భయం.. భయం

ABN , First Publish Date - 2022-05-11T06:34:34+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని అటవీ ప్రాంత గ్రామాల్లో చిరుత పులులు, ఎలుగుబంట్ల సంచారం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మండుతున్న ఎండలకు అటవీ ప్రాంతంలో నీరు, ఆహారం దొరకక జనావాసాల్లో సంచరిస్తున్నాయి. దీంతో అటవీ ప్రాంత పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలో చెందుతున్నారు.

భయం.. భయం

జిల్లాలో జనావాసాల్లోకి అటవీ జంతువులు 

మనుషులు, మూగజీవాలపై దాడులు

ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ పలువురు

చిరుతల దాడిలో మృతిచెందిన మూగజీవాలు

భయాందోళనలో అటవీ ప్రాంత పరిసర గ్రామాలు

సుభాష్‌నగర్‌, మే 10: ఉమ్మడి జిల్లాలోని అటవీ ప్రాంత గ్రామాల్లో చిరుత పులులు, ఎలుగుబంట్ల సంచారం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మండుతున్న ఎండలకు అటవీ ప్రాంతంలో నీరు, ఆహారం దొరకక జనావాసాల్లో సంచరిస్తున్నాయి. దీంతో అటవీ ప్రాంత పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలో చెందుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట మనుషులు, మూగజీవాలపై అటవీ జంతువులు దాడులు చేస్తూనే ఉన్నాయి. అడవులను ఆనుకొని ఉన్న గ్రామాల్లో తరచూ వీటి జాడలు కనిపిస్తున్నాయి. సాయంత్రం వేళల్లో చెరువులు, కుంటలు, ఎస్సారెస్పీ పరిసర ప్రాంతాల్లో జింకలు, దుప్పులు, అడవిపందుల గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లా  వ్యాప్తంగా రెండు చోట్ల ఎలుగుబంట్లు దాడులు చేశాయి. డిచ్‌పల్లి మండలం మాక్లూర్‌ తండాలో తునికాకు సేకరణ కోసం వెళ్లిన నడిపిసాయిలుపై మూడు ఎలుగుబంట్లు దాడులు చేసి తీవ్రంగా గాయపర్చాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం జల్దిపల్లి గ్రామంలో తునికాకు కోసం వెళ్లిన మహిళను తీవ్రంగా గాయపర్చాయి. గతంలో ఎలుగుబంట్ల దాడిలో చాలా మంది కళ్లు, కాళ్లు, చేతులు కోల్పోయినవారు ఉన్నారు.

ఇటీవల పెరిగిన చిరుతల సంచారం..

కొద్దిరోజులుగా చిరుతపులుల సంచారం ఎక్కువైంది. సాధారణంగా జనాల సందడి కనిపిస్తేనే కనుమరుగయ్యే చిరుతలు ప్రస్తుతం ఏకంగా పల్లెల్లోకి ప్రవేశించాయి. గ్రామాల పొలిమేరల్లో కాపుకాసి మరీ దాడులు చేస్తున్నాయి. మేకలు,గొర్రెలు, పశువులపై దాడి చేసి చంపుతున్న సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. రాత్రి వేళల్లో అడవుల సమీపంలోని పల్లెల్లోకి వచ్చి ఆహారం కోసం వెతుకుతున్నాయి. దాహార్తి తీర్చుకునేందుకు పొలాల వద్ద తచ్చాడుతున్నాయి. దాహార్తి తీర్చుకునేందుకు వచ్చి  జనంపై కూడా దాడులు చేస్తున్నాయి. ఇటీవల ధర్పల్లి మండలం కోటాల్‌పల్లి గ్రామంలో అంబి అనే మహిళపై చిరుతపులి దాడి చేసి ఆవుదూడను ఎత్తుకెళ్లింది. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలో చిరుత దాడి చేసి గేదెను చంపివేసింది. అలాగే నవీపేట మండలంలో మోకాన్‌పల్లి గ్రామంలో చిరుత సంచారంతో రెండుమూడు రోజులు గ్రామస్థులు భయాందోళనలో బతికారు. అటవీశాఖ అధికారులు బోనును ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది.

అడవుల్లో ఏర్పాట్లు కరువు..

   వేసవి దృష్టా అటవీశాఖాధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉంది. అడవుల్లో జంతువులకు కావాల్సిన తాగునీరు, ఆహరం సమకూర్చాలి. వాటి దప్పిక తీర్చేందుకు చెట్ల కొమ్మలకు సాల్ట బ్రిక్‌(ఉప్పు ముద్దలు) వేలాడదీస్తారు. దాహం వేసినప్పుడల్లా జంతువులు ఈ ఉప్పు ముద్దతో దాహార్తిని తీర్చుకుంటాయి. వీటితో పాటు నీటీకుంటలు ఏర్పాటు చేసి రోజుకు రెండు సార్లు వాటిని నింపాల్సి ఉంటుంది. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా వీటిని  నింపే ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తప్ప.. మరెక్కడా ఇలాంటి వసతులు కల్పించడంలేదు.

అన్ని చర్యలు తీసుకుంటున్నాం..

ఫ సునీల్‌ హెరామాత్‌, జిల్లా అటవీశాఖ అధికారి

అటవీ జంతువులకు అడవుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. సాసర్‌ ఫిట్‌లతో ఎప్పటికప్పుడు నీటిని నింపుతూ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అటవీ జంతువులు ఇళ్లల్లోకి వచ్చి దాడులు చేయడంలేదు. మనుషులే అడవిలోకి వెళ్లడంతోనే దాడులు జరుగుతున్నాయి.

Read more