పిల్లాడిని వదిలేసిన తండ్రి.. వెదుకులాటలో 100 మంది పోలీసులు, 65 సీసీ టీవీలలో పరిశీలన.. 45 గ్రామాల్లో విచారణ.. వెలుగు చూసిన ఘోరం

ABN , First Publish Date - 2021-10-11T15:14:51+05:30 IST

పిల్లలను చూడగానే తల్లిదండ్రులు తమ కష్టాలనన్నింటినీ...

పిల్లాడిని వదిలేసిన తండ్రి.. వెదుకులాటలో 100 మంది పోలీసులు, 65 సీసీ టీవీలలో పరిశీలన.. 45 గ్రామాల్లో విచారణ.. వెలుగు చూసిన ఘోరం

పిల్లలను చూడగానే తల్లిదండ్రులు తమ కష్టాలనన్నింటినీ మరచిపోతారు. అయితే గుజరాత్‌కు చెందిన ఒక తండ్రి తన కుమారుని విషయంలో ఎంతో కఠినంగా ప్రవర్తించాడు. ఆ పిల్లవాడిని ఒక గోశాలలో వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటన గుజరాత్‌లోని గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. గోశాల గేటు దగ్గర పిల్లాడు ఏడుస్తుండటాన్ని చూసిన గోశాల సిబ్బంది.. పోలీసులకు ఫోనుచేసి, ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, ఆ పిల్లాడి కి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. ఈ సమాచారం గుజరాత్ హోంమంత్రి హర్ష్ సింఘ్వీకి చేరింది. 


ఆ పిల్లాడి తండ్రి కోసం గాలించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు తమ గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. గాంధీనగర్ ఎస్పీ మయూర్ చావ్డా సుమారు 100 మంది పోలీసులకు ఈ పని అప్పగించారు. అలాగే గోశాల మొదలుకొని గాంధీనగర్ పట్టణంలోని 65 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఈ నేపధ్యంలో గోశాలకు సమీపంలోని ఒక కారును గుర్తించారు. దాని నంబరును ట్రేస్ చేయగా, ఆ కారు సచిన్ దీక్షిత్ పేరుతో ఉందని తేలింది. అనంతరం పోలీసులు సమీపంలోని 45 గ్రామాల్లోని ప్రజలను విచారించారు. అలాగే సచిన్ దీక్షిత్ మొబైల్ నంబరు తెలుసుకుని, దాని ఆధారంగా అతని లొకేషన్ కనుగొన్నారు.


ఇన్ని ప్రయత్నాల అనంతరం పోలీసులు 24 గంటల వ్యవధిలో సచిన్ దీక్షిత్‌ రాజస్థాన్‌లోని కోటాలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతనిని అక్కడి నుంచి గాంధీనగర్‌కు తీసుకువచ్చారు. పోలీసులు సచిన్ దీక్షిత్‌ను విచారించగా పలు ఆసక్తికర వివరాలు బయటపడ్డాయి. సచిన్ తన కుమారుడిని గోశాల గేటు దగ్గర వదిలివేశాక, అతను కోటా వెళ్లిపోయాడు. వడోదరలోని ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సచిన్ కుటుంబంలో అతని తల్లిదండ్రులు, భార్య ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. సచిన్ భార్య అనూరాధ స్వయంగా ఒక కంపెనీని నిర్వహిస్తున్నారు. అనూరాధను పోలీసులు ప్రశ్నించినపుడు తాను ఆ పిల్లవాడికి తల్లిని కాదని, ఆ పిల్లాడికి సంబంధించిన వివరాలు తనకు తెలియదని చెప్పింది. దీంతో ఆ పిల్లాడి తల్లి ఎవరనేది పోలీసుల ముందు పెద్ద సవాల్‌గా నిలిచింది.


సచిన్ ఆ పిల్లాడిని గోశాల దగ్గర ఎందుకు విడిచిపెట్టారనే దానిపై పోలీసులు సచిన్‌ను విచారించారు. మరోవైపు ఆ పిల్లాడు అనారోగ్యం పాలవడంతో పోలీసులు ఆ బాలుడిని గాంధీనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ పిల్లాడు సచిన్ ప్రియురాలు హినాకు జన్మించాడు. అప్పటి నుంచి ఆమె తనును పెళ్లి చేసుకోవాలంటూ సచిన్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో సచిన్ ఆమెను హత్య చేశాడు. తరువాత ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి పారేశాడు. తరువాత కుమారుడు శివంశ్‌ను వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఆ బాలుడిని గోశాల వద్ద వదిలేసి, సచిన్ అక్కడి నుంచి పరారయ్యాడు. సచిన్‌ను అరెస్టు చేసిన పోలీసులు శివంశ్‌ను అహ్మదాబాద్‌లోని చైల్డ్ కేర్ సెంటర్‌కు తరలించారు.



Updated Date - 2021-10-11T15:14:51+05:30 IST