తనయుడి చేతిలో తండ్రి హతం

ABN , First Publish Date - 2021-06-24T05:40:30+05:30 IST

కన్న తండ్రినే కొడుకు హతమార్చిన ఘటన మంగళవారం రాత్రి స్థానిక ఏటీ అగ్రహారం మూడో లైనులో చోటు చేసుకుంది.

తనయుడి చేతిలో తండ్రి హతం
మృతుడు ఆనందరామం

గుంటూరు, జూన్‌ 23: కన్న తండ్రినే కొడుకు హతమార్చిన ఘటన మంగళవారం రాత్రి స్థానిక ఏటీ అగ్రహారం మూడో లైనులో  చోటు చేసుకుంది.  నగరంపాలెం సీఐ రత్నస్వామి, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రామనామక్షేత్రానికి చెందిన పిళ్లలమర్రి ఆనందరామం అలియాస్‌ ఆనందరావు(73)  కుమారుడు వంశీమోహన్‌ ఏటీ అగ్రహారం 3వ లైనుకు చెందిన గాయత్రిని 2006లో వివాహం చేసుకున్నాడు. ఇల్లరికం వచ్చి ఏటీ అగ్రహారంలో మామ ఇంట్లోనే కాపురం ఉంటున్నాడు. మామ వంశీమోహన్‌ పౌరోహిత్యం చేసుకుంటూ, జ్యోతిష్యం చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు. వంశీమోహన్‌  కొద్ది సంవత్సరాల క్రితం గౌరి అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఓ పాప ఉంది. కొన్ని రోజుల కిందట వంశీమోహన్‌ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఆ తర్వాత నుంచి రెండో భార్య గౌరి కనిపించలేదు. అయితే తాను ఆస్పత్రిలో ఉన్న సమయంలో తన తండ్రే గౌరీని తనకు దూరం చేయాలనే ఉద్దేశంతో దాచి ఉంటాడని అనుమానించాడు. ఈ క్రమంలో రామనామక్షేత్రంలో ఉన్న తన తండ్రిని ఏటీ అగ్రహారంలోని ఇంటికి పిలిపించుకున్నాడు. మంగళవారం రాత్రి ఇంటిపైన ఉన్న గదిలోకి తీసుకెళ్లి గౌరీ ఆచూకీ చెప్పాలంటూ కర్రతో విచక్షణా రహితంగా కొట్టాడు. తీవ్రగాయాలై ఆనందరామం కన్నుమూశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 

కాగా.. తండ్రి హత్యను సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు నిందితుడు వంశీమోహన్‌ ప్రయత్నించాడు. కరోనా సమయంలో అనాధ మృతదేహాలను ఖననం చేస్తున్న రుద్ర చారిటబుల్‌ సంస్థను సంప్రదించి తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడని, తన భార్య గర్భంతో ఉందని అందువలన తాను అంత్యక్రియలు చేయకూడదని నమ్మబలికాడు. మృతదేహాన్ని వస్త్రంలో చుట్టి మంగళవారం రాత్రి రుద్ర సంస్థకు అప్పగించాడు. అయితే వారు మృతదేహాన్ని ఐస్‌ బాక్సులో పెట్టారు. బుధవారం ఉదయం పరిశీలించగా వంటిపై గాయాలు కనిపించాయి. ఇంతలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా నగరంపాలెం సీఐ రత్నస్వామి మృతదేహాన్ని పరిశీలించగా ఒంటిపై గాయాలు కనిపించాయి. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిందితుడు వంశీమోహన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండో భార్య గౌరి గతంలో లక్ష్మీపురంలో ఉండేదని, ఇటీవల బ్రాడీపేటకు మకాం మార్చిందని పోలీసులు తెలిసింది.  

Updated Date - 2021-06-24T05:40:30+05:30 IST