రాష్ట్రంలో మనకు సానుకూలతే

ABN , First Publish Date - 2022-06-02T08:31:00+05:30 IST

మేడ్చల్‌/హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్‌ పార్టీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయని చింతన్‌ శిబిర్‌లో పలువురు

రాష్ట్రంలో మనకు సానుకూలతే

-నవసంకల్ప శిబిర్‌లో కాంగ్రెస్‌ నేతల అంచనా 

-రచ్చబండ తరహాలో ప్రజల్లోకి వెళ్దాం

-వరంగల్‌ రైతు డిక్లరేషన్‌కు విశేష ఆదరణ

-టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

-పెన్షన్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపైనా అసంతృప్తి

-ఆయా అంశాలపై స్పష్టమైన హామీలు ఇవ్వాలి

-టీఆర్‌ఎస్‌, బీజేపీని ఓడించడమే అజెండా

-పొత్తులపై ఇప్పుడే చర్చించడం తొందరపాటే

మేడ్చల్‌/హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్‌ పార్టీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయని చింతన్‌ శిబిర్‌లో పలువురు కాంగ్రెస్‌ నాయకులు అభిప్రాయపడ్డారు. మేడ్చల్‌ జిల్లా కీసర మండలం రాంపల్లిదాయరలోని బాలవికాస కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న నవసంకల్ప శిబిర్‌ బుధవారం ప్రారంభమైంది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, సీఎల్పీ నేత, చింతన్‌ శిబిర్‌ కన్వీనర్‌ మల్లు భట్టి విక్రమార్క జెండా ఆవిష్కరించిన తర్వాత సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక్కో బృందంలో 25 మంది చొప్పున మొత్తం ఆరు బృందాలు ఏర్పాటు చేసి, రాజకీయం, వ్యవసాయం, సామాజిక న్యాయం, ఆర్థికం, యువత-మహిళా సాధికారతపై చర్చ జరిపారు. 

వివిధ అంశాలపై లోతైన చర్చ

తొలుత ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన బృందం.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై చర్చించింది. రాష్ట్రంలో పెన్షన్లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు తదితర పథకాల అమలుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. వరంగల్‌లో పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌పై అన్ని వర్గాల్లో చర్చ జరుగుతోందని డీసీసీ అధ్యక్షులు, పలువురు ముఖ్యనేతలు వివరించారు. అదే తరహాలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకూ, ఇతర వర్గాల సాధికారతపై డిక్లరేషన్‌ను ప్రకటించి రచ్చబండ తరహాలో ప్రజల్లోకి వెళ్లాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలకు.. కాంగ్రెస్‌ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసిన సంగతి గుర్తు చేయాలని, పెన్షన్ల మంజూరుకు సంబంధించి స్పష్టమైన హామీలు ఇచ్చి ప్రజల్లో నమ్మకం కల్పించాలని నిర్ణయించారు. అవినీతి టీఆర్‌ఎస్‌, మతతత్వ బీజేపీని ఓడించాలన్న నినాదంతో ముందుకు వెళ్లాలన్న అభిప్రాయ్యం వ్యక్తమైంది. కాగా, పొత్తులకు సంబంధించీ చర్చ జరిగింది. సానుకూల పరిస్థితుల నేపథ్యంలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని కొందరు అభిప్రాయపడగా.. దీనిపై ఇప్పుడు చర్చించడం మరీ తొందరపాటు అవుతుందన్న అభిప్రాయం మరి కొందరు వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీని ఓడించాలన్న లైన్‌లో కలిసొచ్చే పార్టీలను కలుపుకొనిపోయే అంశంపై గురువారం చర్చించనున్నారు. టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య నేతృత్వంలోని బృందం.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించింది. సమావేశంలో ప్రధానంగా పీసీసీ, డీసీసీ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు పార్టీ కార్యాలయాల్లో నిర్ణీత సమయంలో నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని, క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. స్థానిక నియామకాలకు సంబంధించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను డీసీసీలు, అనుబంధ సంఘాల నాయకులు వివరించారు. ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఏర్పాటైన బృందం.. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతైన చర్చ నిర్వహించింది. రాష్ట్రంలో కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు ఆర్థిక పరిస్థితికి గుదిబండగా మారాయని, అప్పులూ పెరిగిపోయాయన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలి, సంక్షేమానికి అవసరమైన నిధులను ఎలా సమీకరించుకోవాలన్న అంశంపై ప్రాథమికంగా చర్చించారు. వ్యవసాయంపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సామాజిక న్యాయంపై వి.హన్మంతరావు, యువజన, మహిళా సాధికారత అంశంపై దామోదర రాజనర్సింహ నాయకత్వంలో ఏర్పాటైన బృందాలు సైతం ఆయా అంశాల్లో సమస్యలపైన చర్చించాయి. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఏఐసీసీ చింతన్‌ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే ఆరు గ్రూపులూ ఆయా అంశాలపై చర్చలు జరిపాయి. ఇక్కడ వెల్లడైన అభిప్రాయాలను గురువారం జరిగే సమావేశంలో క్రోడీకరించి.. అవసరమైతే మరో దఫా సమీక్షించి టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సమర్పించనున్నారు. ఆ కమిటీలో చర్చించిన తర్వాత పార్టీ విధాన నిర్ణయాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించనున్నారు. 

ఏఐసీసీకి నివేదిక ఇస్తాం: భట్టి

తెలంగాణ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నవసంకల్ప శిబిర్‌లో చర్చించి ఏఐసీసీకి నివేదిక అందజేస్తామని సీఎల్పీ నేత, శిబిర్‌ కన్వీనర్‌ భట్టి విక్ర మార్క తెలిపారు. నవసంకల్ప శిబిర్‌లో తీసుకునే నిర్ణయాలు రాబోయే ఎన్నికలకు రోడ్‌ మ్యాప్‌ అవుతుందన్నారు. జిల్లాల వారీగా కూడా ఇలాంటి శిబిర్‌లు నిర్వహిస్తామన్నారు. ముందస్తు షెడ్యూల్‌ కారణంగానే టీపీసీసీ చీఫ్‌తో పాటు మరికొంత మంది నాయకులు సమావేశానికి రాలేకపోయారని, వారు రాకపోవడంలో ఎలాంటి వివాదాలు లేవని స్పష్టం చేశారు. ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన చింతన్‌ శిబిర్‌లో జరిగిన తీర్మానాలపై చర్చించేందుకు ఏఐసీసీ సూచన మేరకు నవసంకల్ప్‌ శిబిర్‌ను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామని ఉత్తమ్‌ తెలిపారు. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. వరంగల్‌ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌కు టీపీసీసీ కట్టుబడి ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. సామాజిక న్యాయమే కాంగ్రెస్‌ లక్ష్యమని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50శాతం సీట్లు కేటాయించనున్నట్లు ఉదయ్‌పూర్‌లో చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని కోరారు.

Updated Date - 2022-06-02T08:31:00+05:30 IST