రైతుల చూపు.. వరి వైపే..

ABN , First Publish Date - 2022-06-26T06:07:10+05:30 IST

రైతన్నలు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు.

రైతుల చూపు.. వరి వైపే..

- 2.5 లక్షల ఎకరాల్లో సాగుకు సన్నద్ధం

- ప్రతికూల పరిస్థితుల్లోనూ ముందుకే..

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రైతన్నలు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు.  జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో వరినాట్లు వేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యాసంగిలో పండిన ధాన్యం అతి కష్టంగా అమ్ముకున్నారు. ఇప్పుడు ఆ ధాన్యం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. వానాకాలంలో పండిన వరిధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందో లేదో అన్న అనుమానాలున్నా వరిసాగు తప్ప మరేమీ చేయలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. యాసంగిలో బియ్యం సేకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేయడంతో 20 రోజులుగా కస్టమ్‌ మిల్లింగ్‌ నిలిచిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యం రైస్‌ మిల్లుల్లో పేరుకుపోయింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు 200 నుంచి 250 రూపాయల నష్టానికైనా ధాన్యాన్ని వేలం వేసి విక్రయించాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తున్నది. 

 జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో సాగు

జిల్లాలో వానాకాలం రెండున్న లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. ఎకరాకు 23 నుంచి 24 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తే సుమారు 5 లక్షల 75 వేల నుంచి ఆరు లక్షల పైచిలుకు మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుంది. జిల్లాలో 80 శాతం విస్తీర్ణంలో రైతులు దొడ్డురకం వరినే సాగు చేస్తారు. ఈ ధాన్యంతో వచ్చిన బియ్యం ఇక్కడ తినేవారు తక్కువే. ప్రభుత్వం సేకరిస్తే తప్ప ఈ ధాన్యానికి డిమాండ్‌ ఉండని పరిస్థితి ఉన్నది. పంటకాలం ఎక్కువ కావడం, చీడపీడల బాధ అధికంగా ఉండి, ఎక్కువ పురుగు మందులు కొట్టాల్సి రావడంతో పెట్టుబడులు పెరగడం, దిగుబడి తక్కువ, శ్రమ ఎక్కువ కావడంతో రైతులు సన్నరకం వరిధాన్యం సాగుకు ముందుకు రావడం లేదు. ఇంటి అవసరాలకు పోనూ మిగతా విస్తీర్ణంలో దొడ్డురకం వరినే సాగు చేస్తున్నారు. కొందరైతే దొడ్డురకం వరి ధాన్యం పండించి మార్కెట్‌లో సన్న బియ్యం కొనుక్కొని వినియోగించుకుంటున్నారు. ఈ వానాకాలం కూడా సుమారు 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి రానున్నది. ఇందులో రైతుల సొంత అవసరాలు, విత్తన పంట పోనూ సుమారు నాలుగున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతులు విక్రయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వరిసాగు జరుగుతున్నందున వచ్చిన ధాన్యం అమ్ముకునేది ఎలా అన్న అనుమానాలున్నా ప్రత్యామ్నాయ సాగుకు వెళ్లే పరిస్థితి లేక రైతులు జూదంలాంటి వరిసాగుకే మొగ్గు చూపిస్తున్నారు. 

 సన్నరకాలపై దృష్టి సారించని అన్నదాతలు

రైతులు నష్టపోకుండా ఉండడానికి సన్నరకాలను సాగు చేయాలని వ్యవసాయశాఖ సూచిస్తున్నది. మార్కెట్‌లో అందరూ సన్నబియ్యం వినియోగిస్తున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయకపోయినా మిల్లర్లు కొనుగోలు చేసి బియ్యం మరాడించి మార్కెట్‌లో అమ్ముకునే అవకాశాలుంటాయి. పెట్టబడి, శ్రమ ఎక్కువైనా రైతులు సన్నరకం వరిసాగు చేపడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జిల్లాలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి కస్టమ్‌ మిల్లింగ్‌ చేపట్టకపోతే పెట్టుబడులు లేని రైస్‌ మిల్లర్లు తమ వ్యాపారాలను మానుకునే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో సుమారు 190 రైస్‌ మిల్లులున్నా పెట్టుబడి పెట్టి వరిధాన్యం కొనుగోలు చేయగలిగిన శక్తి సుమారు 50 మంది మిల్లర్లకు మాత్రమే ఉందని చెబుతున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత రైతులుు వెచ్చించి చేన్లు, పెరండ్లు అన్నింటికి మడులుకట్టి వరిసాగుకు అనువుగా మార్చుకున్నారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ సాగు చేపట్టాలంటే మళ్లీ మడులు తొలగించి ఆయా పంటలకనుగుణంగా మార్చుకోవడానికి మళ్లీ పెద్ద ఎత్తున డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. అందుకే రైతులు ప్రత్యామ్నాయ సాగువైపు దృష్టిసారించడం లేదు. వరిధాన్యం కొనుగోలు వ్యవహారం ప్రశ్నార్థకంగా ఉన్నా అనివార్యమైన పరిస్థితుల్లోనే రైతులు ఆ సాగుకు పూనుకుంటున్నారు.

 ఇంకా అందని యాసంగి డబ్బులు

జిల్లాలో యాసంగిలో అమ్ముకున్న వరిధాన్యం డబ్బులు ఇంకా రైతులకు అందలేదు. సివిల్‌ సప్లయీస్‌ శాఖ ధాన్యం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని చెబుతోంది, రైతులకు ఆ మేరకు ఓటీపీలు అందినా బ్యాంకులు డబ్బులు చెల్లించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకా డబ్బులుజమకానివారు కూడా ఎందరో ఉన్నారు. వరిధాన్యం డబ్బు అందకపోవడం, ప్రభుత్వం ఇంకా రైతుబంధు సహాయం విడుదల చేయకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు పంట రుణాల జారీ ప్రక్రియ కూడా వేగవంతంగా జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి.  

Updated Date - 2022-06-26T06:07:10+05:30 IST