Abn logo
Jul 31 2021 @ 02:21AM

ఫాంహౌస్‌, ప్రగతి భవన్‌ను.. లక్ష నాగళ్లతో దున్నుతాం

  • ఆ భూములను పేదలకు పంచుతాం
  • ప్రగతి భవన్‌ను కూల్చి అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తాం 
  • అధికారంలోకి రాగానే తొలి సంతకం ఆ ఫైలుపైనే
  • దళితబంధు కింద రూ.50 లక్షలు ఇవ్వాలి
  • బై ఎలక్షన్‌ కాదు.. బైయింగ్‌ ఎలక్షన్‌: బండి సంజయ్‌ 


హైదరాబాద్‌/కవాడిగూడ/న్యూఢిల్లీ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 2023లో బీజేపీ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌, ప్రగతి భవన్‌ను లక్ష నాగళ్లతో దున్నుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఆ భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతామని ప్రకటించారు. ప్రగతి భవన్‌ను దున్ని, అక్కడ 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం పెడతామని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి సంతకం ఆ ఫైలుపైనే ఉంటుందని తెలిపారు. ఓట్ల కోసమే దళిత బంధు ప్రకటించామని కేసీఆర్‌ బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో జరిగేది బై ఎలక్షన్‌ కాదని.. బైయింగ్‌ ఎలక్షన్‌ అని ఆరోపించారు. కేసీఆర్‌ ఎన్ని అడ్డదారుల్లో వెళ్లినా అక్కడ ఎగిరేది కాషాయ జెండానే అని తేల్చిచెప్పారు. 


శుక్రవారం ఇందిరాపార్కు వద్ద బీజేపీ నిర్వహించిన బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నాలో సంజయ్‌ మాట్లాడారు. పోడు భూములకు పట్టాలిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌, పంట చేతికొచ్చే సమయంలో ఫారెస్టు అధికారులను పంపి నాశనం చేస్తున్నాడని దుయ్యబట్టారు. దళితబంధు పథకం కింద రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షలతో ఎకరా భూమి కూడా రాదన్నారు. దళితులకు మూడెకరాలు ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించినందున.. మూడెకరాల కొనుగోలుకు రూ.30లక్షలు, డబుల్‌ బెడ్‌రూం ఇంటికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.50 లక్షలు ఇవ్వాలన్నారు. ‘‘బీసీ సబ్‌ప్లాన్‌ ఏమైంది? ఆత్మగౌరవ భవనాలు ఏమయ్యాయి? ఎంబీసీలకు రూ.వెయ్యి కోట్లు ఏమయ్యాయి? హుజూర్‌నగర్‌, సాగర్‌లో గొల్ల కురుమలకు గొర్రెలు ఏమయ్యాయి?’’ అని సంజయ్‌ ప్రశ్నించారు. ఎస్సీ సమాజానికి జరిగిన అన్యాయాన్ని వివరించడానికి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 10వేల మందితో డప్పులమోత మోగిస్తామని, ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో పోడు భూముల కోసం ఆందోళన, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.


భోజనం పెట్టారంటే.. పంగనామాలు పెట్టినట్లే: లక్ష్మణ్‌

సీఎం కేసీఆర్‌ తన కుటుంబం కోసం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. ‘‘బీసీ సబ్‌ప్లాన్‌ పేరిట పార్టీలు, సంఘాల నాయకులను పిలిచి మూడు రోజుల పాటు భోజనం పెట్టి, సమావేశాలు నిర్వహించారు. మూడేళ్లు గడచినా బీసీ సబ్‌ప్లాన్‌కు అతీగతీ లేదు.. కేసీఆర్‌ భోజనం పెట్టారంటే.. పంగనామాలు పెట్టినట్లే’’ అని అన్నారు. జీహెచ్‌ఎంసీలో వరద బాధితుల్లాగే.. హుజూరాబాద్‌ ఎన్నిక తర్వాత దళితబంధును కేసీఆర్‌ పట్టించుకోరని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌కు ఆస్కార్‌ ఇవ్వొచ్చని ఎంపీ సోయం బాపురావు విమర్శించారు. ‘‘తెలంగాణ వస్తే నన్ను సీఎం చేస్తానని ఉద్యమ సమయంలో కేసీఆర్‌ చెప్పిండు.. నేను ముఖ్యమంత్రి అయింది ఎంత నిజమో.. దళితబంధు కూడా అంతే నిజం’’ అని మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ అన్నారు. హుజూరాబాద్‌లో ఓట్ల కోసమే దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని మాజీ ఎంపీ వివేక్‌ ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఈటలకు 75 శాతం మద్దతు ఉందని ఒక సర్వేలో తేలిందన్నారు.