వానమ్మ.. నీజాడేదమ్మా

ABN , First Publish Date - 2020-07-03T11:18:46+05:30 IST

మేఘాలు దోబూచులాడుతున్నాయి. ముందు మురిపించిన వర్షాలు మళ్లీ వెనక్కి తిరిగిచూడడంలేదు

వానమ్మ.. నీజాడేదమ్మా

ఆకాశంవైపు రైతుల చూపు

తుంపర్లతో పంటలకు నీరుపారిస్తున్న వైనం

వరుణుడి కరుణ కోసం పూజలు


అచ్చంపేట,  జూలై 2 : మేఘాలు దోబూచులాడుతున్నాయి. ముందు మురిపించిన వర్షాలు మళ్లీ వెనక్కి తిరిగిచూడడంలేదు. తొలకరి వర్షాలకు వేసిన విత్తనాలు తడిలేక మొలకెత్తడం లేదు. జిల్లాలోని అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తి డివిజన్‌లలో పెద్ద మొత్తంలో మెట్టపంటలు సాగయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 2.49లక్షల ఎకరాలలో పత్తి సాగు చేసినట్లు అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. అచ్చంపేట డివిజన్‌లో 98,059ఎకరాలలో మెట్ట పంటలు సాగు చేశారు. 20 రోజులుగా  వరుణుడు ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోతున్నాయి. జూన్‌ మొదటి వారంలో అడపాదడప వానలు కురిసినా, జిల్లాలో మాత్రం పూర్తిస్థాయిలో వర్షాలు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు.


నీటి వసతి ఉన్న రైతులు స్ర్పింక్లర్లతో తమ పంటలకు నీరు పెడుతున్నారు. వర్షాల కోసం గ్రామాలలో గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు. వరదపాశాలు పోయడం, దేవుళ్లకు జాలాభిషేం చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. మబ్బులు కమ్మినట్లే కమ్మి అంతలోనే తేటతెల్లం అవుతుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 


నీటి వసతి ఉన్న రైతులు పారించుకోవాలి : ఏడీఏ 

నీటివసతి ఉన్న రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు నీరుపెట్టాలని వ్యవసాయ అధికారి విజయనిర్మల అన్నారు. పత్తి, కంది వంటి పంటలు వర్షాలు రాకపోయినా కొంతమేర ఎండిపోకుండా ఉండగలవని, ఈ సమయంలో ఎలాంటి రసాయనాలు పిచికారి చేయొద్దని సూచించారు. 

Updated Date - 2020-07-03T11:18:46+05:30 IST