ఈ తనయులు అభినందనీయులు

ABN , First Publish Date - 2022-05-12T16:46:31+05:30 IST

కని, పెంచి పోషించి తమ ఎదుగుదల కారణమైన తల్లిదండ్రులను సంరక్షించలేక వృద్ధాశ్రమాలకు తరలించే తనయులున్న ఈ కాలంలో నామక్కల్‌ జిల్లా రాశిపురం వద్ద

ఈ తనయులు అభినందనీయులు

                 - తల్లికి గుడి కట్టించి నిత్యం క్షీరాభిషేకం


చెన్నై: కని, పెంచి పోషించి తమ ఎదుగుదల కారణమైన తల్లిదండ్రులను సంరక్షించలేక వృద్ధాశ్రమాలకు తరలించే తనయులున్న ఈ కాలంలో నామక్కల్‌ జిల్లా రాశిపురం వద్ద అన్నదమ్ములు అమ్మ ప్రేమను ఎలుగెత్తి చాటుతున్నారు. మూడేళ్ళ క్రితం కన్నుమూసిన తల్లికి గుడి కట్టించి వారిద్దరూ రోజూ ఆమె విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. రాశిపురం సమీపం నామగిరిపేట సమీపం నావల్‌పట్టి కాట్టూరు గ్రామంలో మురుగేశన్‌, పచ్చముత్తు అనే అన్నదమ్ములు నివసిస్తున్నారు. మురుగేశన్‌ న్యాయవాది.. ఇద్దరికీ వ్యవసాయం జీవనాధారం. వీరి తల్లి అలమేలు (72)  మూడేళ్ల క్రితం మృతి చెందారు. దీంతో ఆ అన్నదమ్ములు మాతృ వియోగాన్ని భరించలేక మానసిక ప్రశాంతత కోసం గుళ్లూ గోపురాలు తిరిగారు. చివరకు ఓ రోజున వారికి ఓ ఆలోచన కలిగింది. తమను పెంచి పోషించిన తల్లికి గుడి కట్టించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తమ పొలంలోని తోటలో తల్లికి చిన్న గుడి కట్టించి తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అంతటితో ఆగలేదు, ప్రతిరోజూ ఉదయం సాయంత్రం గుడిలో తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తూ నైవేద్యాలు సమర్పించి పూజిస్తున్నారు. ఇది వారి నిత్యజీవితంలో అలవాటుగా మారింది. ఇలా తల్లి ప్రేమను చాటుకున్న ఆ అన్నదమ్ములను చూసి గ్రామస్థులంతా విస్తుపోతున్నారు.

Read more