వ్యవసాయ బిల్లులకు నిరసనగా సెప్టెంబర్ 25న భారత్ బంద్

ABN , First Publish Date - 2020-09-24T01:27:39+05:30 IST

అఖిల భారత రైతు సంఘం(అఖిల్ భారతీయ్ కిసాన్ సంఘర్ష్ సమన్వయ్ సమితి-AIKSCC) వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది...

వ్యవసాయ బిల్లులకు నిరసనగా సెప్టెంబర్ 25న భారత్ బంద్

  • నేషనల్ హైవే, రైలు మార్గాలపై బంద్ ప్రభావం

అఖిల భారత రైతు సంఘం(అఖిల్ భారతీయ్ కిసాన్ సంఘర్ష్ సమన్వయ్ సమితి-AIKSCC) వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. అఖిల భారత రైతు సంఘానికి  ప్రతిపక్షాలతోపాటు దేశంలోని 250 చిన్న రైతు సంఘాలు కూడా మద్దతు పలికాయి. నేషనల్ హైవే, రైలు మార్గాలపై బంద్ ప్రభావం ఉండే అవకాశం ఉంది.


దేశంలోని పలు రాష్టాల్లో రైతులు ఈ బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారిని అఖిల భారత రైతు సంఘం నాయకుడు సర్దార్ వీఎం సింగ్ తెలిపారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు తాము చేసే బంద్‌ను బలపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.


కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ బిల్లులు చట్ట రూపం దాలిస్తే దాని వల్ల కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే లాభాలు వస్తాయని, రైతులకు నష్టాలు తప్పవని ఆయన చెప్పారు. రైతుల నుంచి ఇంతవరకు ధాన్యం కొనుగోలు చేసే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు కూడా తమ ప్రాధాన్యం కోల్పోతాయని ఆయన అన్నారు. బిల్లులు ప్రవేశ పెట్టే ముందు రైతు సంఘాలతో ఒక్కసారి కూడా ప్రభుత్వం చర్చించలేదని వీఎం సింగ్ చెప్పారు. తాము శాంతిపూర్వకంగానే భారత్ బంద్ చేస్తామని అఖిల భారత సంఘం నాయకులు అంటున్నారు.


Updated Date - 2020-09-24T01:27:39+05:30 IST