పండ్ల తోటలకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-08-03T04:58:54+05:30 IST

ఉపాధిహామీ పథకం కింద పండ్లతోటల పెంపకానికి జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ రైతులకు అవకాశం కల్పిస్తోంది. సన్న, చిన్నకారు రైతులకు పండ్లతోటల పెంపకంపై అవగాహన కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తోంది. 2021–22కు సంబంధించి గ్రామీణాభివృద్ధిశాఖ డీపీఎం, ఏపీఎంలు, సీసీలు రైతుల ఎంపిక ప్రకియను కొనసాగిస్తున్నారు.

పండ్ల తోటలకు ప్రాధాన్యం
లక్ష్మీనగర్‌లో ఉపాధిహామీలో భాగంగా ఏర్పాటు చేసిన పండ్లతోట

ఉపాధిహామీ పథకంలో భాగంగా అవకాశం కల్పిస్తున్న సర్కారు

ఐదెకరాలు మించకుండా ఒకేచోట పొలం, నీటి వసతి ఉన్న రైతులకు ఛాన్స్‌


మెదక్‌, ఆగస్టు 2: ఉపాధిహామీ పథకం కింద పండ్లతోటల పెంపకానికి జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ రైతులకు అవకాశం కల్పిస్తోంది. సన్న, చిన్నకారు రైతులకు పండ్లతోటల పెంపకంపై అవగాహన కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తోంది. 2021–22కు సంబంధించి గ్రామీణాభివృద్ధిశాఖ డీపీఎం, ఏపీఎంలు, సీసీలు రైతుల ఎంపిక ప్రకియను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 60 ఎకరాల్లో జామ, మామిడి తోటట సాగు పనులు వివిధ దశల్లో ఉన్నాయి. నీటి వసతితో పాటు ఐదెకరాలకు మించకుండా పొలం ఒకేచోట ఉంటే అక్కడ పండ్లతోట పెంపకానికి అవకాశం కల్పిస్తున్నారు. జామ, మామిడి తోటల పెంపకానికి ప్రాధాన్యతనిస్తున్నారు. వ్యవసాయక్షేత్రంలో పొలం చదునుతో పాటు ఇతర పనులు ఉపాధిహామీ కింద చేపడుతున్నారు. రైతుకు కూలీ డబ్బులు చెల్లిస్తారు. ఎకరంలో 70 మొక్కలు వచ్చేలా పండ్లతోట సాగుచేస్తున్నారు. ఒక్కో మొక్కకు రూ.28, ఎరువుకు రూ.25 చొప్పున రైతుకు చెల్లించనున్నారు. పండ్లతోట సాగవుతున్న క్రమంలో భూగర్భజలాల మట్టాలు తగ్గిపోతే మొక్కలకు నీరందించడానికి ట్యాంకర్ల ఏర్పాటుకు గ్రామీణాభివృద్ధిశాఖ ఉపాధి కింద ఆర్థిక సాయం అందజేస్తున్నది. నీరందించడానికి ఒక్కో మొక్కకు రూ.15 చొప్పున రైతుకు డబ్బు సమకూరుస్తుంది. 


 ఆసక్తి చూపని రైతులు

తెలంగాణ ప్రభుత్వం పండ్లతోటల పెంపకానికి రైతులకు అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నా కూడా అన్నదాతలు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం జామ, మామిడి, సీతాఫలం, శ్రీగంధం, నిమ్మ తోటల పెంపకానికి ప్రాధాన్యతనిస్తోంది. అయినా కూడా రైతులు ముందుకు రావడం లేదు. జిల్లాలో వరి, పత్తి పంటల సాగుకు రైతులు ప్రాధాన్యతనిస్తుండడంతో కూరగాయలు, పండ్ల తోటల సాగు తగ్గిపోయింది. ప్రస్తుతం మెదక్‌ జిల్లాలో తోటల పెంపకానికి సాగుభూమి సేకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. పాపన్నపేట, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, నర్సాపూర్‌, శివ్వంపేట, తూప్రాన్‌, చేగుంట, నార్సింగి, నిజాంపేట, చిన్నశంకరంపేట తదితర మండలాల్లో భూసేకరణ చేపట్టాలని, 2021–22కి సంబంధించి జిల్లావ్యాప్తంగా 60 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచడానికి గ్రామీణాభివృద్ధిశాఖ లక్ష్యం నిర్ధేశించుకున్నది. 

Updated Date - 2021-08-03T04:58:54+05:30 IST