వడి వడిగా... కలివిడిగా...

ABN , First Publish Date - 2021-04-13T06:35:02+05:30 IST

అడుగుమోపింది మొదలు అడుగడుగునా జెట్‌ స్పీడ్‌... అది శంకుస్థాపన అయినా, ప్రారంభోత్సవం అయినా తనదైన శైలిలో ప్రజలతో మమేకం.. అధికార, అనధికారగణం వెంటరాగా అలుపన్నదే లేకుండా పయనం... రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటన తీరు ఇది.

వడి వడిగా... కలివిడిగా...
ఖిలా వరంగల్‌ సభలో మాట్లాడుతున్న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు

జెట్‌ స్పీడ్‌తో సాగిన మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ నగర పర్యటన
రూ.2177 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
వెంటవచ్చిన అధికార, అనధికార ప్రముఖులు
ప్రత్యేక బస్సులో సాగిన సిటీ టూర్‌
అడుగడుగునా ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
అవకాశం దొరికకికిన చోటల్లా ప్రజలతో మమేకం అయిన మంత్రి
భద్రకాళి బండ్‌ బాగుందంటూ కితాబు


హన్మకొండ, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) : అడుగుమోపింది మొదలు అడుగడుగునా జెట్‌ స్పీడ్‌...  అది శంకుస్థాపన అయినా, ప్రారంభోత్సవం అయినా తనదైన శైలిలో ప్రజలతో మమేకం.. అధికార, అనధికారగణం వెంటరాగా అలుపన్నదే లేకుండా పయనం... రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటన  తీరు ఇది.  సోమవారం వరంగల్‌ నగరంలో ఆయన టూరు ఆద్యంతం సందడిగా సాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన వివిధ కార్యక్రమాల్లో బిజీ బిజీగా పాల్గొన్నారు. రూ.2,177కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రెండుచోట్ల జరిగిన బహిరంగసభల్లో విపక్షాల తీరును తనదైన శైలిలో తీవ్రంగా ఎండగట్టారు.

ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు..
ఉదయం 10 గంటలకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట మండలం రాంపూర్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్‌ తొలుత రాంపూర్‌లో రూ.1560కోట్లతో చేపట్టిన అమృత్‌, అర్బన్‌ మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా నిర్మించిన ఓవర్‌హెడ్‌ట్యాంక్‌ను ప్రారంభించారు. దేశాయిపేట, దూపకుంటలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, ఎల్‌బీనగర్‌లో షాదీఖానా, మండిబజార్‌లో హజ్‌హౌస్‌ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. లక్ష్మీపూర్‌లో పండ్ల మార్కెట్‌ను ప్రారంభించారు. సమీకృత మార్కెట్‌కు, దుకాణాల సముదాయానికి శంకుస్థాపనలు, ఎస్‌ఆర్‌ నగర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయానికి ప్రారంభోత్సవం చేశారు. గరీబ్‌నగర్‌లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
సీకేఎం కాలేజీ నుంచి లేబర్‌కాలనీ వరకు రోడ్డుకు, సీబీసీ చర్చికు పునాది రాళ్లు వేశారు. శివనగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌లో వరదనీటి  కాల్వలకు, శివనగర్‌లో రోడ్డుకు శిలాఫలకాలు వేశారు. బట్టలబజార్‌ ఆర్‌వోబీని, ఆర్‌యూబీని ప్రారంభించారు. కరీమాబాద్‌లో రోడ్డుకు, రంగశాయిపేటలో సమీకృత మార్కెట్‌కు, ఖిలా వరంగల్‌ జంక్షన్‌లో రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. తిమ్మాపూర్‌ క్రాస్‌ రోడ్డులో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు పునాది రాయి వేశారు. తిమ్మాపూర్‌ జంక్షన్‌ -బొల్లికుంట రెండు లైన్ల రో డ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు పునాది రాయి వేశా రు. సమ్మయ్య నగర్‌లో వరదనీటి కాల్వ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కేయూ జంక్షన్‌లో చింతగట్టు, వంగపహాడ్‌, హసన్‌పర్తి వద్ద నిర్మించనున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. సుందరీకరించిన కేయూ జంక్షన్‌, అంబేద్కర్‌ జంక్షన్‌ను ప్రారంభించారు. ఐబీ అతిథి గృహం వద్ద సమీకృత

మార్కెట్‌ పనులకు శంకుస్థాపన చేశారు.
హన్మకొండ  పద్మాక్షి గుట్ట వద్ద అగ్గలయ్య గుట్ట పర్యాటక ప్రాంతాన్ని, సరిగమ పార్క్‌ను ప్రారంభించారు. అలాగే సాంస్కృతిక కేంద్రానికి పునాది రాయి వేశారు. భద్రకాళి బయో డైవర్సిటీ కల్చరల్‌ పార్క్‌ను ప్రారంభించారు. భద్రకాళి చెరువు ఫోర్‌షోర్‌ అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. కాజీపేట ఫాతిమా జంక్షన్‌లో పబ్లిక్‌ స్పేస్‌ డెకోరేటివ్‌ లైటింగ్‌ను ప్రారంభించారు.
మంత్రి కేటీఆర్‌ వెంట పర్యటనలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతిరాథోడ్‌తో పాటు ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, డాక్టర్‌ తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవ రెడ్డి, రైతు రుణ విమోచన కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, కమిషనర్‌ పమేలా సత్పతి,  పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి తదితరులు ఉన్నారు.

