ఇంటర్నెట్ డెస్క్: కన్న తండ్రి పేల్చిన తూటాకు ఓ టీనేజ్ బాలిక అకారణంగా బలైపోయింది. ఇంట్లోకి దొంగ చొరబడ్డాడని భ్రమించిన ఓ వ్యక్తి తన కూతురిపైనే కాల్పులు జరపడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. బాధితురాలిని జేనే హారిసన్‌గా పోలీసులు గుర్తించారు. బుధవారం తెల్లవార్జామున ఒహాయో రాష్ట్రంలోని కొలంబస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల శబ్దం విన్న వెంటనే బాలిక తల్లి పోలీసులకు సమాచారం అందించింది. వీలైనంత త్వరగా రావాలంటూ వారిని వేడుకుంది. సమాచారం అందిన ఐదు నిమిషాల్లోపలే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ బాలిక ప్రాణాన్ని మాత్రం కాపాడలేకపోయారు. తాము వెళ్లే సరికి తల్లిదండ్రులిద్దరూ బాలికను కళ్లు తెరవమంటూ వేడుకుంటున్న దృశ్యం కనిపించిందని వారు తెలిపారు. కాగా.. ఈ దారుణం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన సమాచారం ఉన్నవారెవరైనా ముందుకు రావాలని స్థానికులను కోరారు.
ఇవి కూడా చదవండి