Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉపవాసం... సునాయాసం!

ఉపవాసం అనగానే అమ్మో... నీరసం అనిపిస్తుంది. కానీ, ఉపవాసంతో నీరసం బదులు కొత్త జీవశక్తి అందుతుంది. ప్రయత్నించి చూస్తే మనకే తెలుస్తుంది.


ఉపవాస ఆచారం పరమార్థం ఆరోగ్యమే! అయితే ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసంలో పాటించే పద్ధతులు ఏవి? ఉపవాస సమయంలో ఏం తీసుకోవాలి? అనే విషయాల పట్ల అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. నిజానికి ఉపవాసం ఉద్దేశం అర్థం చేసుకోగలిగితే, ఆచరించడం తేలికవుతుంది. మూడు పూటలా భోజనం చేసి నీళ్లు తాగితే, ఆ నీళ్లు జీర్ణక్రియకే సరిపోతాయి. కానీ మలమూత్రాల ద్వారా శరీరంలో నిల్వ ఉన్న చెడును శుద్ధి చేయాలంటే, రోజుకు కనీసం 5 నుంచి 6 లీటర్ల నీరు తాగాలి. శరీర మాలిన్యం పలు రకాల రోగాలకు కారణమవుతుంది. రోగాలు, వాటి లక్షణాలు వేరైనా, వాటన్నింటికీ కారణమైన రోగ పదార్థం ఒక్కటే అయినప్పుడు, చికిత్స కూడా ఒకటే కావాలి కదా! ఆ ఒక్కటే ఉపవాస చికిత్స. ఈ విధానంలో మనలో నిల్వ ఉన్న వ్యర్థపదార్థాలను తొలగించడంతో పాటు, నాలుగు విసర్జకావయవాలను పూర్తిగా శుద్ధి చేయడం జరుగుతుంది. దాని ఫలితంగానే రోగాలు తగ్గుతాయి. రోగాలు దీర్ఘకాలిక రోగాలుగా మారే అవకాశం తగ్గుతుంది. 


నీరు పరమౌషధం

ఉపవాసంలో శరీరంలోని వ్యర్ధమంతా బయటకు వెళ్లాలంటే, రోజుకు 5 నుంచి, 6 లీటర్ల నీళ్లు విధిగా తాగాలి. ఉపవాసంలో పదార్థాలేవీ తీసుకోకపోయినా, 5 లీటర్ల నీరు తాగాల్సిందే! అందుకోసం ఉదయం పరగడుపున ఒక లీటరు నీళ్లు, ఆ తర్వాత ప్రతి రెండు గంటలకు ఒకసారి, రెండు పెద్ద గ్లాసుల చొప్పున 8 సార్లు తాగాలి. ఉపవాసంలో నీరు తక్కువగా తాగిన వారిలో నిల్వ ఉన్న వ్యర్థపదార్థాలు నానవు. బయటకు వెళ్లవు. అయితే తాగునీరు విషయంలో ఈ సూచనలు పాటించాలి...


ఫ్రిజ్‌లోని చల్లని నీరు ఉపవాసంలో అసలే తాగకూడదు. 

శరీరం బాగా నీరు పట్టి ఉందన్న కారణంగా నీరు తగ్గించడం పొరపాటే! మనం నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే, లోపల నిల్వ ఉన్న ఉప్పునీరు అంతగా బయటకు వస్తుంది. 

రక్తపోటు తక్కువగా ఉండి ఉపవాసం ప్రారంభించే వారు, నియమానుసారం రోజు మొత్తంలో 5 లీటర్ల నీళ్లు తీసుకుంటేనే బి.పి తగ్గిపోయి, నీరసం వచ్చే ప్రమాదం ఉండదు. నీళ్లు తగ్గితేనే బి.పి తగ్గే ప్రమాదం ఉంది. 

రోజు మొత్తంలో 250 గ్రాముల తేనె తాగుతారు కాబట్టి, శరీరంలో వేడి ఉత్పన్నం అవుతుంది. ఈ స్జితిలో నీరు సరిపడా తాగకపోతే మూత్రం సాఫీగా రాదు. ఏ రకంగా చూసినా ఉపవాసంలో 5 లీటర్లకు తగ్గకుండా నీళ్లు తీసుకోవడం తప్పనిసరి. నిమ్మరసంతో ఆకలి మాయం...

ఆహారంపై ధ్యాసను పోగొట్టే గుణం నిమ్మరసానికి ఉంది. అందుకే తేనె నిమ్మరసం తాగిన తర్వాత, ఏమీ తినాలనిపించదు. ప్రతి రెండు గంటలకు ఒకసారి నిమ్మరసాన్ని తేనెలో కలిపి తాగడం వల్ల, ఆహారం వైపు మనసు మళ్లకుండా రోజంతా హాయిగా ఉపవాసాన్ని కొనసాగించవచ్చు.

