భయపెడుతున్న ముంబై

ABN , First Publish Date - 2020-06-05T10:43:28+05:30 IST

ఇతర రాష్ట్రాల నుంచీ జిల్లాలోని స్వస్థలాలకు ఏ స్థాయిలో జనం తిరిగొస్తున్నారో అదే స్థాయిలో కరోనా పాజిటివ్‌

భయపెడుతున్న ముంబై

తాజాగా నమోదైన 20కేసుల్లో 14మంది అక్కడినుంచీ వచ్చిన వారే

కేవీబీపురంలో 5... పాలసముద్రంలో 4.. జీడీనెల్లూరు, చిత్తూరుల్లో   

మూడేసి..తిరుపతి, కార్వేటినగరాల్లో రెండేసి... శ్రీకాళహస్తిలో ఒక్కటి

మొత్తం 358కి పెరిగిన కేసులు


తిరుపతి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాల నుంచీ జిల్లాలోని స్వస్థలాలకు ఏ స్థాయిలో జనం తిరిగొస్తున్నారో అదే స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా గురువారం జిల్లాలో 20 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 14 కేసులు ముంబై నుంచీ జిల్లాకు తిరిగొచ్చిన వారివే కావడం గమనార్హం. కేవీబీపురం మండలం కోట మంగాపురానికి చెందిన నలుగురు ముంబై నుంచీ స్వగ్రామానికి తిరిగి వస్తూండగా అధికారులు గుర్తించి గత నెల 29న మార్గమధ్యంలోని పలమనేరు క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.


అదే గ్రామానికి చెందిన మరో మహిళ ముంబై నుంచీ స్వగ్రామం చేరుకోగలిగింది. వీరందరి నుంచీ నమూనాలు సేకరించిన అధికారులు కరోనా టెస్టులు నిర్వహించగా ఐదుగురికీ కరోనా పాజిటివ్‌ అని గురువారం నాటి ఫలితాల్లో తేలింది. దీంతో అందరినీ ఆస్పత్రికి తరలించారు.అలాగే పాలసముద్రం, జీడీనెల్లూరు మండలాలకు చెందిన ఏడుగురు ముంబై నుంచీ స్వస్థలాలకు వస్తుండగా అధికారులు మధ్యలోనే అడ్డుకుని కలికిరిలోని క్వారంటైన్‌ కేంద్రంలో వుంచారు. వారికి పరీక్షలు నిర్వహించగా పాలసముద్రం మండలం ఆముదాల పంచాయతీ గొల్ల కండ్రిగకు చెందిన భార్యాభర్తలు (32, 38), కొడుకు (12), కుమార్తె (11)... ఇలా ఒకే కుటుంబంలో నలుగురికీ వైరస్‌ సోకినట్టు వెల్లడైంది. అలాగే జీడీనెల్లూరు మండలం పాతపాలెం పంచాయతీ మిట్టకొత్తూరుకు చెందిన ఇద్దరు మహిళలు, అదే మండలం వేనాటంపల్లెకు చెందిన మహిళ... ఇలా ముగ్గురు సైతం కరోనా వైరస్‌ బారిన పడినట్టు తేలింది.


చిత్తూరులో మూడు కేసులు వెలుగు చూడగా ఇద్దరు పాజిటివ్‌ వ్యక్తి ప్రైమరీ కాంటాక్టులని, మరొకరు తమిళనాడులోని మధురై నుంచీ వచ్చారని అధికారులు గుర్తించారు. ఇదే విధంగా ముంబై నుంచీ స్వగ్రామాలకు వస్తూ అధికారులు కార్వేటినగరం క్వారంటైన్‌ కేంద్రానికి తరలించిన అదే మండలం డీఎం పురానికి చెందిన వ్యక్తికి, ఈదుపల్లెకు చెందిన యువకుడికి వైరస్‌ సోకినట్టు గుర్తించారు. ఇక తిరుపతి నగరంలో తాతయ్యగుంట ప్రాంతానికి చెందిన 12 ఏళ్ళ బాలుడు, 33 ఏళ్ళ మహిళ గత నెలలో వైరస్‌ సోకిన వ్యక్తికి ప్రైమరీ కాంటాక్టులుగా వున్నారు. వారికి కూడా వైరస్‌ సోకినట్టు గురువారం ఽఅధికారులు గుర్తించారు. శ్రీకాళహస్తి పట్టణం భాస్కరపేటకు చెందిన 74 ఏళ్ళ వృద్ధురాలికి పాజిటివ్‌ అని తేలగా ఆమె ఇదివరకూ కార్వేటినగరంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఈ కేసులతో జిల్లాలో మొత్తం నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 358కి చేరిపోయింది.

Updated Date - 2020-06-05T10:43:28+05:30 IST