రామక్షేత్రంలో భయంభయం

ABN , First Publish Date - 2020-08-11T09:33:57+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతుండటం, అలాగే దేవస్థానంలో పని చేసే సిబ్బందిలో రోజుకొకరికి కరోనా లక్షణాలు వెలుగులోకి వస్తుండటంతో భద్రాద్రి దేవస్థానం అధికారుల్లో కలవరం కనిపిస్తోంది.

రామక్షేత్రంలో భయంభయం

రామాలయంలో మరో వైదిక సిబ్బందికి కరోనా

లాక్‌డౌన్‌ దిశగా భద్రాద్రి దేవస్థానం

అన్నవరం తరహాలో అమలుకు యోచన 

ఈవో అనుమతిస్తే అమలు చేస్తామంటున్న అధికారులు


భద్రాచలం, ఆగస్టు 10 :  కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతుండటం, అలాగే దేవస్థానంలో పని చేసే సిబ్బందిలో రోజుకొకరికి కరోనా లక్షణాలు వెలుగులోకి వస్తుండటంతో భద్రాద్రి దేవస్థానం అధికారుల్లో కలవరం కనిపిస్తోంది. ఎటు నుంచి ఎవరి ద్వారా తమకు కరోనా వస్తుందోనన్న భయం వారిలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే భద్రాద్రి దేవస్థానంతో అనుబంధం కలిగి ఉన్న ఐదుగురు వ్యక్తులకు పాజిటివ్‌ నిర్ధారణైంది.ఈ నేపథ్యంలో మరో వైదిక సిబ్బందికి కూడా కరోనా నిర్ధారణవడంతో అటువైదిక సిబ్బంది, ఇటు పరిపాలన సిబ్బంది భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.


దీంతో ఏపీలోని అన్నవరం శ్రీ రమాసమేత సత్యనారాయణస్వామి ఆలయంలో సోమవారం నుంచి లాక్‌డౌన్‌ విధించిన తరహాలతో భద్రాద్రిలో కూడా రామాలయంలో లాక్‌డౌన్‌ విధించాలనే వాదన దేవస్థానం అధికారులను వినిపిస్తోంది. 15రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించడంతో కరోనా వ్యాప్తి కొద్దిమేరకు నియంత్రించే అవకాశం ఉందని లేదంటే ఆలయంలో పని చేస్తున్న మరింత మంది సిబ్బందికి వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని వారు వాపోతున్నారు. ఇప్పటికే ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించే కీలకమైన వైదిక సిబ్బంది పర్యవేక్షణ, రక్షణ చర్యలు చేపట్టే సిబ్బందికి కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.


రామాలయంలోకి భక్తులను దర్శనాలకు అనుమతించకుండా నిలిపివేయడం ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా చేయవచ్చని వారు సూచిస్తున్నారు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన సమయంలో ఏ తరహాలో పూజా కార్యక్రమాలు నిర్వహించారో అదే రీతిలో పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని, కాబట్టి లాక్‌డౌన్‌ విధించడం ఎంతో అవసరమని వారు పేర్కొంటున్నారు. రామాలయానికి రోజుకు 500నుంచి వెయ్యి మంది భక్తులు మాత్రమే వస్తుండటంతో రోజూ ఆదాయం కూడా అంతగా రావడం లేదని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం భద్రాద్రి దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టిన రమాదేవికి నివేదించే యోచనలో స్థానిక అధికారులు, ఉద్యోగులున్నారు.


ఇప్పటికే భద్రాచలంలో చిన్న ఆలయాలు మూసివేయగా.. అదే రీతిలో రామాలయంలో భక్తులను అనుమతించకుండా ఉంచాలని వారు సూచిస్తున్నారు. ఏదైమైనా ఈవో నిర్ణయం మేరకే ఈ లాక్‌డౌన్‌ ఉండే అవకాశాలున్నాయని దేవస్థానం వర్గాలు పేర్కొంటున్నాయి. 

Updated Date - 2020-08-11T09:33:57+05:30 IST