గడప దాటితే భయం..భయం

ABN , First Publish Date - 2022-05-16T07:07:09+05:30 IST

సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డకు చెందిననరేష్‌ తన బైక్‌ను ఇంటి ముందు పార్కు చేసి ఇంట్లోకి వెళ్లారు.

గడప దాటితే భయం..భయం
సూర్యాపేటలో సంచరిస్తున్న కుక్కలు

రోజురోజుకు పెరుగుతున్న కుక్కలు, పందులు, కోతులు 

సూర్యాపేటలో ప్రతీ వీధిలో సంచారం

సూర్యాపేట టౌన్‌, మే 15: సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డకు చెందిననరేష్‌ తన బైక్‌ను ఇంటి ముందు పార్కు చేసి ఇంట్లోకి వెళ్లారు. 15 నిమిషాల తర్వాత వచ్చి చూడగా బైక్‌ కిందపడి ఉంది. ఎవరైనా కింద పడేశారా? అని చుట్టుపక్కలవారిని అడుగగా కొన్ని కుక్కలు కొట్లాడుకుంటూ వచ్చి బైకుకు తగలడంతో కింద పడిందని తెలిపారు.  బైక్‌ మరమ్మతుకు రూ.1000 ఖర్చయింది. ఇలాంటి చేదు అనుభవాలు పలువురికి సూర్యాపేట పట్టణంలో ఎదురవుతున్నాయి.  

పట్టణంలో కుక్కలు, కోతులు, పందుల బెడద రోజురోజుకు ఎక్కువైంది.   మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఒంటరిగా వీధుల్లోకి రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో అయితే ఇంటి నుంచి కాలు బయట పెట్టే పరిస్థితి లేదు.  కుక్కలు,  కోతులు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటీవల  కుక్కల దాడిలో పదుల సంఖ్యలో గాయపడ్డారు.  ప్రజలు రోజువారి  విధులు ముగించుకొని ఇళ్లకు  చేరుకునే సమయంలో చేతుల్లో ఉన్న తినుబండారాలు, ఇతర సామగ్రిని  కుక్కలు, కోతులు లాక్కుంటున్నాయి. ఏమాత్రం ప్రతిఘటించిన విచక్షణరహితంగా దాడి చేసి గాయపర్చుతున్నాయి. 

పూర్తిస్థాయిలో కనిపించని నియంత్రణ చర్యలు

 మునిసిపాలిటీ ఆధ్వర్యంలో కోతులను పట్టుకోవడానికి పలు చోట్ల బోన్లను ఏర్పాటు చేయడంతో పాటు  ఒక్కో  కోతిని పట్టుకోవడానికి రూ. 1000ఖర్చుతో ప్రత్యేకంగా వ్యక్తులను నియమించారు. పట్టుకున్న కోతులను ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతంలో వదిలివేశారు. అంతేకాకుండా కోతుల నియంత్రించడానికి కొండంగిని గత ఏడాది తీసుకొచ్చారు. అయితే కొండంగి ప్రజలపై దాడులు చేస్తున్నందున ఈ ప్రయోగాన్ని విర మించు కున్నారు. రేక్కల నియంత్రణకు మునిసిపాలిటీ ఆధ్వ ర్యంలో జమునానగర్‌లో  షెడ్‌ను ఇటీవల ఏర్పాటు చేశారు.  సూర్యాపేటలో కుక్కులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. పట్టణంలో రెండు నుంచి మూడు వేల కుక్కలు ఉన్నట్లు సమాచారం.  కోతులు కూడా వేల   సంఖ్యలో తిరుగుతున్నాయి. పట్టణ శివారు ప్రాంతాల్లో పందుల బెడద విపరీతంగా ఉంది. పట్టణ శివారు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో డ్రైనేజీ కాల్వల నిర్మాణం లేనందున పందులు మురుగు గుంతల్లో నివసిస్తున్నాయి. దీంతో దోమల ఉధృతి  పెరిగి రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. కుక్కల, కోతుల సంతానోత్పతత్తిని తగ్గించడానికి చర్యలు ముని సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో అమలు కావడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సూర్యాపేటలోని మునిసిపల్‌ కాంప్లెక్స్‌ వెనుకబజార్‌, చంద్రన్నకుంట, కృష్ణాటాకీస్‌ ప్రాంతం, కొత్తబస్‌స్టేషన్‌, శ్రీరాంనగర్‌, శ్రీశ్రీనగర్‌, మానసనగర్‌, 60 ఫీట్ల రోడ్డు, జమ్మిగడ్డ, పీఎస్‌ఆర్‌  సెంటరు, చర్చికాంపౌండ్‌, రాజీవ్‌నగర్‌ ప్రాంతాల్లో కుక్కలు, కోతులు అధికంగా సంచరిస్తున్నాయి. గత మున్సిపల్‌ సమావేశాల్లో కుక్కలు, కోతులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అధి కారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు గళమెత్తినా నేటి వరకు అధికారులు సరైన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినబడుతున్నాయి. అధికారులు స్పందించి పట్టణంలో కుక్కులు, కోతులు, పందుల బెడదను నివారించాలని కోరుతున్నారు.

కుక్కల బెడద ఎక్కువగా ఉంది

పట్టణంలో కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఏ వీదిలో చూసిన కుక్కలు గుంపులుగా కనిపిస్తున్నాయి. మహిళలు, చిన్నారులు ఒంటరిగా బయటకు రాలేని పరిస్థితి ఉంది. సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదు.  కుక్కలు, కోతుల నివారణ చర్యలు తీసుకోవాలి 

- బెంజారపు రమేష్‌, పట్టణ వాసి

ప్రత్యేక షెడ్‌ ఏర్పాటు చేస్తున్నాం

కుక్కల బెడద నివారణలో భాగంగా జిల్లా కేంద్రంలో కుక్కల షెడ్‌ నిర్మిస్తున్నాం. వైద్యశాఖ సహకారంతో ఒక్కో కుక్కకు రూ.1400 ఖర్చు చేసి సంతాన ఉత్పత్తి లేకుండా చేస్తున్నాం. కోతుల నివారణ చర్యలు ఇప్పటికే తీసుకున్నాం.  మురుగు నీరు నిల్వ ఉండకుండా  ప్రజలు చూసుకుంటేనే పందుల బెడద తగ్గుతుంది.

- రామాంజులరెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌



Updated Date - 2022-05-16T07:07:09+05:30 IST