గుర్తుతెలియని వాహనం ఢీకొని తండ్రి మృతి

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

గుర్తుతెలియని వాహనం ఢీకొని తండ్రి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని తండ్రి మృతి

  • తల్లీకుమారుడికి తీవ్రగాయాలు
  • పొలంలో పత్తిగింజలు విత్తి తిరిగొస్తుండగా ఘటన

కొడంగల్‌ రూరల్‌, జూలై 3 : భార్యాభర్తలు పంట పొలంలో పత్తి విత్తనాలు విత్తేందుకు కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్లి.. తిరిగి ఇంటికొస్తుండగా గుర్తుతెలియని వాహనం వెనక నుంచి బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కొడంగల్‌ ఎస్సై రవి తెలిపిన వివరాల మేరకు.. దౌల్తాబాద్‌ మండలం నీటూర్‌ గ్రామానికి చెందిన చిట్లపల్లి శ్రీనివాస్‌ కొడంగల్‌ మండలం అంగడిరైచూర్‌ గేటు సమీపంలో గల తన పొలంలో పత్తి విత్తనాలు విత్తేందుకు భార్య, కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్లారు. పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈక్రమంలో హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేలో అంగడిరైచూర్‌ గేటు సమీపంలో వెనక నుంచి వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో శ్రీనివాస్‌(43) అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య మల్లమ్మ, కుమారుడు మల్లికార్జున్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించి మల్లమ్మ, మల్లికార్జున్‌ను కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తాండూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి చిన్నాన్న కుమారుడు ఆశప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2022-07-03T05:30:00+05:30 IST