Abn logo
May 22 2020 @ 00:27AM

సడలింపు భయాలు

నాలుగో విడత లాక్‌డౌన్‌లో ఉన్నాము. రాత్రిపూట నిర్మానుష్యత తప్ప, తక్కినదంతా కరోనా పూర్వదశలో ఉన్నట్టే ఉంటున్నది కొన్ని మినహాయింపులతో. వైరస్‌ వ్యాప్తి ఇంకా తొలిదశలో ఉన్నప్పుడు సకల దిగ్బంధాలూ చేసి, కేసులు లక్ష దాటిన సమయంలో తలుపులు బార్లా తెరవడం ఏమిటో సామాన్యులకు అర్థం కావడం లేదు. వ్యాధిని ఎదుర్కొనడానికి కావలసిన సన్నాహాలు చేసుకోవడానికే పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అనీ, ఇప్పుడు తగిన జాగ్రత్తలతో ప్రజాజీవనం యథావిధిగా సాగడానికే సడలింపులు అనీ పాలకులు భావిస్తూ ఉండి ఉండాలి. అష్టదిగ్బంధాల కాలంలో తాము అష్టకష్టాలు అనుభవించామని, ఆ కష్టమంతా బూడిదలో పోసినట్టవుతోందని సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు బాధపడుతున్నారు. సడలింపులు వారికీ కావాలి, రెక్కాడితే కాని డొక్కాడని వారూ, చిరుద్యోగులూ, అసంఘటిత, ప్రైవేటు రంగాల ఉద్యోగులూ అందరూ లాక్‌డౌన్‌ కాలంలో నష్టపోయారు. ఇప్పుడు సడలించినంత మాత్రాన వారి ఆదాయాలకు భరోసా ఏదీ ఏర్పడదు. ఎందుకంటే, రెండునెలల కఠోరమైన లాక్‌డౌన్‌ దేశ ఆర్థిక వ్యవస్థ మీద, సమాజం మీద దీర్ఘకాలపు నష్టాన్ని వేదనను విధిస్తున్నది. ఇప్పుడు, ఇక విమానాలూ రైళ్లూ కూడా తిరగబోయే దశలో, సమాధానం దొరకని ప్రశ్న ఒకటే. ఆర్థిక కార్యక్రమాలను తిరిగి ప్రారంభించారు, మానవ సంచారానికి స్వేచ్ఛ ఇస్తున్నారు. ఈ రెంటితో పాటు కరోనా వైరస్‌ వ్యాప్తి నిరాఘాటంగా కొనసాగుతున్నది. మరి ఆరోగ్యభద్రతకు ఏది పూచీ? 


తొలిసారిగా లాక్‌డౌన్‌ విధించే సమయానికి కరోనా వ్యాప్తి పరిమితంగానే ఉండింది. విదేశాలనుంచి వచ్చినవారికి, వారితో మెలగినవారికి, విదేశీయులు హాజరైన సామూహిక సమావేశాల్లో పాల్గొన్నవారికి అప్పుడు కరోనా సోకింది. ఆ వ్యాప్తికి ఒక సామాజికార్థిక పరిమితి ఉన్నది. అప్పటికి వలసకూలీలలో వైరస్‌ ప్రవేశించలేదు. లాక్‌డౌన్‌ విధించకముందే, వారందరినీ స్వస్థలాలకు తరలించే ఏర్పాటు చేసినా, వారంతట వారు వెళ్లే అనుమతి ఇచ్చినా– ఇప్పుడు వలస కూలీల వల్ల జరుగుతున్న వ్యాప్తి నివారితమయ్యేది. రైళ్లు, విమానాలు నిలిపివేసిన తరువాత, వారి కోసం నాలుగు రోజులు ప్రత్యేక రోడ్డు, రైలు సర్వీసులు నడిపినా భిన్నంగా ఉండేది. ఇప్పుడు దేశంలో కరోనా విజృంభణ స్థాయిలో ఉన్నదని అనలేము కానీ, దాని వేగం తగ్గడం లేదు. అతి త్వరలోనే పెద్ద పెద్ద సంఖ్యలను చూస్తాము, వాటికి అలవాటు పడతాము. ఒక పక్క అటువంటి ఆరోగ్యసంక్షోభం ఉంటూ ఉంటే, ఆర్థిక కార్యక్రమాలు మామూలు స్థాయికి వస్తాయా? ఆర్థిక గమనం, ఆరోగ్యం రెంటికీ న్యాయం జరిగే విధంగా విధానాలు ఉంటున్నాయా? 


