ప్రొటోకాల్‌ భయం

ABN , First Publish Date - 2022-04-22T05:44:14+05:30 IST

జిల్లా స్థాయి ఓ ముఖ్య కార్యాలయం పర్యవేక్షణాధికారి నుంచి మండల స్థాయి అధికారికి ఫోన్‌...సార్‌ ఈ రోజే చార్జ్జి తీసుకున్నారు.

ప్రొటోకాల్‌ భయం

ఫోన్‌ వచ్చిందంటే జేబు ఖాళీ

మర్యాదలు చేయలేకపోతున్న కిందిస్థాయి ఉద్యోగులు

చేతి నుంచి డబ్బు పెట్టుకోలేక సతమతమవుతున్న వైనం


జిల్లా స్థాయి ఓ ముఖ్య కార్యాలయం పర్యవేక్షణాధికారి నుంచి మండల స్థాయి అధికారికి ఫోన్‌...సార్‌ ఈ రోజే చార్జ్జి తీసుకున్నారు... సార్‌తో పాటు మరో ముగ్గురికి, వాహనం డ్రైవర్‌కు మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేయండి.. అని.  ఐదుగురికి భోజనం ఏర్పాట్లంటే ఎంతలేదన్నా రూ.500 నుంచి రూ.700 ఖర్చు. అదే మాంసాహారమైతే రూ.1000 దాటడం ఖాయం. ఏదో రకంగా తిప్పలు పడి ఐదుగురికి భోజనం ఏర్పాటు చేస్తే రెండు రోజులు తిరక్కుండానే మరో ఫోన్‌... కార్యాలయంలో మంచినీళ్లు అయిపోయాయి.. వాటర్‌ బాటిళ్లు, ఫ్రూట్స్‌ సలాడ్‌ పంపండి.. అని. కిక్కిరుమనకుండా   సొంత డబ్బుతో ఏర్పాటు చేయాల్సిందే. కింది ఉద్యోగులకు ఇదో పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇదేం ఖర్మరా బాబూ... ఈ ఉద్యోగం లేకున్నా పర్వాలేదనుకుంటున్నారు. ఈ ప్రొటోకాల్‌ మర్యాదలు ఎంత కాలం చేస్తాం? జేబులు ఎంత వరకు ఖాళీ చేసుకుంటాం... అని సన్నిహితుల వద్ద మండల స్థాయి అధికారులు వాపోతున్నట్లు తెలుస్తోంది. 


నంద్యాల టౌన్‌, ఏప్రిల్‌ 21 : జిల్లా కేంద్రంలోని ఓ భవనంలో ఏకంగా పదికిపైగా ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అయితే అక్కడ కనీస వసతులు లేవు. జిల్లా స్థాయి అధికారులుగా చార్జి తీసుకున్న వారంతా ఏర్పాట్లపై కిందిస్థాయి ఉద్యోగులకు హుకుం జారీ చేస్తున్నారని సమాచారం. ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు తమ కార్యాలయాల్లో వసతులు లేవని జిల్లా ఉన్నతాధికారులకు లేదా రాష్ట్ర స్థాయి ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలి. ఆ పని చేయకుండా కార్యాలయాల్లో టేబుళ్లు, కుర్చీలు, మంచినీళ్లు వంటి ఏర్పాట్లపై తమ కింది సిబ్బందిని  టార్గెట్‌ చేసి వారిపై ఆర్థిక భారం మోపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  


