నా పర్యటనలతో వైసీపీలో భయం!

ABN , First Publish Date - 2022-05-10T08:39:37+05:30 IST

తన పర్యటనలకు వస్తున్న ప్రజాస్పందన వైసీపీలో భయం కలిగిస్తోందని, దాంతో వక్రీకరణ రాజకీయాలకు దిగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. బలహీనపడినప్పుడల్లా వక్రీకరణ రాజకీయాలకు దిగడం వైసీపీకి అలవాటుగా

నా పర్యటనలతో వైసీపీలో భయం!

అందుకే వక్రీకరణ రాజకీయాలు..

బలహీనపడినప్పుడల్లా ఇదే వైఖరి

పొత్తులపై నేనెక్కడా మాట్లాడలేదు..

అయినా మంత్రుల దుష్ప్రచారం

జగన్‌ పులి కాదు.. పిల్లి అందుకే అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు

ఆ పార్టీకి వచ్చే ఎన్నికలే ఆఖరు

టీడీపీ నేతల భేటీలో చంద్రబాబు స్పష్టీకరణ


అమరావతి, మే 9 (ఆంధ్రజ్యోతి): తన పర్యటనలకు వస్తున్న ప్రజాస్పందన వైసీపీలో భయం కలిగిస్తోందని, దాంతో వక్రీకరణ రాజకీయాలకు దిగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. బలహీనపడినప్పుడల్లా వక్రీకరణ రాజకీయాలకు దిగడం వైసీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. సోమవారం టీడీపీ పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, మండల, డివిజన్‌ అధ్యక్షులతో ఆయన ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. ‘విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఒక గ్రామ ప్రజలతో కూర్చుని నేను మాట్లాడుతున్నప్పుడు వారు జై బాబు అని నినాదాలు చేశారు. కానీ జై జగన్‌ అన్నట్లుగా మార్చి వైసీపీ నేతలు ప్రచారం చేశారు.


అదేదో నిజమని నమ్మి ఆ పార్టీ మంత్రులు విలేకరుల సమావేశాలు కూడా నిర్వహించారు. మార్ఫింగ్‌ కళలో ఆ పార్టీ ఎంత ఆరితేరిందో ఇదే ఉదాహరణ’ అని వ్యాఖ్యానించారు. పొత్తులపై తానెక్కడా ఏ వ్యాఖ్యలు చేయకపోయినా దానిపై మాట్లాడినట్లు కూడా ప్రచారం చేశారని విమర్శించారు. ‘ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా ఏకమై కలిసి రావాలని నేను మాట్లాడితే పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారు. నా పర్యటనలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఈ డ్రామాలు మొదలుపెట్టారు’ అని అన్నారు. రాష్ట్ర ప్రజల్లో జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందని, అన్ని వర్గాల ప్రజలూ ఈ అసమర్థ పాలనతో విసిగిపోయి ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమైంది. ఏ వర్గం ప్రజలను కదిలించినా ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రం మళ్లీ నిలదొక్కుకోవాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ మళ్లీ రావాలని ప్రజలే భావిస్తున్నారు. జగన్‌ పోకడల పట్ల  వ్యక్తమవుతున్న వ్యతిరేకత చూస్తే వచ్చే ఎన్నికలే వైసీపీకి చివరి ఎన్నికలు. తమ పాలన చూసి ప్రజలు ఇక ఏనాటికీ తమకు అవకాశమివ్వరని వైసీపీ నేతలే భావిస్తున్నారు. తన కాళ్ల కింద నేల కదిలిపోతున్నా జగన్‌ ఇంకా తాను పులినని భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.


ఆయన పులి కాదు.. పిల్లి. అందుకే అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు’ అని ఎద్దేవాచేశారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన విశేషాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీఎల్పీ ఉప నేత రామానాయుడు ఈ సమావేశంలో వివరించారు. ఎన్నికలకు రెండేళ్ల ముందే ప్రజల్లో ఇంత అనూహ్య స్పందన తాము ఊహించలేదని, ప్రత్యేకించి యువతలో పార్టీ పట్ల జోష్‌ కనిపిస్తోందని అచ్చెన్న వ్యాఖ్యానించారు. చంద్రబాబు జిల్లాల పర్యటన రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు కలిగించిందని, వైసీపీలో కలవరం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని రామానాయుడు చెప్పారు. ప్రజా సమస్యలపై చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లాలని మండల పార్టీ అధ్యక్షులకు చంద్రబాబు సూచించారు. గ్రామ స్థాయిలో పార్టీలో చేరికలను ఆహ్వానించాలని గట్టిగా చెప్పారు. సీఎం నియోజకవర్గం పులివెందులలో బలహీన వర్గాల కాలనీల ప్రజలకు తాగునీరు ఇవ్వలేకపోవడం పాలనా వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోందన్నారు.

Read more