పసందైన బరడా రుచులు

ABN , First Publish Date - 2020-10-31T06:05:13+05:30 IST

ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన ఆహారపు అలవాట్లు,. భిన్నమైన రుచులు ఉంటాయి.

పసందైన బరడా రుచులు

ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన ఆహారపు అలవాట్లు,. భిన్నమైన రుచులు ఉంటాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేసే ఆలూ బరడా, బరడా పాల్యా, దొండకాయ బరడా, దోసకాయ బరడా, గుమ్మడికాయ బరడా... వంటలు అలాంటివే. కాస్త వెరైటీ రుచులను ఆస్వాదించాలంటే ఈ వారం బరడా వంటలను మీరూ ట్రై చేయండి. 




ఆలూ బరడా


కావలసినవి

ఆలుగడ్డలు - పావుకేజీ, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - ఒకటి, పసుపు - చిటికెడు, కారంపొడి - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, కరివేపాకు - రెండు రెబ్బలు, ఉప్పు - తగినంత, ఆవాలు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, నూనె - నాలుగు టేబుల్‌స్పూన్లు.

బరడా : సెనగపప్పు - నాలుగు టేబుల్‌స్పూన్లు, పెసరపప్పు - రెండు టేబుల్‌స్పూన్లు


తయారీ విధానం

 ఆలుగడ్డల పొట్టు తీసి కొంచెం పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. 

 ఉల్లిపాయలు సన్నగా తరగాలి. సెనగపప్పు, పెసరపప్పు కలిపి పొడి చేసి పెట్టుకోవాలి. 

 బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించాలి. 

 పసుపు, కరివేపాకు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. 

 తరువాత ఆలుగడ్డ ముక్కలు వేసి కలుపుతూ వేగించాలి. 

 తగినంత ఉప్పు వేసి ఒక కప్పు నీళ్లు పోసి చిన్న మంటపై ఉడికించాలి.

 ఆలుగడ్డ ముక్కలు ఉడికిన తరువాత తయారు చేసి పెట్టుకున్న పొడి వేసి కలపాలి. 

 మరో రెండు నిమిషాల వేగించి, కొత్తిమీర వేసి దింపాలి.

 ఈ బరడా అన్నంలోకి లేదా రొట్టెలలోకి రుచిగా ఉంటుంది.




ఆలుగడ్డ

క్యాలరీలు -  93

కార్బోహైడ్రేట్లు - 21గ్రా

ప్రోటీన్లు - 2.5గ్రా




దోసకాయతో...


కావలసినవి

దోసకాయలు - పావుకేజీ, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు - అర టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌; కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, సెనగపప్పు - పావు కప్పు, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం

 ముందుగా సెనగపప్పును కాస్త వేగించి పొడి చేసి పెట్టుకోవాలి. 

 బాణలిలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగించాలి.

 తరువాత పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. 

 ఇప్పుడు కాస్త పెద్దగా తరిగిన దోసకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేయాలి. 

 ముక్కలు మగ్గిన తరువాత అరకప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. 

 దోసకాయ ముక్కలు సగం ఉడికిన తరువాత సెనగపప్పు పొడి వేసి కలపాలి. 

 మరోకప్పు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. 

 చివరగా కొత్తిమీర వేసి దింపాలి.




దోసకాయ

క్యాలరీలు -  10

ప్రోటీన్లు -  0.6గ్రా

కార్బోహైడ్రేట్లు - 3.6 గ్రా




పాలకూర బరడా


కావలసినవి

పాలకూర - మూడు కప్పులు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - రెండు రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - రెండు టీస్పూన్లు, గరంమసాలా - పావు టీస్పూన్‌, సెనగపిండి - పావు కప్పు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం

పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. 

 స్టవ్‌పై పాన్‌పెట్టి నూనె వేయాలి. నూనె వేడి అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేగించాలి. 

 తరువాత పసుపు, అల్లం  వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి కలపాలి. 

 ఇప్పుడు పాలకూర, తగినంత ఉప్పు, కారం వేసి కలియబెట్టాలి. 

 పాలకూర మగ్గి నీరంతా పోయిన తరువాత సెనగపిండి, ధనియాల పొడి వేసి కలిపి మూతపెట్టి మరికాసేపు వేగనివ్వాలి.

 చివరగా గరంమసాలా వేసి దింపాలి. 





