచర్‌ రిటైల్‌, ఫార్మాట్స్‌  కూడా తోడైతే రిలయన్స్‌కు ఇక తిరుగుండదనే భయంతోనే అమెజాన్‌ ఇలాంటి చర్యలకు దిగుతోందంటున్నారు.

Updated Date - 2022-01-24T06:57:03+05:30 IST