ఎలా ఉన్నారో..! తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఆందోళన

ABN , First Publish Date - 2020-08-09T08:37:30+05:30 IST

వయస్సు మీద పడిన తర్వాత తమ తల్లిదండ్రులు సరిగా వ్యాయామాలు చేయడం లేదని...

ఎలా ఉన్నారో..! తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఆందోళన

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): వయస్సు మీద పడిన తర్వాత తమ తల్లిదండ్రులు సరిగా వ్యాయామాలు చేయడం లేదని, నిజానికి వారి ఆరోగ్యం విషయంలో తాము పడుతున్న ఆందోళనలో కొద్దిపాటి శ్రద్ధ కూడా తల్లిదండ్రులు పెట్టడం లేదని చాలా మంది పిల్లలు భావిస్తున్నారు. ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏబీహెచ్‌ఐసీఎల్‌) ఇండియన్‌ పేరెంటల్‌ కేర్‌ సర్వే పేరిట ఓ అధ్యయనంలో మిగిలిన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో అత్యధికంగా 57 శాతం మంది తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థితిగతులపై ఆందోళన చెందుతున్నారని తెలిసింది. దేశవ్యాప్తంగా 32 శాతం మంది తమ ఆర్థికావసరాలపై నియంత్రణ ఉందంటుంటే, హైదరాబాద్‌లో 42 శాతం మంది అత్యవసర సమయాల్లో బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారిపై ఆధారపడుతున్నామని చెబుతున్నారు. తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి పేరెంట్స్‌ తగినంత శ్రద్ధ చూపడం లేదని 60 శా తం మంది యువతరం భావిస్తోంది. హైదరాబాద్‌లో దాదాపు 47 శాతం మంది తమ పిల్లల నుంచి ఎలాంటి మద్దతునూ ఆశించడం లేదనే అంటున్నారు. వైద్యపరంగా అత్యవసర సమయాల్లో ఎన్‌జీవోలను ఆశ్రయించడానికే మొగ్గు చూపుతున్నామని హైదరాబాద్‌లోని 36శాతం మంది తల్లిదండ్రులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కేవలం ఆరు శాతం మాత్రమే ఈ తరహాలో ఎన్‌జీవోల వైపు చూస్తున్నామని చెబుతుండటం గమనార్హం.

వరుసగా రెండు రోజులు పిల్లల దగ్గర నుంచి ఎలాంటి సమాచారమూ లేకపోతే ఆందోళనగా ఉంటుందని 85 శాతం మంది తల్లిదండ్రులు  అంటున్నారు. 86 శాతం మంది పిల్లలు తమ తల్లిదండ్రులు ఆరోగ్యం గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నామంటున్నారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి సరైన సమాచారం లేకపోతే పక్కింటి వారిని, దగ్గర బంధువులను ఒకసారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల క్షేమ సమాచారం తెలుపాల్సిందిగా కోరుతున్నామని 65 శాతం మంది చెబుతున్నారు.

Updated Date - 2020-08-09T08:37:30+05:30 IST