కుమారుడిని అమెరికా పంపామన్న ఆనందం గంట గడవక ముందే ఆవిరి..

ABN , First Publish Date - 2022-01-28T05:34:09+05:30 IST

మండలంలోని జాగర్లమూడివారిపాలెం గ్రామం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిలకలూరిపేటకు చెందిన తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. గురువారం తెల్లవారుజామున 5గంటల సమయంలో జేవీపాలెం ఫ్లైఓవర్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ యు.పున్నారావు సమాచారం మేరకు.. చిలకలూరిపేటలోని సాంబశివరావునగర్‌కు చెందిన చోడ వెంకటరావు, కళావతి దంపతులకు ఇరువురు కుమారులు. కిరాణా వ్యాపారం చేసుకుని జీవనం సాగించే వెంకటరావు కుమారులను ఉన్నత చదువులు చదివించాడు.

కుమారుడిని అమెరికా పంపామన్న ఆనందం గంట గడవక ముందే ఆవిరి..
జాగర్లమూడివారిపాలెం వద్ద కట్టెలలోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ను ఢీకొన్న ఇన్నోవా కారు

జేవీపాలెం ఫ్లైఓవర్‌పై ఘటన

ప్రకాశం/పంగులూరు: మండలంలోని జాగర్లమూడివారిపాలెం గ్రామం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిలకలూరిపేటకు చెందిన తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. గురువారం తెల్లవారుజామున 5గంటల సమయంలో జేవీపాలెం ఫ్లైఓవర్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ యు.పున్నారావు సమాచారం మేరకు.. చిలకలూరిపేటలోని సాంబశివరావునగర్‌కు చెందిన చోడ వెంకటరావు, కళావతి దంపతులకు ఇరువురు కుమారులు. కిరాణా వ్యాపారం చేసుకుని జీవనం సాగించే వెంకటరావు కుమారులను ఉన్నత చదువులు చదివించాడు. పెద్ద కుమారుడు ప్రసన్నకుమార్‌ బీటెక్‌ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా వర్క్‌టు హోంలో పనిచేస్తున్నాడు. రెండవ కుమారుడు భాస్కరరావు ఇటీవల బీటెక్‌ పూర్తిచేశాడు.


ఎంఎస్‌ కోసం అమెరికా పంపేందుకు బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భార్య కళావతి, ప్రసన్నకుమార్‌లతో కలిసి వెంకటరావు కారులో చెన్నై బయలుదేరి వెళ్లారు. చిన్న కుమారుడిని ఫ్లైట్‌ ఎక్కించిన అనంతరం రాత్రి ఒంటి గంటకు వెంకట్రావు తన కుటుంబసభ్యులతో కలిసి పేటకు తిరుగు ప్రయాణమయ్యారు. గురువారం తెల్లవారుజాము 5గంటల సమయంలో జాగర్లమూడివారిపాలెం ఫ్లైఓవర్‌పై అద్దంకి మండలం చక్రాయిపాలెంకు చెందిన ట్రాక్టర్‌ సరుగుడు కట్టెల లోడుతో ముప్పవరం వైపు వెళుతుండగా కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటరావు (55), పెద్ద కుమారుడు ప్రసన్నకుమార్‌ (22) ప్రాణాలు కోల్పోయారు. వెంకటరావు భార్య కళావతి, డ్రైవర్‌ దామర్ల విజయ్‌లు ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. కారుడ్రైవర్‌ అతివేగం, ట్రాక్టర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.




సమాచారం అందిన వెంటనే ఎస్‌ఐ పున్నారావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్‌ సాయంతో మృత దేహాలను కారు నుంచి బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. ఘటనా స్థలి వద్ద బంధుమిత్రుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.


అంతలోనే ఆనందం ఆవిరి..

ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతిచెందడం బంధువులను కలచివేసింది. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తూ లక్షా ఏభైవేల వేతనం అందుకుంటున్న పెద్దకుమారుడికి పెళ్లి చేసే ప్రయత్నంలో ఉన్న సంతోషం, ఉన్నత చదువు కోసం చిన్నకుమారుడుని అమెరికా పంపామన్న ఆనందం కొన్ని గంటలు గడవక ముందే ఆవిరైపోయింది. భర్త, కుమారుడు అస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బంధుమిత్రులు కళావతికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 

Updated Date - 2022-01-28T05:34:09+05:30 IST