రిలయన్స్‌ జియోలో ఫేస్‌బుక్‌కు 10 శాతం వాటా?

ABN , First Publish Date - 2020-03-26T08:15:52+05:30 IST

దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన రిలయన్స్‌ జియోలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ 10 శాతం వాటాను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 2020 మార్చి 31 వరకు

రిలయన్స్‌ జియోలో ఫేస్‌బుక్‌కు 10 శాతం వాటా?

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన రిలయన్స్‌ జియోలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ 10 శాతం వాటాను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 2020 మార్చి 31 వరకు రిలయన్స్‌ జియోను రుణ రహిత కంపెనీగా మార్చాలన్న లక్ష్యంతో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ ఉంది. ఇందులో భాగంగా వాటాను విక్రయించాలని రిలయన్స్‌ భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. కాగా రిలయన్స్‌ జియోలో వాటా తీసుకోవాలని ఫేస్‌బుక్‌ యోచిస్తున్నట్టు అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ డెయిలీ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ కారణంగా డీల్‌ కాలపరిమితిపై ప్రభావం పడవచ్చని తెలిపింది.


అయితే దీనిపై ఫేస్‌బుక్‌, జియో స్పందించలేదు. తన అన్ని డిజిటల్‌ కార్యకలాపాలు, యాప్స్‌ను ఒక సంస్థ కిందకు తీసుకురానున్నట్టు గత ఏడాదిలో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ ప్రకటించింది. అంతేకాకుండా రూ.1.08 లక్షల కోట్ల ఈక్విటీని ఈ సంస్థకు అందించనున్నట్టు తెలిపింది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ను ఇంటిగ్రేట్‌ చేసే చర్యల్లో భాగంగా జియో యాప్స్‌ అయినటువంటి  జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్‌ వంటి వాటిని కొత్త సంస్థ కిందకు తీసుకురానున్నారు. వ్యూహాత్మక ఇన్వెస్టర్‌ను ఆకట్టుకోవడానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.

Updated Date - 2020-03-26T08:15:52+05:30 IST