Mar-a-Lago: ట్రంప్‌ ఎస్టేట్‌లోని టాప్ సీక్రెట్ దస్త్రాలను స్వాధీనం చేసుకున్న ఎఫ్‌బీఐ

ABN , First Publish Date - 2022-08-14T02:29:51+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు(Donald Trump) చెందిన మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో(Mar-a-Lago) లభించిన 11 రహ్యస ప్రభుత్వ డాక్యుమెంట్లను ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ(FBI) తాజాగా జప్తు చేసింది.

Mar-a-Lago: ట్రంప్‌ ఎస్టేట్‌లోని టాప్ సీక్రెట్ దస్త్రాలను స్వాధీనం చేసుకున్న ఎఫ్‌బీఐ

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు(Donald Trump) చెందిన మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో(Mar-a-Lago) లభించిన 11 రహ్యస ప్రభుత్వ డాక్యుమెంట్లను  ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ(FBI) తాజాగా జప్తు చేసింది. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక ట్రంప్.. పలు అధికారిక డాక్యుమెంట్లు తిరిగివ్వలేదన్న ఆరోపణలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌బీఐ గత వారం ట్రంప్ ఎస్టేట్‌లో సోదాలు జరిపింది. ఆ సమయంలో అక్కడ లభించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను అధికారులు జప్తు చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సోదాలకు సంబంధించి కొన్ని ప్రభుత్వ ఆదేశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.


సోదాల్లో అధికారులు మార్-ఎ-లాగో ఎస్టేట్‌ నుంచి మొత్తం 20 అట్టపెట్టెలను స్వాధీనం చేసుకున్నారట. అంతేకాకుండా.. గూఢచర్య చట్టం ఉల్లంఘన, నేరపూరితంగా ప్రభుత్వ రికార్డులను కలిగి ఉండటం,  న్యాయప్రక్రియకు అడ్డుతగలడం తదితర అభియోగాలపై న్యాయమూర్తి ఈ సోదాలకు అనుమతించినట్టు తేలింది. కాగా.. అధికారులకు చిక్కిన రికార్డుల్లో ట్రంప్ అధక్ష్యుడిగా హోదాలో క్షమాభిక్ష అంశానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. 17 ఎకరాల మేర విస్తరించిన మార్-ఎ-లాగోలో భారీ భవంతి ఉందని అధికారులు తెలిపారు. అందులో 58 బెడ్‌రూములు, 33 బాత్‌రూములు, ఉన్నాయన్నారు. అంతేకాకుండా.. అతిథుల కోసం ప్రైవేటు గెస్ట్ హౌస్‌లు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే.. ఇతరులు వినియోగిస్తున్న గదులు, గెస్ట్‌  హౌస్‌లో ఎటువంటి సోదాలు చేపట్టవద్దని కోర్టు అప్పట్లో అధికారులకు సూచించింది. 

Updated Date - 2022-08-14T02:29:51+05:30 IST