నంద్యాల జిల్లా కేంద్రం అవుతుందని తెలియగానే మండల, డివిజన్‌ స్థాయి ప్రభుత్వ విభాగాల్లో పోస్టింగ్‌ల కోసం ఇతర ప్రాంతాల ఉద్యోగులు ప్రయత్నించారు. నంద్యాల్లో  పోస్టింగ్‌ తెచ్చుకుంటే పిల్లల చదువులకు బాగుంటుందని, మిగతా సౌకర్యాలు ఉంటాయని, రాకపోకలకు బాగుంటుందని అనుకున్నారు.  అయితే నంద్యాల జిల్లా కేంద్రం అయ్యాక  సీన్‌ రివర్స్‌ అయిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా డివిజన్‌ కేంద్రంగా ఉన్న నంద్యాలకు ఉన్నతాధికారులు, మంత్రులు, కార్పొరేషన్‌ చైర్మన్ల ప్రొటోకాల్‌  సేవలు అప్పుడప్పుడు ఉండేవి. ఆ ఏర్పాట్లను ఆయా ప్రభుత్వ శాఖల ముఖ్య అధికారులు, కిందిస్థాయి సిబ్బంది చూసేవారు. ప్రొటోకాల్‌ ఖర్చులకు నిధులు అంతంత మాత్రమే ఉంటాయి. దాంతో ఒక్కోసారి  అధికారులు తమ జేబు నుంచి ఖర్చు చేయాల్సి వచ్చేది. జిల్లా కేంద్రంగా మారాక పరిస్థితి మారింది. పైగా ఏ ప్రభుత్వ శాఖ కార్యాలయంలో కనీస ఏర్పాట్లు లేకపోవడంతో ఆ పనులన్నీ కింది ఉద్యోగుల నెత్తిన పడుతున్నాయి. దీంతో వాళ్ల జేబులకు గతం కంటే పెద్ద చిల్లులు పడుతున్నాయని సమాచారం. పై అధికారులు ఎప్పుడు ఏ పని ఆదేశిస్తారో అని కింది అధికారులు, సిబ్బంది బెంబేలెత్తి పోతున్నారు.


ఓ శాఖ జిల్లా స్థాయి ముఖ్య కార్యాలయంలోని వసతులు ఆ అధికారికి నచ్చలేదు. ఆయనకు కోపం వచ్చేసింది. ఇక్కడ ఎలా ఉంటాం.. వెంటనే ప్రైవేట్‌ బిల్డింగ్‌లోకి ఆఫీసును మార్చేయండని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఆదేశాలైతే బాగున్నాయి కానీ ప్రైవేట్‌ బిల్డింగ్‌కు బాడుగ, అడ్వాన్స్‌  డబ్బు ఏమిటన్నది ప్రశ్న. సిబ్బంది కొత్త బిల్డింగ్‌ను మాట్లాడితే వారే జేబు నుంచి అడ్వాన్స్‌ ఇవ్వాల్సి వస్తోంది. ఆ డబ్బు తిరిగి వస్తుందని గ్యారెంటీ లేదు. సమస్య ఎటూ తేలక కింది ఉద్యోగుల పరిస్థితి ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి అన్నచందంగా మారింది. 


నెత్తి, నోరు బాదుకుంటున్న ఉద్యోగులు


జిల్లా అధికారుల నుంచి ప్రొటోకాల్‌ పేరుతో ఆర్థికభారం తమ నెత్తిన పడేస్తున్నారని కింది ఉద్యోగులు నెత్తీ నోరు బాదుకుంటున్నట్టు తెలుస్తోంది. పై అధికారుల ఆదేశాల ప్రకారం చేయలేమని చెప్పలేక, చేతి నుంచి ఖర్చు పెట్టుకోలేక నలిగిపోతున్నారు. జిల్లాగా మారిన రెండు వారాల్లోనే కింది ఉద్యోగులపై ఆర్థికభారం పడేలా ప్రొటోకాల్‌ తంతు మారడంతో జిల్లా కేంద్రం నుంచి బదిలీ చేయించుకొని  మండలాలకు వెళితే ఈ ఒత్తిడి ఉండదని సిబ్బంది తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది. అన్ని ప్రభుత్వ విభాగాల కార్యాలయాల్లో వసతులు, ప్రొటోకాల్స్‌కు ఏర్పాట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప తమపై ఈ ఒత్తిడి తగ్గదనే భావనలో వారు ఉన్నారు. 


వసతుల ఏర్పాట్లు ఎప్పుడో...? 

జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ఆగమేఘాలపై  ప్రారంభించారు.   ముఖ్య అధికారులు బాధ్యతలు కూడా చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, కార్యాలయాలకు కేటాయించిన భవనాల్లో వసతుల కల్పనపై ఇంకా నిర్లక్ష్యంగానే ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. మౌలిక వసతుల కల్పన డబ్బుతో ముడిపడి ఉంది. దీంతో అవసరమైన సామగ్రి కొనుగోలు వ్యవహరం పూర్తిగా అటకెక్కినట్లు ఉద్యోగ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ఈ తంతంగానికి ప్రభుత్వం ఎప్పుడు ముగింపు పలుకుతుందో ఎదురు చూడాల్సిందే. 

Updated Date - 2022-04-22T05:44:14+05:30 IST