బస్సులు అనుమతిస్తున్నారు. సీట్ల మధ్య ఎడం లేదు. రైళ్లు రాబోతున్నాయి. మధ్య బెర్తులు యథాతథం. విమానాలలో కూడా నడిమి సీటు ఖాళీ ఉండదు. రోడ్ల మీద ఇప్పటికే వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఎక్కడ నియంత్రణ? అందరూ సమాజ జీవనంలోకి వచ్చి, వైరస్‌ను స్వీకరించి, వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలన్నది ఉద్దేశమా, అందుకేనా, 65ఏళ్లు దాటినవారినీ 10ఏళ్ల లోపు వారినీ బయట తిరగవద్దు అంటున్నారు? బయటకు రాకుండా ఉన్నంత మాత్రాన పెద్దలు, పిన్నలు క్షేమంగా ఉంటారా? వారి ఇళ్లలో ఉన్న యువకులు, మధ్యవయస్కులు బయటి ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు, ఎన్ని జాగ్రత్తలు మాత్రం వారిని రక్షించగలవు? పెద్దలను, పిన్నలను ఇళ్లలో ఎడంగా ఉంచడానికి అవసరమైన వసతులు అందరికీ ఉంటాయా? గేటెడ్‌ కమ్యూనిటీలు, ఉన్నత మధ్యతరగతి కాలనీలు తమతమ ప్రాంతాల్లో విధిస్తున్న లాంటి ఆరోగ్య, సామాజిక ఆంక్షలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, అట్టడుగు తరగతి నివాసాల్లో ఉంటాయా, పాటించడం సాధ్యమా? ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, దేశమంతా ట్విట్టర్లూ, ఫేస్‌బుక్కుల సమాజమే ఉన్నదనుకుంటే ఎట్లా? ఏ రాష్ట్రంలో ఎన్ని పరీక్షలు, ఎందుకు చేస్తున్నారో తెలియదు, వ్యాధి సోకినవారికి అందిస్తున్న చికిత్స విధానమేమిటో తెలియదు. ఎవరు ఎందుకు ఎట్లా మరణిస్తున్నారో తెలియదు. ఉన్నట్టుండి నడివీధిలో కుప్పకూలిపోయి మరణిస్తాడొక రోగి. ఏ లక్షణమూ పెద్దగా బాధించకుండానే గుండెపోటుతో మరణిస్తాడొక రోగి. అభ్యర్థిస్తున్నా, ఒక అనుమానితుడికి పరీక్షలు చేయరు. లోలోపల లక్షణాలు కనిపిస్తున్నా, కొందరు ఎవరికీ చెప్పరు, ఆస్పత్రులకు వెళ్లరు. జ్వరం వచ్చినవాళ్లంతా తప్పనిసరిగా కోవిడ్‌ పరీక్ష చేయించుకోవాలన్న నియమం లేదు, అన్ని పరీక్షలు చేయగలిగే సామర్థ్యం ఉన్నదో లేదో తెలియదు. ఇంత పెద్ద ఉపద్రవాన్ని, విపత్తును ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని ఎదుర్కొనాలి తప్ప, దాపరికాలతో కాదు. ప్రాణాలను కాపాడడానికే ప్రథమ ప్రాధాన్యం అయితే, ప్రభుత్వాల ధోరణి కూడా అట్లాగే ఉండాలి. ఒక అయోమయం, దానితో పాటు తెలియని భయం– మనుషులను నిస్త్రాణలోకి నెడుతుంది. రోడ్లూ, హోటళ్లూ, దుకాణాలూ అన్నీ తెరిచినా మనుషులు వాటిలో మసలడానికి భయపడతారు. 


మన స్థితి ఏమిటి, ఎట్లా ఆర్థికాన్ని, ఆరోగ్యాన్నీ సమతూకంలో నిర్వహించుకుంటాం. పెద్దలను పిన్నలను ఎట్లా రక్షించుకుంటాము– వీటి మీదనే పాలకుల దృష్టి ఉండాలి, వీటి గురించే వారి ప్రచారాలు ఉండాలి. కరోనావిపత్తును అడ్డుపెట్టుకుని వివాదాస్పద విధానాలను హడావుడిగా అమలుచేయడం మీద కాకుండా, ఈ స్థితిని ఎదుర్కొనే యుద్ధంలో తాము ముందుపీటీన ఉన్నామని నేతలు నమ్మకం కలిగించాలి. ప్రజలకు తమ ఆరోగ్య భద్రత అవసరాన్ని నచ్చచెప్పాలి. ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం కలగాలి. ఇంత పెద్ద ముప్పులో తాము ఒంటరులమని, అసహాయులమని భావన రానివ్వకూడదు. అమెరికాలో జరిగినట్టు, సడలింపులు సమాజంలోని బలహీనులకు ఎక్కువ హానిచేస్తాయి. అక్కడ నల్లజాతివారు, మెక్సికన్లు ఎక్కువగా వ్యాధికి బలి అవుతున్నట్టుగానే, ఇక్కడా పేదలూ బలహీనులూ మృత్యుముఖంలోకి వెళ్ల వలసి వస్తుంది. కరోనాకు ఏ వివక్షా లేదంటారు కానీ, సామాజికంగా నిర్మితమైన అగాధాలను కరోనా ఏమీ భర్తీచేయదు. కవచాలున్నవాడి ముందు ఓడిపోతుంది. నిరాయుధుడిని కాటువేస్తుంది.

Advertisement
Advertisement
Advertisement