ఫెడెక్స్‌ రికార్డుపై రఫా గురి

ABN , First Publish Date - 2020-09-27T09:40:25+05:30 IST

మట్టికోర్టులో మకుటంలేని మహారాజు రఫెల్‌ నడాల్‌.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ రికార్డుపై కన్నేశాడు

ఫెడెక్స్‌ రికార్డుపై రఫా గురి

ఫేవరెట్లు  హలెప్‌, సెరెనా, థీమ్‌

 మ. 2.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

పారిస్‌: మట్టికోర్టులో మకుటంలేని మహారాజు రఫెల్‌ నడాల్‌.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ రికార్డుపై కన్నేశాడు. ఆదివారం నుంచి జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో స్పెయిన్‌ బుల్‌ నడాల్‌ హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. క్లేకోర్టులో అత్యధికంగా 12 విజయాలు నమోదు చేసిన రఫా.. కెరీర్‌లో ఇప్పటివరకు 19 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. రొలాండ్‌గారోస్‌ టైటిల్‌ నెగ్గితే.. ఫెడరర్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ల రికార్డును రఫా సమం చేస్తాడు. మెయిన్‌ డ్రా తొలిరౌండ్‌లో అన్‌సీడెడ్‌ ఆటగాడు ఇగర్‌ గెరాసిమోవ్‌ (బెలారస్‌)తో నడాల్‌ తలపడనున్నాడు. అయితే, కరోనా మహమ్మారి నేపథ్యంలో గతంలో కంటే భిన్నమైన పరిస్థితులను నడాల్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రపంచ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌, యూఎస్‌ ఓపెన్‌ విజేత డొమినిక్‌ థీమ్‌ నుంచి రఫాకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. కాగా, టోర్నీ షెడ్యూల్‌ మారడం నడాల్‌కు సవాలేనని మాజీ ఆటగాడు బోరిస్‌ బెకర్‌ విశ్లేషిస్తున్నాడు. మహిళల్లో డిఫెండింగ్‌ చాంప్‌, ప్రపంచ నంబర్‌వన్‌ ఆష్లే బార్టీ తప్పుకోవడంతో.. సిమోనా హలె్‌ప (రొమేనియా)కు టాప్‌ సీడ్‌ దక్కింది. 2018లో తొలిసారి టైటిల్‌ నెగ్గిన సిమోనా.. మరోసారి టైటిల్‌ చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. తొలి రౌండ్‌లో సారా సోరిబెస్‌ టోమో (స్పెయిన్‌)తో హలెప్‌ తలపడనుంది. ఓపెన్‌ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన రికార్డును సొంతం చేసుకోవాలనుకుంటున్న అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ తన కలను నెరవేర్చుకుంటుందో లేదో చూడాలి. ఆరోసీడ్‌ సెరెనా తొలి రౌండ్‌లో అమెరికాకే చెందిన క్రిస్టీ అన్‌తో ఆడనుంది. చెక్‌ రిపబ్లిక్‌ స్టార్‌ కరోలినా ప్లిస్కోవా కూడా టోర్నమెంట్‌లో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 

బంతి మరింత బరువుగా: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఎన్నో ఏళ్లుగా బబోలాట్‌ బంతులను ఉపయోగిస్తున్నారు. అయితే, ఈసారి అంతకంటే ఎక్కువ బరువు ఉండే విల్సన్‌ బంతులను వాడనున్నారు. ఈ నిర్ణయంపై నడాల్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో బరువైన బంతితో అంతగా ప్రాక్టీస్‌ చేయలేమన్నాడు. 

Updated Date - 2020-09-27T09:40:25+05:30 IST