భయానక వాన

ABN , First Publish Date - 2022-08-04T06:08:40+05:30 IST

జిల్లాలో మంగళవారం రాత్రి కుంభవృష్టి కురిసింది. అర్ధరాత్రి 2గంటల తర్వాత సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. రాత్రి వేళ కురియ డం వల్ల ప్రజలకు పెద్దగా ఇబ్బంది కలుగలేదు. ఉదయంకల్లా వర్షం తగ్గి మామూలు పరిస్థితి నెలకొన్నది. ధర్మసాగర్‌లో భారీవర్షం పడింది. ఈ స్థాయిలో వర్షం పడడం ఇక్కడ ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి.

భయానక వాన
జలమయమైన ఎన్టీఆర్‌ నగర్‌

నగరంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం
ఉరుములు, మెరుపులతో బీభత్సం
లోతట్టు ప్రాంతాలు జలమయం
నీటమునిగిన రహదారులు
జనజీవనం అస్తవ్యస్తం


హనుమకొండ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో మంగళవారం రాత్రి కుంభవృష్టి కురిసింది. అర్ధరాత్రి 2గంటల తర్వాత సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. రాత్రి వేళ కురియ డం వల్ల ప్రజలకు పెద్దగా ఇబ్బంది కలుగలేదు. ఉదయంకల్లా వర్షం తగ్గి మామూలు పరిస్థితి నెలకొన్నది. ధర్మసాగర్‌లో భారీవర్షం పడింది. ఈ స్థాయిలో వర్షం పడడం ఇక్కడ ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి.

కాజీపేట, హనుమకొండలో జోరుగా వానపడింది. భారీ వర్షంతో కాజీపేట పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. బాపూజీనగర్‌, బూడిదగడ్డ, భవానీనగర్‌, రైల్వే క్వార్టర్స్‌ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించాయి. జూబ్లీమార్కెట్‌లోకి పెద్ద ఎత్తున వరదనీరు చొచ్చుకురావడంతో కూరగాయల వ్యాపారం నిలిచిపోయింది. వర్తకులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై మోకాలు ఎత్తు వరకు నీరు నిలిచిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని గుడిసెలు మునిగిపోయాయి, దళితవాడలు ముంపునకు గురయ్యాయి. వరంగల్‌ హంటర్‌రోడ్డులోని బొందివాగు పొంగి ప్రవహించడంతో వరంగల్‌ - హనుమకొండల మధ్య కొద్దిసేపు రాకపోకలు స్తంభించిపోయాయి. బ్రిడ్జిని దాటే క్రమంలో వాహనదారులు వరదనీటిలో చిక్కుకున్నారు. అతికష్టంమీద వారు బయటకు వచ్చారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులు నీటిలో పడిపోయారు. స్థానికులు వారిని కాపాడారు. భారీవర్షం వల్ల వడ్డెపల్లి, భద్రకాళి చెరువుల మత్తడి మరింత పెరిగింది. కుండపోతగా కురిసిన వర్షంతో ధర్మసాగర్‌, వేలేరు మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి ఆత్మకూరు మండలం కటాక్షపురం వద్ద పెద్దచెరువు మత్తడి మరింత పెరిగింది. వరదనీరు రోడ్డుపై ప్రహిస్తుండడంతో వాహనాల రాకపోకలు సాగకుండా పోలీసులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాగా, ఉపరితల ద్రోణి వల్ల రానున్న రెండు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వర్షపాతం
జిల్లాలో 24 గంటల్లో 46.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. ధర్మసాగర్‌ మండలంలో అత్యధికంగా 90.6 మి.మీ., వర్షం పడింది. వేలేరు మండలంలో 74.8 మి.మీ., కాజీపేట మండలంలో 70.8 మి.మీ., హనుమకొండ మండలంలో 66.7 మి.మీ., భీమదేవరపల్లిలో 54.6 మి.మీ., ఎల్కతుర్తిలో 46.4 మి.మీ., కమలాపూర్‌లో 46.4 మి.మీ., ఐనవోలులో 31.9 మి.మీ., పరకాలలో 22.8 మి.మీ., దామెరలో 41.3 మి.మీ., ఆత్మకూరులో 20.5 మి.మీ., శాయంపేటలో 42.3 మి.మీ., నడికూడలో 7 మి.మీ., వర్షం కురిసింది.

