Abn logo
Sep 23 2021 @ 00:00AM

ఆరోగ్యానికి అలసందలు!

ఉత్తర ఆఫ్రికానుంచి వేల ఏళ్లకిందట దిగుమతి అయిన విత్తనాలు అలసందలు. ఇంగ్లీషులో బ్లాక్‌ ఐడ్‌ పీస్‌ అంటారు. పేరేదైనా ఆరోగ్యానికి అద్భుతమైనవి అలసందలు. రాయలసీమ, తెలంగాణ మెట్ట భూముల్లోని పంటల మధ్య వరుసల్లో ఒకప్పుడు వీటిని విరివిగా వేసేవారు. పచ్చి విత్తనాల నుంచి ఉడకేసినవి, మొలకెత్తించినవీ తినొచ్చు. కూరల్లో వాడుకుంటారు. వడల్లాంటి తిండి పదార్థాలను చేసుకోవచ్చు. ఏ రూపంలో తీసుకున్నా.. శరీరానికి శక్తినిచ్చే విత్తనాలివి.  


 అలసందల్లో కాపర్‌, మెగ్నీషియం, పాస్ఫరస్‌, జింక్‌, ఐరన్‌ పుష్కలం. దీంతో రక్తకణాల ఆరోగ్యానికి మంచిది. విటమిన్‌ ఏ, బీ, సి లుంటాయి. ఈ ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.. తిన్న వెంటనే సులభంగా జీర్ణమవుతుంది.  


 ఉడకబెట్టిన కప్పు అలసందల్ని తీసుకుంటే.. ఇందులో 160 క్యాలరీలుంటాయి. 33.5 గ్రాములు కార్బోహైడ్రేట్లు, 5.2 గ్రాముల ప్రొటీన్లు, 8.3 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. వీటిలో కాల్షియం, మాంగనీసు.. లాంటివి పుష్కలంగా లభిస్తాయి. 


 కచ్చితమైన డైట్‌ పాటించేవారు పిండి పదార్థాలుండే ఈ ఫుడ్‌ను తింటే బరువును మేనేజ్‌ చేయవచ్చు. ఎందుకంటే వీటిలో కొలెస్ర్టాల్‌ లెవల్‌ తక్కువగా ఉంటుంది. ఈ ఫుడ్‌ను తీసుకుంటే కంటికి కూడా మంచిది. దీంతో పాటు చర్మ ఆరోగ్యానికి మరింత మంచిది.