ముందస్తు అరెస్టులు
కేటీఆర్‌ పర్యటన సందర్భంగా పోలీసులు బీజేపీ నేతలు, ఏబీవీపీ, ఇతర విద్యార్థి సంఘాల నాయకులను ఆదివారం రాత్రి నుంచే అరెస్టు చేశారు. అర్ధరాత్రి నాయకుల ఇళ్లకు వెళ్ళి గాలింపు చేపట్టారు. కేయూ క్యాంప్‌సలో సోదాలు చేసి దొరికినవారిని దొరికినట్టు అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా వివిధ పోలీ్‌సస్టేషన్ల చుట్టూ తిప్పారు. మంత్రి కేటీఆర్‌ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్లే వరకు పలు పోలీస్‌ స్టేషన్లలో రాత్రి వరకు నిర్బంధించారు. అరెస్టు చేసిన వారి నుంచి సెల్‌ఫోన్లను లాక్కున్నారు. సుమారు 100 మందికిపైగా అరెస్టు చేసినట్టు సమాచారం. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సిద్ధం నరేష్‌ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. పోలీసులు నరేష్‌ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన బీజేపీ నాయకుల్లో  బాకం హరిశంకర్‌, అపురూప సాయి, కుసుమ సతీష్‌ ఉన్నారు. వీరిని జనగామ జిల్లా లింగాలఘణపూర్‌ స్టేషన్‌కు తరలించారు. కనుకుంట్ల రంజిత్‌, బైరి శ్యాం సుందర్‌, గడ్డం మహేందర్‌, గౌతమ్‌లను మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్‌లో ఉంచారు. బీజేపీ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పలువురు విద్యార్థులను స్టేషన్‌ ఘన్‌పూర్‌ పీఎ్‌సలో ఉంచారు.

కాన్వాయ్‌ని అడ్డుకున్న ఏబీవీపీ
మంత్రి కేటీఆర్‌ తన పర్యటనను ప్రత్యేక బస్సులో సాగించారు. దారి పొడవునా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి పర్యటనలో భాగంగా కాన్వాయ్‌ వరంగల్‌ పోచమ్మమైదాన్‌ జంక్షన్‌ వద్దకు చేరుకోగానే అప్పటివరకు పోలీసుల కంటపడకుండా మాటు వేసి ఉన్న సుమారు 30 మంది ఏబీవీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు దూకారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు. రోప్‌ పార్టీని తప్పించుకొని బస్సుకు అడ్డంగా ఉన్న తాళ్లపై నుంచి దూకి బస్సు ముందుకు వచ్చి రోడ్డుపై పడుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి పోలీసులు కంగుతిన్నారు. వెంటనే ఆందోళనకారులను అక్కడి నుంచి ఈడ్చుకెళ్లే యత్నం చేయగా కార్యకర్తలకు పోలీసులకు మధ్యకొద్ది సేపు తీవ్ర స్థాయిలో పెనుగులాట జరిగింది. కార్యకర్తల అరుపులతో, పోచమ్మమైదాన్‌ జంక్షన్‌ రణరంగంగా మారింది. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసులు కార్యకర్తలను అక్కడి నుంచి బలవంతంగా లాక్కెల్లారు. ఈ సందర్భంగా సుమారు 20 మంది ఏబీవీపీ కార్యాకర్తలను అరెస్టు చేసి మామునూరు పోలీస్‌ స్టేషన్‌కు  తరలించారు. అనంతరం కేటీఆర్‌ కాన్వాయ్‌ ముందుకు సాగింది.  

భద్రకాళి బండ్‌ బాగుంది..
ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ ప్రశంస

వరంగల్‌ సిటీ, ఏప్రిల్‌ 12 : వరంగల్‌ భద్రకాళి బండ్‌ చాలా బాగుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ కితాబు ఇచ్చారు. పర్యాటకుల మనస్సు దోచేలా అద్భుతంగా నిర్మించారంటూ ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డిని అభినందించారు. సోమవారం వరంగల్‌ నగర పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ భద్రకాళి బండ్‌ను ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు భద్రకాళి బండ్‌ అందాలను వీక్షించారు. బండ్‌ నిర్మాణం, విశిష్టత గురించి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను చూశారు. అనంతరం రూ.65కోట్లతో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు ద్వారా చేపట్టనున్న బండ్‌ రెండో దశ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ పాల్గొన్నారు.































Updated Date - 2021-04-13T06:35:02+05:30 IST