భారీ వర్షాలతో రైతులు విలవిల

ABN , First Publish Date - 2022-05-16T06:24:34+05:30 IST

అకాల వర్షాలతో రైతులు విలవిలలాడుతున్నారు. ఉద్యానపంటలు చేతికి వస్తున్న తరుణంలో ఎడ తెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటం వారిలో ఆందోళన కల్గిస్తోంది.

భారీ వర్షాలతో రైతులు విలవిల
దెబ్బతిన్న టమోటా తోట

రామకుప్పం/శాంతిపురం/ గుడుపల్లె, మే 15: అకాల వర్షాలతో  రైతులు విలవిలలాడుతున్నారు. ఉద్యానపంటలు చేతికి వస్తున్న తరుణంలో ఎడ తెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటం వారిలో ఆందోళన కల్గిస్తోంది. రామకుప్పం, శాంతిపురం , గు డుపల్లె మండలాల్లో శనివారం సాయంత్రం, రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలతో టమెటా, బీన్స్‌, కాకర, వరి పంటలు నేలవాలాయి. కాస్తో కూస్తో కాపుకాసిన మామిడి కాయలు నేలరాలిపోయాయి. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో రైతులు అధికశాతం ఉద్యానపంటలు సాగు చేస్తున్నారు. వారం రోజుల క్రితం కురిసిన వడగండ్లు, పెను గాలులతో రైతుకు కడగండ్లను మిగిల్చింది. టమో టా, బీన్స్‌, అరటి, కాకర, చిక్కుడు తోటలు, వరి నేలవాలాయి. పంటలు దిగుబడి వచ్చే సమయంలో కురుస్తున్న భారీ వర్షాలకు నేలలో తేమశాతం పెరి గి దిగుబడుల్లో నాణ్యలోపించి నష్టాలకు గురికా వాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ముఖ్యంగా టమోటా, బీన్స్‌, చిక్కుడు పంటలు సాగు చేసిన రైతులు నిర్వేదంలో మునిగిపోయారు. గుడుపల్లె మండలంలో టమోట, చిక్కుడు, బీన్స్‌, ఉర్లగడ్డ, బంతి, చామంతి పంటలు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. కోతకు వచ్చిన రాగి, వరి ఒబ్బిడి చేసి  ఇంటికి తీసుకువచ్చే సమయంలో వానకు నేలకు వాలడంతో రైతులకు ఇబ్బందిగా మారింది.  వర్షాలకు పంటలకు తెగుళ్లు సోకుతాయేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


వి.కోటలో  మామిడికి తీవ్ర నష్టం


వి.కోట: మండలంలో కురిసిన భారీ వర్షానికి మామిడి సహా ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వి.కోట మండల పరిధిలో 60.2 ఎం.ఎం. వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్‌ సీతారామన్‌ తెలిపారు. శనివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాన క్రమేపీ పుంజుకుని రాత్రంతా కురిసింది.  భారీ వర్షానికి పట్టణంలోని పలుప్రాంతాలు జలమయమయ్యాయి. మార్కెట్‌ యార్డు ఎదురుగా ప్రధాన రహదారి వాననీటితో నిండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దుర్గానగర్‌లో లోతట్టు ప్రాంతం నీటితో నిండి పలు వీధుల్లో జనం  ఇబ్బందులు పడ్డారు.  బస్టాండు నుంచి వాననీరు ప్రధాన రహదారి పక్కనున్న మురుగు కాల్వలో నిండి మురుగు పొంగడంతో ఆ ప్రాంతం అపరిశుభ్రంగా తయారైంది. భారీగా వీచిన గాలులకు మామిడి కాయలు రాలిపడ్డాయి. టమోటా, వరి, రాగి, చిక్కుడు, అరటి తోటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొత్తానికి మండల పరిధిలో  వారం రోజులుగా గాలివాన  నానా బీభత్సం సృష్టించింది. 


Updated Date - 2022-05-16T06:24:34+05:30 IST