భయం మా బయోడేటాలోనే లేదు

ABN , First Publish Date - 2022-06-24T08:21:05+05:30 IST

‘తప్పుడు కేసులకు భయపడం. భయం మా బయోడేటాలోనే లేదు. జగన్‌ మాఫియా రెడ్డికి అధికారం శాశ్వతం కాదు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రావులాపురంలో ఇటీవల వైసీపీ నేతల చేతిలో..

భయం మా బయోడేటాలోనే లేదు

తప్పుడు కేసులకు భయపడం.. అధికారంలోకి వచ్చాక పిన్నెల్లిని వదలం

దేశంలో ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి శిక్షిస్తాం..

చట్టాల్ని ఉల్లంఘించిన అధికారులనూ వదలం

ప్రజలే ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారు..

తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి: లోకేశ్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హెచ్చరిక

రావులాపురంలో హత్యకు గురైన జల్లయ్య కుటుంబానికి పరామర్శ


బొల్లాపల్లి, జూన్‌ 22: ‘తప్పుడు కేసులకు భయపడం. భయం మా బయోడేటాలోనే లేదు. జగన్‌ మాఫియా రెడ్డికి అధికారం శాశ్వతం కాదు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రావులాపురంలో ఇటీవల వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన జల్లయ్య కుటుంబాన్ని గురువారం రాత్రి ఆయన పరామర్శించారు. ఆ కుటుంబానికి పార్టీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ తనతోపాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపై అనేక కేసులు పెట్టారని, తనపై 307తోపాటు 14 కేసులు పెట్టారని చెప్పారు. 2019కి ముందు తాను ఏనాడూ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లలేదని, జగన్‌ ప్రభుత్వం వచ్చాక తనపై దొంగ కేసులు పెట్టిందని విమర్శించారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను, ప్రజలను వేధించి హింసిస్తున్న వైసీపీ వారిని వదిలిపెట్టేది లేదని చెప్పారు. మాచర్ల నియోజకవర్గంలో ఆరుగురు టీడీపీ నాయకులు, కార్యకర్తలను హత్య చేశారని, వీరందరూ బలహీనవర్గానికి చెందిన వ్యక్తులని తెలిపారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిల్లిలాంటివాడని విమర్శించారు.


2024 తర్వాత ఈ పిల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడికి పోతాడు. దేశంలో ఎక్కడ దాక్కున్నా తీసుకువచ్చి మరీ శిక్షించక తప్పదని హెచ్చరించారు. పిన్నెల్లి గుట్కా, కల్తీ మద్యం, అక్రమ గ్రానైట్‌ వ్యాపారం చేస్తున్నాడని, వీటన్నింటినీ టీడీపీ అధికారంలోకి రాగానే బయటపెట్టి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే పల్నాడు ప్రాంతంలో పోలీసు అధికారులు టీడీపీ శ్రేణులను భయపెట్టి గ్రామాల నుంచి పంపేశారని తెలిపారు.


పోలీసులు తాము వేసుకున్న యూనిఫాంకు చెడ్డ పేరు తెస్తున్నారని విమర్శించారు. పసుపు జెండాను చూస్తే జగన్‌ మాఫియా రెడ్డి, ఎమ్మెల్యేలు వణుకుతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజలే ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని, వీరిని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. ‘ప్రజలకు, పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఒకటే హామీ ఇస్తున్నాను. చట్టాలను ఉల్లంఘించి వేధింపులకు గురి చేసిన ఏ అధికారులనూ వదిలిపెట్టేది లేదు’ అని లోకేశ్‌ స్పష్టం చేశారు. జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తుంటే నోటీసులు ఇవ్వటం దారుణమన్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని, చట్టాలను ఉల్లంఘించి మాచర్ల ప్రాంతంలో గ్రామాల నుంచి పార్టీ శ్రేణులను బహిష్కరించిన అధికారులను వదిలిపెట్టబోమన్నారు. జగన్‌ మాఫియా రెడ్డి పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని తెలిపారు. 


ప్రజల కోసం రోడ్డెక్కుతా

పార్టీ ఆదేశాల మేరకు ప్రజల్లోకి వెళ్లాలని సంకల్పించినట్టు లోకేశ్‌ చెప్పారు. ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టి, చైతన్యపరచటానికి రోడ్డెక్కుతానని తెలిపారు. జల్లయ్య కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించామని, వారి ముగ్గురు పిల్లలను చదివించే బాధ్యతను స్వీకరిస్తున్నామని, ఆ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్‌, ప్రత్తిపాటి పుల్లారావు, కోడెల శివరాం, అరవిందబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-24T08:21:05+05:30 IST