నీట మునిగిన వరంగల్‌

జలమయమైన లోతట్టు ప్రాంతాలు
వరంగల్‌ టౌన్‌/మట్టెవాడ, ఆగస్టు 3: వరంగల్‌ నగరంలోని మంగళవారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. దీంతో కాశిబుగ్గ, వివేకానందకాలనీ, పద్మనగర్‌, శాంతినగర్‌, వీవర్స్‌కాలనీ, ఎంహెచ్‌నగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, గాంధీనగర్‌, సాయి గణే్‌షకాలనీ, లక్ష్మీగణపతి కాలనీ, మధురాగనర్‌, సుందరయ్యనగర్‌, వాజ్‌పాయ్‌నగర్‌ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలో నిల్వ చేసుకున్న నిత్యావసర సరుకులు తడిసిపోయి పాడైపోయాయి. మరోవైపు వరంగల్‌ అండర్‌ రైల్వేగేట్‌ ప్రాంతంలోని కాలనీలు కూడా జలమయమయ్యాయి. నగరంలోని 13వ డివిజన్‌ ఎల్‌బీనగర్‌ ప్రాంతంలో పలు ఇళ్లలోకి వర్షపు నీటితోపాటు డ్రైయినేజీలోని మురుగునీరు చేరింది. దీంతో వస్తువులు, బియ్యం, నిత్యావసర సరుకులు తడిసిపోయాయని బాధితులు తెలిపారు. వరంగల్‌ 3వ డివిజన్‌ ఆరెపల్లిలో 163 జాతీయ రహదారికి ఆనుకొని పెద్దమోరీపై నిర్మించిన ప్రహరీని డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూల్చివేశారు. రోడ్లపై నీరు నిలిచి పైడిపెల్లి, ఆరెపల్లి గ్రామాలకు ముంపు తలెత్తే అవకాశం ఉండటంతో కార్పొరేషన్‌ సిబ్బంది ఈ గోడను కూల్చివే శారు.  వరంగల్‌ హంటర్‌రోడ్డులోని ఎన్టీఆర్‌నగర్‌, బృందావన్‌కాలనీ, సంతో్‌షమాత కాలనీ, సాయినగర్‌, మైసయ్యనగర్‌, బీఆర్‌నగర్‌ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరద బాధితులను వరంగల్‌లోని మహేశ్వరిగార్డెన్‌, వెంకటేశ్వరస్వామి గుడి కమ్యూనిటీ హాల్‌లకు వరద బాధితులను తరలించి భోజన ఏర్పాట్లు చేశారు. లోతట్టు ప్రాంతాలను ఉదయం మేయర్‌ గుండు సుధారాణి పరిశీలించారు.

వరద ముప్పు పరిష్కారానికి రూ.300కోట్లు

సీఎం దృష్టికి డీపీఆర్‌ : మేయర్‌ సుధారాణి
వరంగల్‌ ముంపు ప్రాంతాల్లో పర్యటన


జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), ఆగస్టు 3:
నగరంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన జోరు వర్షంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ ప్రాంతాల్లో మేయర్‌ గుండు సుధారాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ క్రమంలో వరద నీటి స మస్యలు, కష్టాలను స్వయంగా ఎదుర్కొన్నారు. కాలనీల్లో తిరుగుతున్న క్రమంలో వరద నీటిలో సగం వరకు మేయర్‌ మునిగారు. ప్రజల కష్టాలు, వరద తీవ్రత కళ్లారా చూశారు. వరంగల్‌ ఎన్‌టీఆర్‌ నగర్‌,  సంతోషిమాత కాలనీ, బృందావన్‌ కాలనీ, సాయినగర్‌, బీఆర్‌ నగర్‌ ముంపు ప్రాంతాల్లో మేయర్‌ సుధారాణి అధికారులతో కలిసి పర్యటించారు. బాధితులను పరామర్శించారు. సహాయక చర్యలు చేపట్టాలని, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

వరుసగా భారీ వర్షాలు కరుసున్న క్రమంలో ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ఫలితంగా నగరం ముంపునకు గురి కాకుండా జాగ్రత్త పడ్డామన్నారు. ఎన్‌టీఆర్‌నగర్‌, బీఆర్‌నగర్‌ ప్రజలను మహేశ్వరీ గార్డెన్స్‌కు తరలించినట్లు చెప్పారు. వీరికి భోజన వసతి కల్పించామన్నారు. అగర్తలా నుంచి ప్రవహించే వరద నీటి కారణంగా భట్టుపల్లి, కోమటి చెరువు, దామెర చెరువు నుంచి వచ్చే నీరు బొందివాగు నాలా ద్వారా భద్రకాళి బండ్‌కు చేరుతుందన్నారు. ఈక్రమంలో సమీప ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని వివరించారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. రూ.300 కోట్లతో వివిధ పనులతో కూడిన డీపీఆర్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. ఇటీవల నగరానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ దృ ష్టి తీసుకెళ్లినట్లు మేయర్‌ చెప్పారు. త్వరలో టెండర్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సం నాటికి ముంపు ప్రాంతాలకు ఏ సమస్య ఉండవని ధీమాగా చెప్పారు. రైల్వే గేట్‌ ప్రాంతం సమీపంలో మూడో లైన్‌ ఏర్పాటు వల్ల ప్రస్తుతం ఉన్న డ్రెయినేజీ కుదించుకుపోయిందన్నారు. రైల్వేట్రాక్‌కు ఆను కుని ఉన్న నిర్మాణాలను తొలగిస్తామన్నారు.









Updated Date - 2022-08-04T06:08:40+05:30 IST