రాజంపేటలో జాతిపిత

ABN , First Publish Date - 2022-08-13T04:47:12+05:30 IST

రాజంపేట పట్టణంలో 1921వ సంవత్సరం సెప్టెంబరు 28న మహాత్మాగాంధీ తొలిసారి పర్యటించారు.

రాజంపేటలో జాతిపిత
జౌళీ బజారు కూడలి ప్రాంతంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం

1921 సెప్టెంబరు 28న తొలిసారి పర్యటన  

1933 డిసెంబరు 31న రెండోసారి..

తొలిసారి జౌళీ బజారుకు రాక   

రెండోసారి యూనియన్‌ బోర్డు ఆధ్వర్యంలో సన్మానం 


స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మన దేశ స్వాతంత్య్రం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహాత్ముడిని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. దేశ స్వాతంత్య్రం కోసం దేశ పర్యటనలో భాగంగా మహాత్మాగాంధీ ఉమ్మడి కడప జిల్లా పర్యటనకు వెళుతూ రాజంపేటలో ఆగారు. ఈ సందర్భంగా ఆయనకు రెండు పర్యటనల్లోనూ రాజంపేట చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి నీరాజనాలు పలికారు. తిరుపతి నుంచి కడపకు వెళుతూ రాజంపేటకు వచ్చారు. ఆ సమయంలో చిన్న, పెద్ద, ఆడమగ అన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున ప్రజలు మహాత్ముడిని చూడటానికి తరలివచ్చారు. ఆయన రాజంపేట పట్టణంలో తొలిసారి జౌళీ బజారులో పర్యటించారు. ఆయనకు గుర్తుగా ఆ  ప్రాంతంలోని కూడలిలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 


రాజంపేట, ఆగస్టు 12: రాజంపేట పట్టణంలో 1921వ సంవత్సరం సెప్టెంబరు 28న మహాత్మాగాంధీ తొలిసారి పర్యటించారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతి నుంచి కడపకు వెళుతూ రాజంపేటకు వ చ్చారు. ఈ సందర్భంగా జౌళి వ్యాపారులు పెద్ద ఎత్తు న మహాత్మాగాంధీని సన్మానించి సన్మానపత్రా న్ని అందచేశారు. ఈ సమయంలో విదేశీ వస్తు బహిష్కరణకు మహాత్మాగాంధీ పిలుపు ఇచ్చారు. జౌళీ బజారులో వస్త్రవ్యాపారులు ఎక్కువగా ఉన్నందున ఆ ప్రాంతంలో పర్యటించి వర్తక వ్యాపారులను విదేశీ వస్తు బహిష్కరణ చేయమని పిలుపునివ్వడంతో ఒ క్కసారిగా వర్తక వ్యాపారస్తులందరూ గాంధీకి మద్ద తు ఇచ్చారు. వర్తక వ్యాపారస్తులే కాకుండా ప్రజలు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన నాటి కుటుంబాల నిర్బంధాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని స్థానిక ప్రజలు కోరగా నిర్బంధించిన కుటుంబాలకు మనమందరం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

రెండోసారి తిరుపతి నుంచి రైలులో కడపకు వెళుతూ 1933, డిసెంబరు 31వ తేదీ రాజంపేటలో ఆగారు. ఈ సందర్భంగా రాజంపేట రైల్వేస్టేషన్‌లో వేలాది మంది ప్రజలు మహాత్మాగాంధీకి పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికి భారీ ఎత్తున పూలమాలలతో సన్మానించారు. రాజంపేటకు చెందిన స్వాతంత్య్ర సంగ్రామం యూనియన్‌ బోర్డు ఉపాధ్యక్షుడు సుబ్బరాయశెట్టి ఆధ్వర్యంలో సన్మానించారు. ఆనాటి ఉద్యమాల్లో అనేక ఇబ్బందులు పడుతున్న హరిజన వర్గాన్ని కాపాడటానికి రాజంపేటలో పెద్ద ఎత్తున గాంధీజీకి విరాళాలు కూడా ఇచ్చారు. స్వరాజ్య ఉద్యమానికి మద్దతు పలుకుతూ రాజంపేట ప్రజలు పూర్తిగా సంఘీభావం తెలుపుతూ మహాత్ముడి వెంట నిలిచారు. ఈ విధంగా రెండుసార్లు గాంధీ రాజంపేటలో పర్యటించి స్వాతంత్య్ర ఉద్యమంలో స్థానిక ప్రజలతో మమేకం కావడం దృష్ట్యా ఆయన గుర్తింపుగా జౌళీబజారు కూడలి ప్రాంతంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి ప్రజా పోరాట కార్యక్రమానికి ఇక్కడి నుంచే నాంది పలుకుతున్నారు. 



Updated Date - 2022-08-13T04:47:12+05:30 IST