ఉపవాసంలో కాలేయం నుంచి ఎక్కువ పైత్యరసం రాకుండా నిమ్మరసం నిరోధిస్తుంది. ఈ కారణంగా త్రేన్పులు రావు. 

పేగుల్లో ఉండే హానికారక బ్యాక్టీరియా, పెద్దపేగుల్లో ఉండే నులిపురుగుల వంటి వాటిని నశింపచేయడంలో నిమ్మరసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. తేనె చేసే మేలు

ఉపవాసంలో తేనె ఒక వైపు శక్తినిస్తూనే, మరో వైపు విసర్జన క్రియకు తోడ్పడుతుంది. 

ఉపవాసంలో రక్తంలోని చక్కెర శాతం తగ్గిపోతుందనేది వాస్తవం. అయితే, గుండె రక్తనాళాల చురుకుదనం పెంచడానికి తేనెలోని గ్లూకోజు చక్కగా పనిచేస్తుంది. 

అల్సర్‌తో బాధపడే వారు తేనెతో ఉపవాసం చేస్తే, అల్సర్లు పూర్తిగా తగ్గిపోతాయి. కడుపులో మంటలు ఉన్నా ఉపవాసం చేయడం తేలికే!

మధుమేహం ఉన్న వారు కూడా తేనెతో ఉపవాసం చేయడం తేలికే కాదు. క్షేమం కూడా! ఎందుకంటే తేనెలో ఉండే షుగరు ఒకేసారి పెరగకుండా కొంచెం కొంచెంగా శక్తినిస్తుంది.


ఏది ఉత్తమం?

నిర్జలోపవాసం, జలోపవాసం, రసోపవాసం, ఫలోపవాసం అంటూ....ఉపవాసం ప్రధానంగా నాలుగు రకాలు. ఈ నాలుగు రకాల ఉపవాసాలు శరీరాన్ని శుద్ధి చేయడంలో వేర్వేరు ఫలితాలు అందిస్తుంటాయి. శరీర ధర్మాన్ని బట్టి, శారీరక సమస్యను బట్టి ఏ రకమైన ఉపవాసం శ్రేయస్కరమనేది తెలుసుకోవాలి.


ఏమీ ముట్టకుండా...

పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా చేసే ఉపవాసాన్ని నిర్జలోపవాసం అంటారు. కానీ శరీర అవసరాల్లో గాలి తర్వాతి స్థానం నీటిదే! కాబట్టి నీళ్లు తాగకుండా చేసే ఉపవాసాల వల్ల శరీరానికి మేలు కన్నా కీడే ఎక్కువ. నిల్వ ఉన్న అవాంఛితమైన నీరు లేదా ఉప్పు బయటకు పోవాలంటే ప్రతిరోజూ నీళ్లు తాగాల్సిందే! అందువల్ల నిర్జలోపవాసం మన ఆరోగ్యానికి ఏ విధంగానూ ఉపయోగపడదు. అయితే కొందరు వ్రతాలు, దీక్షల పేర్లతో లేదా బరువు తగ్గడం కోసం నీళ్లు ముట్టకుండా ఉపవాసం ఉంటారు. నిర్జలోపవాసం అనేది ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా ప్రయోజనకరం కాదనేది వాస్తవం.


నీళ్లు మాత్రమే తాగుతూ...

నీళ్లు మాత్రమే తాగి చేసే ఉపవాసాలను జలోపవాసాలు అంటారు. ఈ ఉపవాసాల్లో కొందరు గోరువెచ్చని నీళ్లు లేదా కుండలో నీరు తాగితే, మరికొందరు నీళ్లలో ప్రతిసారీ నిమ్మరసం కలుపుకొని తాగుతారు. నిమ్మరసంతో చేసే ఉపవాసంతో శరీరానికి విశ్రాంతి లభించే మాట నిజమే అయినా ఉపవాసంలో కూడా శక్తి పుంజుకోవాలం టే, కొంత గ్లూకోజ్‌ కూడా శరీరానికి అందించాలి. అందుకోసం ఉదయం నుంచీ రాత్రి వరకూ 8 సార్లు, ఒక నిమ్మకాయ రసానికి నాలుగు చెంచాల తేనె కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళతాయి.


ద్రవాలతో సరిపెడితే...

పండ్ల రసాలు తీసుకుంటూ చేసే ఉపవాసాలను రసోపవాసాలు అంటారు. ఈ రసోపవాసంలో నారింజ , బత్తాయి, కమలా పండ్ల రసం, కొబ్బరి నీళ్లు, బార్లీ నీరు వంటివి రోజుకు మూడు నుంచి ఐదు సార్లు వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రకృతి ఆశ్రమాల్లో ఇస్తూ ఉంటారు. ఉపవాసాలు చేయలేని వారికే ఈ రసోపవాసాలనేది ఒక అభిప్రాయం. నిజానికి నిమ్మరసం, తేనె తీసుకున్నా కూడా ఉపవాసం చేసినట్టే లెక్క.


