తేలని కిరాయి.. అందని నగదు

ABN , First Publish Date - 2022-08-01T05:30:00+05:30 IST

జిల్లాలో వందలాది మంది రైతులు ధాన్యం రవాణా చార్జీల కోసం ఎదురుచూస్తున్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం విక్రయించినా.. ఇంతవరకు ప్రభుత్వం నగదు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని రైతుభరోసా కేంద్రాల(ఆర్‌బీకే) ద్వారా విక్రయించారు. కిరాయి సొమ్ము చెల్లించడానికి ప్రభుత్వం ముందుగానే బడ్జెట్‌లో నిధులు కేటాయించినా.. ఖాతాల్లో జమ చేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.

తేలని కిరాయి.. అందని నగదు
మిల్లుకు ట్రాక్టర్లలో ధాన్యం బస్తాలు తరలిస్తున్న రైతులు (ఫైల్‌)

ధాన్యం రవాణా చార్జీల కోసం రైతుల నిరీక్షణ

(ఇచ్ఛాపురం రూరల్‌)
ఇచ్ఛాపురం మండలం డొంకూరుకు చెందిన దున్న లోకనాధం ఖరీఫ్‌లో ధాన్యం విక్రయించేందుకు రైతుభరోసా కేంద్రానికి వెళ్లగా ముచ్చింద్రలోని రామకృష్ణ రైస్‌మిల్లుకు పంపించారు. గ్రామం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లుకు ట్రాక్టర్‌పై మూడు విడతలు ధాన్యం తీసుకువెళ్లారు. ఇందుకోసం ట్రాక్టర్‌కు కిరాయి రూ.10వేలు చెల్లించానని, ఇప్పటివరకు ఆ డబ్బులు తమ ఖాతాలో జమ కాలేదని లోకనాథం వాపోతున్నాడు.

ఇచ్ఛాపురం మండలం చిన్నలక్ష్మీపురానికి చెందిన రైతు ఇరోతు లక్ష్మయ్య కూడా గ్రామం నుంచి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచింద్రలోని రామకృష్ణ మిల్లుకు ధాన్యం విక్రయించాడు. ట్రాక్టర్‌పై ఆరు విడతలు ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్లేందుకు రూ.20వేలు కిరాయి చెల్లించాడు. ప్రభుత్వం ఇంతవరకు కిరాయి డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

జిల్లాలో వందలాది మంది రైతులు ధాన్యం రవాణా చార్జీల కోసం ఎదురుచూస్తున్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం విక్రయించినా.. ఇంతవరకు ప్రభుత్వం నగదు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని రైతుభరోసా కేంద్రాల(ఆర్‌బీకే) ద్వారా విక్రయించారు. ప్రభుత్వం క్వింటా ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని రూ.1,960కు, సాధారణ రకాన్ని రూ.1,940కు కొనుగోలు చేసింది. ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేసిన ధానాన్ని రైతులు కల్లాల నుంచి ట్రాక్టర్లతో మిల్లులకు తమ సొంత ఖర్చులతో తరలించారు. ఎకరం సాగు చేసిన రైతు ధాన్యాన్ని మిల్లుకు తరలించేందుకు సరాసరి రూ.2,500 ఖర్చయింది. సొంత ట్రాక్టర్లు లేని రైతులు అద్దె ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు తీసుకెళ్లారు. కిరాయి సొమ్ము చెల్లించడానికి ప్రభుత్వం ముందుగానే బడ్జెట్‌లో నిధులు కేటాయించినా.. ఖాతాల్లో జమ చేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. కిలోమీటర్‌కు ఎంత కిరాయి ఇవ్వాలనే విషయం తేల్చకపోవడమే జాప్యానికి కారణమని తెలుస్తోంది. జిల్లాలో ఖరీఫ్‌లో ప్రభుత్వం 6.22 లక్షల మెట్రిక్‌ టన్నులు, రబీలో 11,600 టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. రైతు పొలం నుంచి ధాన్యం మిల్లు ఎనిమిది కిలోమీటర్లు లోపు ఉంటే ఒక ధర, ఎనిమిది కిలోమీటర్లు దాటితే మరో ధర చెల్లించాలి. ఫౌరసరఫరాల శాఖ అధికారులు కిరాయిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా రైతుల ఖాతాలకు సొమ్ము జమ కావడం లేదు. వెంటనే నగదు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు. ఖరీఫ్‌ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సొమ్ము విడుదల చేస్తే పెట్టుబడి కింద ఉపయోగపడుతుందని అన్నదాతలు చెబుతున్నారు.

వివరాలు సేకరిస్తున్నాం
రైతుభరోసా కేంద్రాల నుంచి ఎంతమంది రైతులు.. ఏఏ మిల్లులకు విక్రయించారో వాటి మధ్య దూరం ఎంతనే దానిపై అన్ని వివరాలు సేకరిస్తున్నాం. కొన్ని గ్రామాల నుంచి మిల్లుకు మధ్య దూరం గూగుల్‌లో కూడా దొరకడం లేదు. అలాంటి వాటిని సేకరించి లెక్క కడుతున్నాం. దీనికి సమయం పడుతుంది. తప్పకుండా రైతులందరికీ రవాణా చార్జీలు చెల్లిస్తాం.
- ఎం.జయంతి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌.

 

Updated Date - 2022-08-01T05:30:00+05:30 IST