వాన భయం

ABN , First Publish Date - 2021-04-15T05:57:36+05:30 IST

అన్నదాతలను వర్షం భయం వెంటాడుతోంది. పంట చేతికొచ్చే దశలు మబ్బులు గుబులు పుట్టిస్తున్నాయి. పునాస, యాసంగి అధిక వర్షాలు, అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారు. రెండు రోజులుగా ఉదయం ఆకాశం మేఘావృతమై ఉండడం, చిరు జల్లులు పడడం రైతన్నలను ఆందోళనకు గురి చేస్తోంది.

వాన భయం

- ఆకాశంలో మబ్బులు 

- పలు చోట్ల జల్లులు 

- జిల్లాలో మొదలైన వరి కోతలు, కల్లాల్లో ధాన్యం 

- భారీ వర్షం కురిస్తే అపార నష్టం 

- ఖరీఫ్‌లో రూ.3.28 కోట్ల పంట నష్టం, అందని పరిహారం

- యాసంగిలో 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

అన్నదాతలను వర్షం భయం వెంటాడుతోంది. పంట చేతికొచ్చే దశలు మబ్బులు గుబులు పుట్టిస్తున్నాయి. పునాస, యాసంగి అధిక వర్షాలు, అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారు. రెండు రోజులుగా ఉదయం  ఆకాశం మేఘావృతమై ఉండడం, చిరు జల్లులు పడడం రైతన్నలను ఆందోళనకు గురి చేస్తోంది.  జిల్లాలో గత వానాకాలం సీజన్‌లో రూ 3.28 కోట్ల పంట నష్టం జరిగింది. 6390 ఎకరాల్లో పంట నష్టం జరుగగా 5176 ఎకరాల్లో వరి దెబ్బతింది. యాసంగి ముగుస్తున్నా పరిహారం మాటే లేదు. ప్రస్తతం యాసంగి సాగులో 1.65 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఒకవైపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా రైతులు వరికోతలు మొదలు పెట్టారు.  ధాన్యాన్ని కల్లాల వద్ద నిల్వ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో కొనుగోలు ప్రారంభంకానున్నాయి.   ఈ దశలో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా వాతావరణం మబ్బులు కమ్ముకున్నాయి. అక్కడక్కడ జల్లులు కూడా పడ్డాయి. పంటకు నష్టం వాటిల్లక పోయినా ఎక్కడ భారీ వర్షం పడుతుందోనని రైతులు  ఆందోళన చెందారు. ప్రతీ సంవత్సరం వడగండ్లకు జిల్లాలో పంట నష్టాని చవిచూస్తున్నారు. గతవర్షాకాలం ఖరీఫ్‌ సీజన్‌లో అధిక వర్షాలకు తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది.   రూ.3 కోట్ల 28 లక్షల 51 వేల 080 విలువైన వరి దెబ్బతింది. 6390 ఎకరాల్లో  పత్తి పంటకు నష్టం వాటిల్లింది. వరికి ఎకరానికి రూ.5,671, పత్తి ఎకరానికి రూ.2,720 చొప్పున పరిహారం అందిచాల్సి ఉంది.  ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. జిల్లాలో 135  గ్రామాల్లో వరి 5,671 ఎకరాలు, 819 ఎకరాల్లో పత్తి నష్టం జరిగింది. గత సంవత్సరం ఆగస్టులో పూతకు వస్తున్న సమయంలోనే అధిక వర్షాలు పడడంతో పత్తి పూత నేల రాలింది.  సెప్టెంబరులో దిగుబడి వస్తుందనుకున్న సమయంలో మళ్లీ వర్షాలు కురవడంతో పంట దెబ్బతింది. వర్షాలు తగ్గినా పత్తి రంగు మారి తెగుళ్లు సోకి దిగుబడి తగ్గింది. వరి నేలవాలి నష్టపరిచింది. జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలంలో 17 గ్రామాల్లో వరి 576 ఎకరాలు, పత్తి 115 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. గంభీరావుపేట మండలంలో 8 గ్రామాల్లో వరి 495, పత్తి 60, తంగళ్లపల్లి  మండలంలో 13 గ్రామాల్లో వరి 665, పత్తి 70, చందుర్తి మండలంలో 11 గ్రామాల్లో వరి 230, పత్తి 20, కోనరావుపేట మండలంలో 14 గ్రామాల్లో వరి 460, పత్తి 30, ముస్తాబాద్‌ మండలంలో 10 గ్రామాల్లో వరి 850, పత్తి 110, వేములవాడ మండలంలో 8 గ్రామాల్లో వరి 117, పత్తి 165, వేములవాడ రూరల్‌ మండలంలో 13 గ్రామాల్లో వరి 274, ఇల్లంతకుంట మండలంలో 21 గ్రామాల్లో వరి 825, రుద్రంగి మండలంలో 2 గ్రామాల్లో వరి 250, పత్తి 200, సిరిసిల్ల మండలంలో 5 గ్రామాల్లో వరి 254, బోయినపల్లి  మండలంలో 7 గ్రామాల్లో వరి 614, వీర్నపల్లి  మండలంలో 6 గ్రామాల్లో వరి 61, పత్తి 49 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేసి నివేదికలు పంపించారు. 


రబీలో 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు, 227 కొనుగోలు కేంద్రాలు 

జిల్లాలో ప్రస్తుత రబీలో  1.68 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. 84,109 మంది రైతులు 1.65 లక్షల ఎకరాల్లో వరి వేశారు. కోతలు కూడా మొదలుపెట్టారు. దీనికి అనుగుణంగా గ్రామాల్లోనే కొనుగోలు చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. జిల్లాలో 4.17 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో జిల్లా పౌరసరఫరాల శాఖ రూ.3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అంచనా వేసి 227 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. కొనుగోళ్లు మొదలవుతున్న క్రమంలో వడగండ్ల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

Updated Date - 2021-04-15T05:57:36+05:30 IST