పండ్లు తింటూ..

ఫలాలు తింటూ చేసే ఉపవాసాలను ఫలోపవాసాలు అంటారు. రసాలతో కూడిన అన్ని రకాల పండ్లను ఈ ఉపవాసంలో తినిపించడం జరుగుతుంది. ఫలోపవాసం ఎన్ని రోజులు చేస్తే అంత రక్తశుద్ధి జరుగుతుంది. అంత ఆకలి కూడా పెరుగుతుంది. విటమిన్లు, లవణాల లోపంతో తలెత్తే వ్యాధులు తగ్గడం సులువవుతుంది. 


ఎనిమా ఎందుకంటే?

కొత్త నీరు వచ్చి, పాత నీటిని నెట్టివేయడంలా ఈ  ప్రక్రియ ఉంటుంది. అయితే ఉపవాసం ప్రారంభించినప్పటి నుంచి శరీరంలో పేరుకుని ఉన్న వ్యర్ధం ముందుకు కదలదు. అందువల్ల ఉపవాసంలో ప్రతిరోజూ ఎనిమా తీసుకోవాలి. ఎనిమా వల్ల వ్యర్ధంతో పాటు, శరీరంలోని చెడు అంతా బయటకు వెళుతుంది. తద్వారా శరీరంలోని అణువణువుకూ ప్రాణశక్తి చేరే మార్గం సుగమం అవుతుంది.


ఇవి గుర్తుంచుకోండి!

అన్ని వయసుల వాళ్లూ ఉపవాసం చేయవచ్చు. అయితే ఎన్ని రోజులు అనేది, శరీరంలో ఎంత చెడు పేరుకుపోయి ఉంది? అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది.

శరీరానికి ఎక్కువ శ్రమ కలిగించేవి కాకుండా ద్రవపదార్థాలు తీసుకోవడం మేలు. తేనె, నీళ్లు, కొబ్బరి నీళ్లు, పలుచని మజ్జిగ, చెరుకు రసం తాగుతూ ఉపవాసాన్ని విరమించవచ్చు. 

వివిధ రుగ్మతలకు మందులు వాడుతున్న వాళ్లు, ప్రకృతి వైద్య నిపుణులను సంప్రతించి సలహాలూ, సూచనలూ తీసుకోవాలి. 

ఉపవాసం ఎన్ని రోజులు చేయాలనేది శరీర ధర్మాన్ని బట్టి, వారికున్న జబ్బులను బట్టి, వైద్యుల సలహాతో నిర్ణయించుకోవాలి.


ఆకాశతత్వం!

సృష్టి అంతా ఉన్నది ఆకాశంలోనే! మన శరీరంలో కూడా ఆకాశమనే ఖాళీ ఉంటుంది. దీన్నే ఆకాశతత్వం అంటాం. నిజానికి, శరీరంలో ఆకాశాన్ని వృద్ధి చేయడం అనేదే ఆరోగ్యానికి తొలిమెట్టు. మరో రకంగా చెప్పాలంటే, శరీరంలో ఉన్న సహజమైన ఆకాశాన్ని లేదా ఖాళీని అక్రమించిన చెడు పదార్థాలను తొలగించడమే ఉపవాసం. ఆహారమేదీ తీసుకోకపోవడం వల్ల ఉపవాసంలో శరీరంలోకి కొత్తగా చేరే పదార్థాలు గానీ, వ్యర్థపదార్థాలు గానీ ఏమీ ఉండవు. పైగా, అప్పటికే శరీరంలో నిల్వ ఉన్న చెడు పదార్థం అంతా ఉపవాసంలో కదిలి వెళ్లిపోతుంది. ఉపవాసం అంటే ప్రకృతికి దగ్గరకావడమే! ఆకాశతత్వాన్ని పెంచుకోవడమే! ఉపవాస విధానంలో ఆహారం ఇవ్వరు కాబట్టి, కొత్తగా వ్యర్థం తయారయ్యే అవకాశం అసలే ఉండదు. అంటే శరీరంలో కొత్తగా చెడు తయారు కాకుండా ఆపి, మొదటి రోజు నుంచీ నిల్వ ఉండిపోయిన వ్యర్ధాన్ని ఎనిమా ద్వారా కడిగివేస్తూ ఉంటారు.


- డాక్టర్‌ టి. కృష్ణమూర్తి, సూపరింటెండెంట్‌

రెడ్‌క్రాస్‌ యోగా అండ్‌ నేచర్‌ క్యూర్‌ సెంటర్‌,

జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌ 

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement