Abn logo
May 18 2021 @ 01:03AM

బాబాయ్‌ ‘బ్లాక్‌ ఫంగస్‌’..!

ఎస్‌ఆర్‌ఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్లాక్‌ ఫంగస్‌ బాధితుడు రశ్రీను

వారంలో వెలుగుచూసిన 12 కేసులు

మార్కాపురంలోనే ఆరుగురు బాధితులు

చీరాలలో ఒకరు, మార్కాపురంలో మరొకరు మృతి 

వైద్యం కోసం పరుగులు తీస్తున్న వైనం

ఇంకా పలువురికి కంటి సమస్యలు

కలవర పడుతున్న ప్రజలు

ఒంగోలు/ఒంగోలు కార్పొరేషన్‌ మే 17 :

రెండవ విడత కరోనా ఉధృతితో వణికిపోతున్న జిల్లా ప్రజలను తాజాగా బ్లాక్‌ ఫంగస్‌ మరింత భయపెడుతోంది. కరోనా వ్యాధి సోకి, తగ్గిన అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల బ్లాక్‌ ఫంగస్‌ సోకుతున్న వార్తలు, వింటున్న జిల్లా ప్రజలకు ఒక్కసారిగా జిల్లాలో ఊహించని రీతిలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగుచూడటం కలవరాన్ని సృష్టిస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఏకంగా 12 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు జిల్లాలో వెలుగు చూశాయి. ఇప్పటికే ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఒక్క మార్కాపురంలోనే ఆరు కేసులు వెలుగుచూడగా, చీరాలలో ఒకటి, ఒంగోలు రిమ్స్‌లో నాలుగు, అలాగే ఒంగోలుకు చెందిన మరో యువకుడికకి ఫంగస్‌ సోకింది. అందులో చీరాలలో ఒకరు, మార్కాపురంలో ఒకరు ఇప్పటికే మృతిచెందారు. ఇంకా ఎక్కువ సంఖ్యలోనే ఈ ఫంగస్‌ సోకిన బాధితులు జిల్లాలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా, బ్లాక్‌ ఫంగస్‌ సోకినవారంతా కరోనా సోకిన బాధితులే కావడం గమనార్హం.  

 బ్లాక్‌ ఫంగస్‌ జిల్లావాసులను వణికిస్తోంది. ఇప్పటికే కరోనా సెకండ్‌వేవ్‌ వైరస్‌ ఉధృతితో గడగడలాడుతున్న జనాలను తాజాగా మరో మహమ్మారి భయపెడుతోంది. ఆదివారం జిల్లాలో ఒక కేసు వెలుగుచూడగా సోమవారం మరికొన్ని కేసులు బయటపడ్డాయి. కరోనా సోకిన అనంతరం చికిత్సపొందే సమయంలో ఎక్కువ ఐసీయూలో ఉండటం, ఆక్సిజన్‌ వాడకం, స్టెరాయుడ్స్‌ అధిక వాడకం వంటి కారణాలతో కొంతమందిలో బ్లాక్‌ ఫంగస్‌ వస్తున్నట్లు వైద్యవర్గాల సమాచారం. ఒంగోలుకు చెందిన పందికట్ల శ్రీనివాసరావు బ్లాక్‌ ఫంగ్‌సతో కన్ను దెబ్బతిని చెన్నైలో చికిత్సపొందుతున్న విషయం ఆదివారం వెలుగుచూడగా, మిగిలిన 11 కేసులు సోమవారం వెలుగులోకి వచ్చాయి. 


మార్కాపురంలో భయం భయం

మార్కాపురం పట్టణంలో గత నెలరోజుల వ్యవధిలో కరోనా బారినపడి, చికిత్స పొందిన ఆరుగురుకి బ్లాక్‌ ఫంగస్‌ ఎటాక్‌ అయినట్లు అక్కడి వైద్యులు ఆదివారం గుర్తించారు. అందులో మార్కాపురం పట్టణానికి చెందిన ఐదుగురు ఉండగా, సమీప గ్రామమైన రాయవరానికి చెందిన మరొకరు ఉన్నారు. ఈ ఆరుగురిలో నలుగురు ప్రభుత్వ వైద్యశాలలోను, ఇద్దరు ప్రైవేటు వైద్యశాలలోను చికిత్సపొంది, కరోనా తగ్గి, ఇళ్లకు వెళ్లారు. వారు మరలా అనారోగ్యంగా ఉండటంతో నాలుగురోజుల క్రితం మరలా తాము చికిత్స పొందిన వైద్యశాలలకు వచ్చి చూపించుకున్నారు. అయితే తాజాగా వచ్చిన లక్షణాలు కరోనాకు సంబంధించినవి కావని డాక్టర్లు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అలా మంగళగిరి సమీపంలోని మణిపాల్‌ హాస్పిటల్‌లో ముగ్గురు చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరు అక్కడికే వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. కాగా బ్లాక్‌ ఫంగస్‌ సోకిన మహిళ (60) నాలుగురోజుల క్రితం మృతిచెందారు. ఈ విషయాలపై మార్కాపురంలోని వైద్యాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. 


