తగ్గని భయం

ABN , First Publish Date - 2020-05-21T09:23:56+05:30 IST

నగరంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న కృష్ణలంకలో మరో ఐదుగురికి, వన్‌టౌన్‌ గొల్లపాలెంగట్టు

తగ్గని భయం

ప్రభుత్వం ఓపక్క లాక్‌డౌన్‌ నిబంధనలను క్రమంగా సడలిస్తూ, ఆర్థిక కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుండగా, మరో పక్క విజయవాడ నగరంలో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తోంది. బుధవారం నగరంలో కొత్తగా మరో తొమ్మిది మంది కరోనా బారినపడ్డారు.  ఈ కేసులతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 396కు చేరుకుంది.


(విజయవాడ, ఆంధ్రజ్యోతి)

నగరంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న కృష్ణలంకలో మరో ఐదుగురికి, వన్‌టౌన్‌ గొల్లపాలెంగట్టు ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి, విద్యాధరపురంలో ఒక న్యాయవాదికి కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 396కు చేరుకుంది. అధికారిక గణాంకాల ప్రకారం కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో ఇప్పటి వరకు 280 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా.. మరో 15 మంది మరణించారు. ఇంకా 101 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


కృష్ణలంకలో ఆగని వైరస్‌ వ్యాప్తి 

కృష్ణలంకలో బుధవారం కొత్తగా మరో ఐదుగురికి వైరస్‌ సోకింది. ఆ ప్రాంతంలో ఆనంద్‌ భవన్‌ రోడ్డుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, కోళ్లవారి వీధికి చెందిన కారు డ్రైవరు, కల్పన ప్రింట్స్‌ రోడ్డుకు చెందిన ఒక వ్యక్తి, మరో గృహిణి, రణదివెనగర్‌ కట్ట మీద ఇంకో గృహిణికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరితో కలిపి కృష్ణలంకలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య 132కు చేరుకుంది. ఇదిలా ఉండగా పాతబస్తీలోని గొల్లపాలెంగట్టు ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విద్యాధరపురం పెద్దసాయిబాబాగుడి ప్రాంతానికి చెందిన న్యాయవాదికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో వీరి కుటుంబ సభ్యులు, వారితో కాంటాక్ట్‌ అయినవారందరినీ క్వారంటైన్‌కు తరలించే పనిలో అధికారులున్నారు. 


కొవిడ్‌ ఆసుపత్రిలో ఏఎన్‌ఎం మృతి

విజయవాడ రూరల్‌ మండలం రాయనపాడుకు చెందిన ఏఎన్‌ఎం విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించింది. ఈమె భర్త ఆర్‌ఎంపీ వైద్యుడు. ఇటీవల అనారోగ్యానికి గురైన అమెను విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమె శాంపిల్స్‌ను తీసి పరీక్షలకు పంపించారు. ఆమె కరోనా కారణంగా మరణించిందా? లేక అనారోగ్య కారణాలతో మరణించిందా? అనేది వైద్యపరీక్షల రిపోర్టులు వస్తేగాని నిర్ధారణ కాదు. ఆ రిపోర్టులు వచ్చేవరకు ఆమె మృతదేహాన్ని వైద్య సిబ్బంది ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. 

Updated Date - 2020-05-21T09:23:56+05:30 IST