పాలకూర

క్యాలరీలు -  23

కార్బోహైడ్రేట్లు -  3.8గ్రా

ప్రోటీన్లు -  3గ్రా

ఫైబర్‌ -  2.2గ్రా




బరడా పాల్యా (సెనగపప్పు బరడా)


కావలసినవి

సెనగపప్పు - వంద గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, అల్లంముక్క - చిన్నది, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌,  ఆవాలు - అర టీస్పూన్‌, కరివేపాకు - ఒక రెబ్బ, కొత్తిమీర - కొద్దిగా, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం

 సెనగపప్పును గంట పాటు నానబెట్టాలి. తరువాత కుక్కర్‌లో వేసి, కాస్త పసుపు వేసి ఉడికించాలి.

 ఆవిరి పోయాక నీళ్లు తీసేసి, చేత్తో పొడిపొడిగా నలిపి పెట్టుకోవాలి.

 స్టవ్‌పై బాణలి పెట్టి కాస్త నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. 

 తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. 

 తరువాత పసుపు, కారం వేయాలి. నలిపి పెట్టుకున్న పప్పు వేసి కలియబెట్టుకోవాలి.

 ఇప్పుడు తగినంత ఉప్పు, కొత్తిమీర వేయాలి. 

 అంతే... రుచికరమైన బరడా పాల్యా సిద్ధం.




సెనగపప్పు

క్యాలరీలు -  160

ప్రోటీన్‌ -  9.98 గ్రా

కార్బోహైడ్రేట్లు -  26.49 గ్రా

ఫ్యాట్‌ -  2.14 గ్రా


 





గుమ్మడికాయతో... 


కావలసినవి

గుమ్మడికాయ ముక్కలు - పావుకేజీ, సెనగపప్పు - 100గ్రా, పెసరపప్పు - 25గ్రా, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, పసుపు - పావు టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, ఆవాలు - అర టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం

 సెనగపప్పు, పెసరపప్పును గోధుమరవ్వ మాదిరిగా గ్రైండ్‌ చేసుకోవాలి.

 స్టవ్‌పై బాణలి పెట్టి నూనె పోయాలి. కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి.

 తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కలపాలి. 

 ఇప్పుడు కొంచెం పెద్ద ముక్కలుగా తరిగిన గుమ్మడికాయ ముక్కలు వేసి, పసుపు వేసి కలియబెట్టాలి. 

 గుమ్మడికాయ ముక్కలు మగ్గిన తరువాత రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. 

 తగినంత ఉప్పు, కారం వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు గ్రైండ్‌ చేసి పెట్టుకున్న బరడా పొడి వేయాలి.

 చివరగా కొత్తిమీర వేసి దింపాలి. 

 వేడి వేడి అన్నంలో నెయ్యితో పాటు ఈ బరడా కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.




వంద గ్రాముల గుమ్మడికాయలో పోషకాల విలువలు


క్యాలరీలు - 26

పొటాషియం - 340 గ్రా

కార్బోహైడ్రేట్లు - 7 గ్రా

ప్రోటీన్‌ - 1 గ్రా




దొండకాయతో...


కావలసినవి

దొండకాయలు - పావుకేజీ, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, పసుపు - కొద్దిగా, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి -రెండు టీస్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, కరివేపాకు - రెండు రెబ్బలు, కొత్తిమీర - ఒక కట్ట, సెనగపిండి - నాలుగు టేబుల్‌స్పూన్లు, ఆవాలు - అర టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం

దొండకాయలను శుభ్రంగా కడిగి చక్రాలుగా కట్‌ చేసుకోవాలి.

 బాణలిలో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. 

 తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరికాసేపు వేగించాలి.

 అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి. పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలియబెట్టుకోవాలి.

 ఇప్పుడు దొండకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి చిన్న మంటపై మగ్గనివ్వాలి. 

 ముక్కలు ఉడికిన తరువాత సెనగపిండి వేసి ముక్కలకు పట్టేలా కలపాలి. 

 సెనగపిండి వేగిన తరువాత కొత్తిమీర వేస్తే దొండకాయ బరడా రెడీ. 




దొండకాయలు

క్యాలరీలు - 18

కార్బోహైడ్రేట్లు - 3.55 గ్రా

ప్రోటీన్‌ - 1.57 గ్రా



జ్యోతి వలబోజు
8096310140

Updated Date - 2020-10-31T06:05:13+05:30 IST