స్కూల్‌కు వెళ్లిన కూతురు తిరిగి ఇంటికి రాలేదు.. 20ఏళ్లకు కారణం తెలుసుకున్న తండ్రి!

ABN , First Publish Date - 2020-06-07T01:08:36+05:30 IST

తండ్రి పుట్టిన రోజు వేడుల్లో 13ఏళ్ల మెగుమి.. అల్లరి చేసి, అతిథులకు ఆనందం పంచింది. తండ్రికి చిరు కానుక ఇచ్చి ఆశ్చర్యప

స్కూల్‌కు వెళ్లిన కూతురు తిరిగి ఇంటికి రాలేదు.. 20ఏళ్లకు కారణం తెలుసుకున్న తండ్రి!

టోక్యో: తండ్రి పుట్టిన రోజు వేడుకల్లో 13ఏళ్ల మెగుమి.. అల్లరి చేసి, అతిథులకు ఆనందం పంచింది. తండ్రికి చిరు కానుక ఇచ్చి ఆశ్చర్యపర్చింది. మరునాడు స్కూల్‌కు వెళ్లొస్తానంటూ ఇంటి నుంచి బయల్దేరిన మెగుమి తిరిగి రాలేదు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి.. ఆ తండ్రికి 20ఏళ్లు పట్టింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురును కలుసుకునేందుకు దశాబ్దాలపాటు పోరాటం చేశాడు. చివరికి కన్నకూతురును చూడకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమించిన ఘటన జపాన్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


షిగేరు యోకోటా.. జపాన్ సెంట్రల్ బ్యాంక్ మాజీ ఉద్యోగి. 1977లో ఆయన వయసు 45ఏళ్లు. 45వ పుట్టిన రోజు వేడుకలను షిగేరు యోకోటా.. తన కూతురు మెగుమితో కలిసి అంగరంగవైభవంగా  చేసుకున్నారు. అప్పుడు బర్త్‌డే కానుకగా మెగుమి ఇచ్చిన దువ్వెనను చూసి షిగేరు యోకోటా మురిసిపోయారు. అయితే మరుసటి రోజు స్కూల్ వెళ్లొస్తానంటూ ఇంటి నుంచి బయల్దేరిన మెగుమి.. తిరిగి రాకపోయేసరికి షిగేరు యోకోటా షాక్ అయ్యాడు. కూతిరి జాడ తెలియక.. షిగేరు దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ నేపథ్యంలో అసలు తన కూతురుకు ఏం జరిగిందో తెలుసుకోనేందుకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. కూతురు ఫొటోను పట్టుకుని జపాన్ మొత్తం తిరిగారు. ఈ క్రమంలోనే.. 1970 నుంచి జపాన్‌లో పదుల సంఖ్యలో అమ్మాయిలు మిస్ అయ్యారని ఆయన గుర్తించారు.


తమ కూతురుకి ఏం జరిగిందో తెలియక బాధపడుతున్న తనలాంటి తండ్రులకు ఆయన నాయకత్వం వహించారు. తన కూతరుతోపాటు ఇతర అమ్మాయిల జాడను కనిపెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో దాదాపు 20 ఏళ్లకు తన కూతురు లాంటి చాలా మంది అమ్మాయిలను ఉత్తర కొరియా ఏజెంట్లు అపహరించారని కనుక్కున్నారు. దీంతో తన కూతురు సహా ఇతర అమ్మాయిలను నార్త్ కొరియా నుంచి రప్పించేలా చర్యలు తీసుకోవాలని జపాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జపాన్ ప్రభుత్వం.. నార్త్ కొరియాతో సంప్రదింపులు జరిపింది. అయితే మొదట్లో తప్పును అంగీకరించని నార్త్ కొరియా.. జపాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. జపాన్ ప్రభుత్వం తన ప్రయత్నాన్ని విరమించకపోవడంతో చివరికి నార్త్ కొరియా తప్పు ఒప్పుకొంది. అయితే షిగేరు యోకోటా కూతురు సహా మరికొందరు అమ్మాయిలు మరణించినట్లు నార్త్ కొరియా వెల్లడించింది.


అంతేకాకుండా వారికి సంబంధించిన అవశేషాలను పంపింది. అయితే నార్త్ కొరియా పంపిన అవశేషాలకు జపాన్.. డీఎన్ఏ పరీక్షలు చేసింది. నార్త్ కొరియా పంపిన అవశేషాలు షిగేరు యోకోటా కూతురుకు సంబంధించినవి కాదని జపాన్ తేల్చి చెప్పింది. దీంతో షిగేరు యోకోటా దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. తమ కూతురును తిరిగి కలుస్తామనే ఆశలు మళ్లీ వారిలో చిగురించాయి. ఈ క్రమంలో షిగేరు యోకోటా‌కు వయసు మీద పడింది. అనారోగ్యం పాలయ్యారు. గత నాలుగు సంవత్సరాల్లో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో కన్న కూతురుని తిరిగి కలుసుకోకుండానే శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. కూతురు కోసం దశాబ్దాలపాటు సుదీర్ఘ పోరాటం చేసిన షిగేరు యోకోటా మరణంపై జపాన్ ప్రధాని షింజో అబే స్పందించారు. ‘మెగుమిను జపాన్ రప్పించలేకపోయినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అపహరణకు గురైన ప్రతి అమ్మాయిని.. వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2020-06-07T01:08:36+05:30 IST