కుమార్తెల పెళ్లి వేడుకల్లో తండ్రి.. ఎక్కడినుంచో ఊడిపడిన అధికారులు.. ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని హెచ్చరిక.. ఏం జరిగిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-11-30T14:22:37+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి సమీపంలోని..

కుమార్తెల పెళ్లి వేడుకల్లో తండ్రి.. ఎక్కడినుంచో ఊడిపడిన అధికారులు.. ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని హెచ్చరిక.. ఏం జరిగిందో తెలిస్తే..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి సమీపంలోని దతానా గ్రామంలో చోటు చేసుకున్న ఒక ఘటన వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. గ్రామంలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల వివాహం ఆగిపోయింది. వారిద్దరూ మైనర్లు కావడమే దీనికి కారణం. ఈ ఇద్దరు కవల అక్కాచెల్లెళ్ల వివాహం రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన యువకులతో జరిపించేందుకు నిశ్చయించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసుల బృందం గ్రామంలో ఈ వివాహం జరుగుతున్న ఇంటికి చేరుకుంది. వారు ఆ పెళ్లికుమార్తెల వయసు తెలుసుకుని వారిద్దరూ మైనర్లని నిర్ధారించుకున్నారు.  




ఈ సందర్భంగా పోలీసు అధికారి సబీర్ అహ్మద్ మాట్లాడుతూ తమ‌కు ఈ గ్రామంలో బాల్య వివాహం జరుగున్నట్లు ఫోను వచ్చిందని, దీంతో వెంటనే ఇక్కడికి చేరుకున్నామన్నారు. ఈ సమాచారాన్ని బాలల సంక్షేమ శాఖ అధికారులకు కూడా తెలియజేయడంతో వారు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు. గ్రామంలో ఇద్దరు బాలికలకు వివాహం జరుగుతున్నదని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. మాలవీయ కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలకు వివాహం జరుగుతున్నదని.. పెద్ద కుమార్తెకు రామ్ లాల్ మాలవీయతో చిన్నకుమార్తెకు నారాయణలాల్‌లతో వివాహం చేస్తున్నారని తెలిపారు. దీంతో అధికారులు.. ఆ బాలికల కుటుంబ సభ్యులను విచారించారు. అలాగే వారి బర్త్ సర్టిఫికెట్లు చూపించాలని కోరారు. వాటిని పరిశీలించిన అధికారులకు ఈ అక్కాచెల్లెళ్ల వయసు 18 ఏళ్ల కన్నా తక్కువగా ఉన్నదని గుర్తించారు. వెంటనే వారు బాలిక తల్లిదండ్రులను పిలిచి.. 18 ఏళ్ల లోపు వయసు పిల్లలకు చట్టప్రకారం వివాహం చేయకూడదని తెలిపారు. దీనిని ధిక్కరిస్తే రెండేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సివుంటుందని హెచ్చరించారు. అలాగే బాల్యంలోనే వివాహం చేస్తే భవిష్యత్‌లో ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో కూడా తెలియజేశారు. ఈ విషయాలను అర్థం చేసుకున్న ఆ బాలికల తండ్రి వివాహాలను నిలిపివేశారు. బాలికలకు మైనారిటీ తీరిన తరువాతనే వివాహం జరిపిస్తామని అధికారులకు తెలియజేశారు.

Updated Date - 2021-11-30T14:22:37+05:30 IST