మళ్లీ వరద భయం

ABN , First Publish Date - 2020-10-19T08:57:05+05:30 IST

భీమా నది నుంచి జూరాల ప్రాజెక్టుకు 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు మహారాష్ట్ర నీటి పారుదల శాఖ నుంచి వచ్చిన లేఖతో జూరాల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు

మళ్లీ వరద భయం

జూరాలకు 8 లక్షల క్యూసెక్కుల నీరు 

అప్రమత్తమైన అధికార యంత్రాంగం

నారాయణపూర్‌ నుంచి యథావిధిగా ప్రవాహం


గద్వాల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): భీమా నది నుంచి జూరాల ప్రాజెక్టుకు 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు మహారాష్ట్ర నీటి పారుదల శాఖ నుంచి వచ్చిన లేఖతో జూరాల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ శ్రుతి ఓఝాకు అందిన సమాచారం మేరకు అధికార యంత్రాంగంతో పరిస్థితిని సమీక్షించారు. నాలుగు రోజులుగా జూరాలకు రోజుకు ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి రెండు లక్షల క్యూసెక్కులు, భీమా నది నుంచి మూడు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. నాలుగు రోజులుగా జూరాల ప్రాజెక్టుకు వచ్చిన వరద నీటిని కృష్ణా నది ద్వారా శ్రీశైలానికి వదిలారు. మరో పక్క తుంగభద్ర నది కూడా మరో 48 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఈ నీరు సుంకేసుల నుంచి శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో కలుస్తోంది.


సురక్షిత ప్రాంతాలకు ఎనిమిది గ్రామాల ప్రజలు

జూరాలకు పది లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే ప్రాజెక్టు 62 గేట్లు తెరవాల్సి ఉంటుంది. నది పరివాహక ప్రాంతాలతోపాటు జూరాల బ్యాక్‌ వాటర్‌ ప్రాంతాలు జలమయం కానున్నాయి. భీమా నది నుంచి 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడానికి రెండు రోజులు పట్టే అవకాశం ఉంటుందని జూరాల ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మాత్రం జూరాలకు భీమా నుంచి మూడున్నర లక్షల నీరు వస్తోంది. నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి మరో లక్షన్నర వరద నీరు వస్తోంది. ప్రస్తుతం 43 గేట్ల ద్వారా జూరాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు.


సందర్శకుల సందడి..

జూరాలకు ప్రాజెక్టు వద్ద సందర్శకుల సందడి మొదలైంది. జూరాల నుంచి విడులవుతున్న నీటిని చూసి అనందం పొందుతున్నారు. జూరాల కాల్వల వద్ద చేపల వంటకాల రుచులు చూస్తున్నారు. కొంత మంది ఇళ్ల వద్దనే రకరకాల వంటకాలతో వచ్చి జూరాల నీటి అందాలను తిలకిస్తున్నారు. ప్రయాణికులు సైతం వాహనాలను నిలుపుకొని జూరాల నీటి అందా లను వీక్షిస్తున్నారు.

Updated Date - 2020-10-19T08:57:05+05:30 IST