వేగంగా అంజలి శనివారం రోడ్డు నిర్మాణ పనులు

ABN , First Publish Date - 2022-05-19T06:41:41+05:30 IST

అంజలి శనివారం ప్రధాన రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు.

వేగంగా అంజలి శనివారం రోడ్డు నిర్మాణ పనులు
ఎ.శనివారం రహదారిని పరిశీలిస్తున్న పీవో రోణంగి గోపాలక్రిష్ణ

- కాంట్రాక్టర్‌కు ఐటీడీఏ పీవో ఆదేశం

- అంజలిశనివారం, లంబసింగి పంచాయతీల్లో ఆకస్మిక పర్యటన

- విధులకు గైర్హాజరైన వెల్ఫేర్‌ అసిస్టెంట్‌కి షోకాజు నోటీసు

- సచివాలయం వీఆర్వో, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌కి రెండు రోజుల జీతం నిలిపివేత

- వీఆర్వోకి నెల రోజుల వేతనం కట్‌


చింతపల్లి, మే 18: అంజలి శనివారం ప్రధాన రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. బుధవారం చింతపల్లి మండలంలోని అంజలిశనివారం, లంబసింగి పంచాయతీల్లో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. తొలుత సుదీర్ఘకాలంగా నిర్మాణానికి నోచుకోకపోవడం, పలుమార్లు అంజలి శనివారం పంచాయతీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పత్రికల్లో వరుస కథనాలు రావడంతో ఆయన స్పందించారు. జాజులపాలెం నుంచి అంజలి శనివారం వరకు ప్రజలకు అందుబాటులో ఉన్న రహదారిని పరిశీలించారు. స్థానిక గిరిజనులతో మాట్లాడి రవాణా కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీవో స్థానికులు, పీఆర్‌ ఏఈఈ, కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. జాజులపాలెం నుంచి అంజలిశనివారం వరకు రహదారి నిర్మాణానికి రూ.రెండు కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు మంజూరయ్యాయన్నారు. బిల్లుల చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, వెంటనే  పనులను ప్రారంభించాలని కాంట్రాక్టర్‌ని ఆదేశించారు. మూడు నెలల్లో రహదారి పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం రాజుబంధ గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యతను ఆయన పరిశీలించారు. అలాగే గ్రామంలో నాబార్డు నిధులతో నిర్మిస్తున్న 25వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్‌ ట్యాంక్‌ను 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. 

విధులకు గైర్హాజరైన సచివాలయ ఉద్యోగులపై చర్యలు

అంజలి శనివారం గ్రామ సచివాలయంలో అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన గ్రామ సచివాలయం ఉద్యోగులపై ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. విధులకు గైర్హాజరైన వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ రఘుబాబుకు షోకాజు నోటీసు జారీ చేయాలని ఎంపీడీవో లాలం సీతయ్యను ఆదేశించారు. అలాగే సచివాలయానికి రెండు రోజులుగా విధులకు హాజరుకాని వీఆర్వో కేఎస్‌ఎస్‌వీ కుమారి, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ జగజీవన్‌ కుమార్‌కి రెండు రోజుల జీతం నిలిపివేయాలని పీవో ఆదేశించారు. స్థానిక వీఆర్వో సాల్మన్‌రాజు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని పీవోకి సర్పంచ్‌ పేట్ల రాజుబాబు ఫిర్యాదు చేయడంతో నెల రోజుల జీతం నిలిపివేస్తున్నట్టు పీవో వెల్లడించారు. ఆయన వెంట పీఆర్‌ డీఈఈ నరేన్‌, ఏఈఈ కిల్లో జ్యోతిబాబు, టీడబ్ల్యూ డీఈఈ చాణిక్యరావు, ఏఈ రఘునాథరావు నాయుడు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-19T06:41:41+05:30 IST