చీరాలలో యువకుడి మృతి

ఇదిలా ఉండగా, చీరాల శివారు, పేరాలకు చెందిన సురేష్‌ అనే యువకుడు పదిరోజుల క్రితం కరోనా సోకడంతో గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండగా, బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలు వెలుగుచూశాయి. అది గుర్తించిన అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లాలని సూచించడంతో నాలుగు రోజుల క్రితం వెళ్లాడు. అక్కడి ప్రైవేటు వైద్యశాలలో చేరి, చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందారు. ఇక ఒంగోలుకు చెందిన శ్రీనివాస్‌ అనే యువకుడు ప్రస్తుతం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒంగోలులోని ప్రభుత్వ వైద్యశాల రిమ్స్‌లో నాలుగు కేసులు వెలుగుచూశాయి. రిమ్స్‌ వైద్యుల నుంచి అందిన సమాచారం మేరకు ఇటీవల బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో నలుగురు రిమ్స్‌లో చేరారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న ఒక మహిళ మెరుగైన వైద్యం కోసం   రాయవేలూరుకు అలాగే మరొకరు హైదరాబాద్‌కు వెళ్లగా, మరో ఇద్దరు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. 


తీవ్ర లక్షణాలు..

కరోనా సెకండ్‌వేవ్‌ సమయంలో ఈ వ్యాధి జిల్లాలో విజృంభించడం ప్రజానీకాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కళ్ళు, ముక్కు ఉబ్బి ఎరుపెక్కడం, తీవ్రంగా తలనొప్పి, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో తీవ్రస్థాయిలో సమస్య ఏర్పడటంతోపాటు రక్తపు వాంతులు, మానసిక పరిస్థితిలో కూడా మార్పులు సాధారణ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఫంగస్‌ సోకిన బాధితులు మరికొంతమంది ఉండే అవకాశం ఉందని, వైద్యవర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు తమ దృష్టికి వచ్చిన బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల వివరాల సేకరణపై అధికారులు దృష్టిపెట్టారు. కరోనా తరహాలో బ్లాక్‌ఫంగస్‌ బాధితుల నుంచి మరొకరికి అంటుకునే వ్యాధి కాదని వైద్యులు చెబుతున్నారు.


ప్రాథమిక దశలో గుర్తిస్తే ప్రమాదాన్ని అరికట్టవచ్చు

- డాక్టర్‌ జాన్‌ రిచర్డ్స్‌, రిమ్స్‌

బ్లాక్‌ ఫంగ్‌సను ప్రాథమిక దశలో గుర్తించి వైద్యం అందిస్తే ఎలాంటి ప్రాణాపాయం ఉండదు. ముఖ్యంగా కొవిడ్‌ బారిన పడిన బాధితులకు నిర్దేశించిన సమయంలో ఇంజక్షన్స్‌ వాడాలి. అదేవిధంగా ప్రతిరోజు ఆక్సిజన్‌లో డిస్టిలర్‌ వాటర్‌ మార్చుకోవడం ద్వారా ముప్పును అరికట్టవచ్చు. కొవిడ్‌ బారినపడి, నియంత్రణ లేని షుగర్‌తో బాధపడే వారిలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. గతేడాదిలోనూ ఆరు బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రాథమిక దశలో గుర్తించి వైద్యం అందిస్తే ఎలాంటి ఇబ్బందిఉండదు. భయపడాల్సిన పనిలేదు. అలా అని నిర్లక్ష్యం చేయకూడదు, ముందుగా గుర్తించకుంటేవైరస్‌ మెదడుకు సోకి మనిషి ప్రాణానికే ముప్పు వాటిల్లుతోంది. 

మార్కాపురంలో బ్లాక్‌ ఫంగస్‌తో కన్ను దెబ్బతిన్న బాధితుడు చంద్ర


Advertisement