‘కొత్త’ భయం

ABN , First Publish Date - 2021-11-28T06:08:41+05:30 IST

కరోనా కేసులు నిలకడగా ఉండడంతో థర్డ్‌ వేవ్‌ రాదేమోనని జిల్లా ప్రజలు భావిస్తూ కొవిడ్‌ నిబంధనలు గాలికి వదిలేశారు. మాస్క్‌లు ధరించడం మానేశారు. భౌతిక దూరం మర్చిపోయారు.

‘కొత్త’ భయం

- కొవిడ్‌ మూడో ముప్పుపై ఆందోళనలు 

- థర్డ్‌ వేవ్‌పై హెచ్చరిస్తున్నా ప్రజల్లో నిర్లక్ష్యం 

- మాస్క్‌లు వదిలారు.. భౌతిక దూరం మరిచారు

- మరో కరోనా వేరియంట్‌పై చర్చలు 

- గురుకులాల్లో పాజిటివ్‌ కేసులపై తల్లిదండ్రుల్లో ఆందోళన 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కరోనా కేసులు నిలకడగా ఉండడంతో థర్డ్‌ వేవ్‌ రాదేమోనని జిల్లా ప్రజలు భావిస్తూ కొవిడ్‌ నిబంధనలు గాలికి వదిలేశారు. మాస్క్‌లు ధరించడం మానేశారు. భౌతిక దూరం మర్చిపోయారు. జిల్లాలో అన్ని కార్యక్రమాలు యఽథావిధిగా సాగుతుండగా పాఠశాలలు, హాస్టళ్లు తెరచుకున్నాయి. వాణిజ్య సంస్థలు, దుకాణాలు, పెళ్లిళ్లు, సభలు సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోల్లో జనం గుంపులుగుంపులుగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా డెల్టా ప్లస్‌ వేరియెంట్‌గా వస్తుందని భావించినా రాకపోవడంతో జిల్లా ప్రజల్లో ఇక ఏమికాదనే నిర్లక్ష్యం పెరిగింది. తాజాగా బీ.1.1.529 కరోనా వేరియెంట్‌ ప్రపంచ దేశాలను వణికించే దిశగా మొదలైంది. ప్రపంచ అరోగ్య సంస్థ ఓ మైక్రాన్‌గా నామకరణం కూడా చేసింది. జిల్లాలో కొత్త వేరియెంట్‌ థర్డ్‌వేవ్‌పై చర్చ మొదలైంది. మరోవైపు పాఠశాలలు తెరచుకోగా గురుకులాల్లోని విద్యార్థుల్లో స్వల్ప లక్షణాలు బయటపడుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలంలోని గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థులకు, ఒక ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు హాస్టళ్లు నడుస్తుండగా థర్డ్‌వేవ్‌ ఉండదని భావిస్తూ విద్యార్థులను పంపించడంతో హాజరు శాతం కూడా పెరుగుతూ వస్తోంది. గురుకుల పాఠశాలల్లో కేసులు బయటపడడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సినేషన్‌ తీసుకోవడం వల్ల పెద్ద వారికి ముప్పులేదని భావిస్తున్నా పిల్లల విషయంలోనే భయపడుతున్నారు. ప్రస్తుతం 12 ఏళ్లపై పిల్లలకు పాజిటివ్‌ వస్తుండడంతో కొత్త వేరియెంట్‌ పిల్లలపై ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు. మరోవైపు జిల్లాలో జ్వరం, జలుబు లాంటి స్వల్ప లక్షణాలతో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో థర్డ్‌ వేవ్‌పై ఆందోళనలు ఏర్పడ్డాయి. 

- నిలకడగా పాజిటివ్‌ రేటు 

జిల్లాలో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో అనేక విషాద సంఘటనలు ప్రజలు చవిచూశారు. ఒకే కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురు చనిపోయిన వారు ఉన్నారు. భార్య భర్తలు, అన్నదమ్ములు, ఇలా రక్త సంబంధీకులు చనిపోయి కుటుంబంలో శోకాన్ని నింపింది. గత నెల నుంచి కరోనా పాజిటివ్‌ రేటు నిలకడగా ఉంటూ తగ్గుముఖం పడుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 5,85,632 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా 32,343 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో 31,683 మంది కోలుకున్నారు. 91 మంది చికిత్స పొందుతుండగా 569 మంది మృతి చెందారు. మొదటి వేవ్‌లో 165 మంది చనిపోగా, రెండో వేవ్‌లో అధికంగా 404 మంది మృతి చెందారు. కరోనా బారిన పడిన వారిలో మొదటి విడతలో 13,380 మంది ఉండగా రెండో వేవ్‌లో 18,963 మంది ఉన్నారు. జిల్లాలో  ప్రస్తుతం 0.10 శాతం పాజిటివ్‌ రేటు ఉంది. గత సంవత్సరం ఏప్రిల్‌లో 2.91 శాతం, మేలో 27.91 శాతం, జూన్‌లో 2.61 శాతం, జూలైలో 15.33శాతం, అగస్టులో 27.10 శాతం సెప్టెంబరులో 28.48 శాతం, అక్టోబరులో 7.88 శాతం, నవంబరులో 4.13 శాతం, డిసెంబరు 1.69 శాతంగా నమోదైంది. ఈ సంవత్సరం జనవరిలో 1.35 శాతం, ఫిబ్రవరిలో 0.96 శాతం, మార్చిలో 1.90 శాతం, ఏప్రిల్‌లో 20.04 శాతం, మేలో 30.9 శాతం, జూన్‌లో 1.91 శాతం, జూలైలో 1.22 శాతం, ఆగస్టులో 0.73 శాతం, సెప్టెంబరులో 0.32 శాతం, అక్టోబరులో 0 శాతంగా ఉండగా ప్రస్తుతం 0.10 శాతం పాజిటివ్‌ రేటు ఉంది. పాజిటివ్‌ రేటు తగ్గుతున్నా జనం నిర్లక్ష్యంతో మళ్లీ కేసులు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. 

- కొనసాగుతున్న ఫీవర్‌ సర్వే

జిల్లాలో కొవిడ్‌ లక్షణాలు, జ్వర పీడితులను గుర్తించడానికి ఫీవర్‌ సర్వే నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 9వ విడత ఫీవర్‌ సర్వే కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇంటింటి సర్వేలో 1,51,889 మందిని గుర్తించారు. ఇందులో మొదటి విడత సర్వేలో 3789 మంది, రెండో విడతలో 3372 మంది, మూడో విడతలో 1710 మంది, నాలుగో విడతలో 679 మంది, ఐదో విడతలో 571 మంది, ఆరో విడతలో 762 మంది, ఏడో విడతలో 916 మంది, ఎనిమిదో విడతలో 539 మందిని తొమ్మిదో విడతలో 321 మందిని గుర్తించి మందులు పంపిణీ చేశారు. జిల్లాలో దీంతో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో కూడా వేగం పెంచారు.


Updated Date - 2021-11-28T06:08:41+05:30 IST